పంటపూటడాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావుప్రగడావఝ్జల నరసింహమూర్తి విశాఖపట్నంలో ఫస్టురకం పౌరోచ్చుడు. క్రిమినల్‌ కర్మల్లో అతగాడికి మించిన దొడదోపిడీ పంతులు మరొహడుండడు. తద్దినాలు, మాసికాలు, దానాలు, దహనాలు, దశాహాలు... అబ్బో ఇవన్నీ ఆ మహానుభావుడికి నెత్తిమీది దేవతలు. పిలిస్తే పలికే పితృదేవతలు.మూర్తికి మనసుండదని, పూజల పేరిట పీడిస్తాడని ఊళ్ళో చాలా మంది అంటుంటారు. ఆ మాటకొస్తే మూర్తికి మనసే కాదు, శరీరం కూడా సరిగ్గా ఉండదని, శుచీశుభ్రత అస్సలే ఉండదని, వాణ్ణి బ్రేమ్మడంటే మహాపాపం చుట్టుకుంటుందని మరి కొంతమంది సణుక్కుంటుంటారు.

నరసింహమూర్తి కాళ్ళు కడిగి ఎన్నాళ్ళవుతుందంటే కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. పది రోజులు కావచ్చు, పక్షం రోజులు కావచ్చు లేదా నెలన్నా కావచ్చు. అందుకే ఆయనగారి పాదాలు మట్టికొట్టుకుపోయి ఎడాపెడా పగిలిపోయి నలిగిపోయి పరమ దయిద్రగొట్టుగా కనిపిస్తుంటాయి. పోనీ, రోజూ స్నానమయినా చేస్తాడా అంటే అదేం లేదు. మంత్రాలు కాకరబీకరగా చదవడానికి, ఎదుటి మనిషికి నీతులుచెప్పడానికే టైము సరిపోదు. ఇక స్నానం ఎక్కడ.సరే. మూర్తి ఎలా మండినా వాల్తేరులో ఆ మహనీయుడికి తిరుగులేదు. ఈ మధ్య వైజాగంతా మహానగరంగా మారిపోయిన తరుణంలో అపరకర్మలుచేయించే పురోహితగణానికి కరువొచ్చి పడింది. ఎలాంటి వాడయినా ఫరవాలేదు, బ్రేమ్మడయితే చాలు... అన్నట్టుగా బ్రహ్మజాతి భావిస్తోంది. 

దానాదీనా నరసింహమూర్తిలాంటి వాళ్ళకి ఆడింది ఆట పాడింది పాటగా గడిచిపోతోంది.ఇలా హాయిగా మూడుపిండాలు, ఆరు విస్తళ్ళుగా ప్రవర్థిలుతున్న ఆ బాబు జీవితంలో ఆరోజు పరమ ప్రత్యేకమైంది. సిటీలో హైటెక్‌ పంతులయ్యగా కాలంగడిపే అతని హృదయంలో కల్లోలం రేపింది. కార్చిచ్చు రగిలించింది.ఫఫఫఉన్నవాడు ఉండకుండా, మేనమామ ఆకొండి భీమేశ్వరరావు ఉంటున్న అర్జునగిరి గ్రామానికి నిన్నటి ఉదయం వెళ్ళాడు నరసింహమూర్తి.వైజాగులో ప్రతీరోజూ పితృశేషాలుగా దక్కే పెసరపప్పన్నం ముద్దలు తినితిని, మినపగారెలు మెక్కి మెక్కి, నువ్వులుండలు నవిలి నవిలి, అప్పాలు కతికి కతికి, పరవాన్నాలు జుర్రి జుర్రి... ట్రాఫిక్‌లో దుమ్ము కొట్టుకుపోయి కొట్టుకుపోయి... విసిగిపోయిన ఈ అయ్యగారు పచ్చని పొలాల్లో విహరించాలన్న పెద్ద ఎజెండాతోనే బయల్వెడలారు. తీరా ఆ పల్లెటూరిలో అడుగుపెట్టాక తెలిసింది మావ ఎంత హడావుడి బ్రేమ్మణ్యంలో ఉన్నాడోననే సంగతి.