‘‘ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్‌!’’ అన్నారు నరసింహం గారు, కిటికీలోంచీ బయటికి చూస్తూ, ఆయనకి చాలా చిరాగ్గా ఉంది.‘నువ్వు ఇప్పుడిప్పుడే నన్ను వదిలేలాగ లేదబ్బాయ్‌!’ అన్నట్టు విన్పించింది అబ్బాయ్‌కి. అబ్బాయ్‌ పేరు వర్రపసాదరావు. అతనా గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడనడం కంటె సోఫాని ఆనుకుని గోడకుర్చీ వేసేడనడం సబబు. తను కూర్చుంటే సోఫాకి ఏం నొప్పెడుతుందో, ఏ కుళ్ళు అంటుకుంటే నరసింహంగారు ఏం చేసేస్తారో అని భయపడుతున్న వాడిలా ఉన్నాడతను.ఆ సాయంకాలం అతను నరసింహంగారింటికి వస్తూ ఉంటే, అల్లంత దూరంలో ఉండగానే టపటపా చినుకులు పడ్డం ఆరంభించాయి. వాళ్ళింటికి వచ్చేసరికి అతని చొక్కా ఒంటికి అతుక్కుపోయింది. ఎత్తుగా దువ్విన జుత్తు అణగారిపోయి బుర్రకి అంటుకుపోయింది. నీళ్ళతో కలిసి, నూనె తలమీంచి కారి మొహమంతా జిడ్డులా తయారయింది. నరసింహం గారి ఇంటికి వచ్చాక మెట్లెక్కి, వరండాలో నుంచుని రుమాలుతో తల తుడుచుకోవాలో, మొహం తుడుచుకోవాలో తేల్చు కోలేక మోచేతులు తుడుచుకుంటూ కాలింగ్‌ బెల్‌ నొక్కాడతను.ఆ సమయంలో నరసింహంగారొక్కరే ఇంట్లో ఉన్నారు. ఆయన కొడుకూ, కోడలూ, మనవలూ అంతా ఏదో పార్టీకి వెళ్ళారు.కాలింగ్‌బెల్‌ విని ఆయనే తలుపుతీశాడు. తలుపు తియ్యగానే చామన చాయవాడు. జిడ్డుమోము వాడు. రెండుపదుల వయసువాడు, బక్క పలుచనివాడు, వరప్రసాదు కనిపించాడు.

 అతని రూపురేఖా విలాసాలు చూశాక, లోపలకు రమ్మనాలో, బైటే ఉంచే ‘ఎవరికోసమని’ అడగాలో తేల్చుకోలేక డోర్‌నాబ్‌ పట్టుకొని ఒక్కక్షణం అలా నిల్చుండి పోయాడాయన.నరసింహంగారిని చూడగానే వరప్రసాదరావు నోరుపెగల్లేదు. పెద్దపులిని చూసినట్టు ఒక్కసారి జడుసుకున్నాడు. కనిపించగానే వినయంగా నమస్కారం చెయ్యమని మరీమరీ చెప్పి పంపించిన తాతగారి మాటే మర్చిపోయాడు. నరసింహంగారి మొహం చూస్తూనే ఎందుకోగాని గాభరాపడిపోయాడా కుర్రవాడు.నరసింహంగారికి ముఖంలో రంగులు మార్చడంలో ఒక ప్రాక్టీసు ఉంది. ఆయన తన చిన్నమనవడితో ఆడుకుంటున్నప్పుడు ఎంతగాబోసి నవ్వులు చిందిస్తాడో, అదే సమయంలో పని కుర్రాడితో మాట్లాడవల సొస్తే అంత కటువుగానూ ఉండగలడు. పూర్వం కూడా తన క్లయింట్ల తోనూ, జడ్జీలతోనూ ఎంత మృదుమధురంగా మాట్లాడేవాడో తమ ఊళ్ళో రైతులతోటీ, కూలీల్తోటీ అంత కర్కశంగా మాట్లాడేవాడాయన. ఎవడైనా కొత్తవాళ్ళను చూసీ చూడంతోటే, విధిగా ఆయన ముఖంలో రంగులు మారతాయి. అవతలవాణ్ణి చూస్తూనే ఒక అంచనావేసుకొంటాడు. దాంతో ముఖం ప్రసన్నంగా పెట్టడవా, గంభీరంగా పెట్టడవా, ప్రసన్న గంభీరంగా పెట్టడవా అన్నది తేల్చుకొంటాడు.కాని వరప్రసాదరావుని చూసి ఎలా ముఖం పెట్టాలో ఆయనకి వెంటనే తెలియక తటపటాయించాడు.ఇంతలో ఆ కుర్రవాడు జేబులోంచి ఓ ఉత్తరం తీసి ఇచ్చాడు. అది చూస్తూనే, అయోమయపు రంగులోంచి కొంచెం ప్రసన్నపు రంగులోకి మొహాన్ని మార్చుకొన్నాడు నరసింహంగారు.