అనగనగా ఓ వ్యాపారి. పేరు జాకీ మంచి బిజినెస్‌ మేనేజర్‌. ఎంట్రన్స్‌లలో రాంకులు సంపాదించి ఐఐఎమ్‌ లలో చేరి ఎమ్‌బిఎ చేసిన వాడు కాడు. కనీసం అల్లాటప్పా కాలేజీలో చేరి డిగ్రీ పుచ్చుకున్న వాడూ కాడు. పదో తరగతి ఫస్టు క్లాసులో కాదు వాయిదాల పద్ధతిలో పాసయినవాడు. అయినా మాంచి బిజినెస్‌ మేనేజర్‌. వ్యాపార కళ వంశపారంపర్యంగా వచ్చిందనుకుంటే పొరపాటే. అతడి వంశంలో అటు ఏడు తరాల ముందు కానీ ఇటు ఏడుతరాల ముందు కానీ ఎవ్వరూ వ్యాపారం చేసి ఎరగరు. జాకీకి వ్యాపారం విద్య పూర్వజన్మ ఫలం అని ప్రజలు అనుకుంటూంటారు. జాకీ నోట్లో వెండి చెంచాతో పుట్టిన వాడనీ, ఐరన్‌ లెగ్గుతో కాక బంగారు పాదంతో పుట్టాడనీ కూడా అనుకుంటూంటారు.సబ్బు బిళ్ళా అగ్గిపుల్లా కాదేదీ కవితకనర్హం అని కవులు అనుకుంటూంటే నిప్పూ నీళ్ళూ, చెట్టూ చేమా, రొయ్యలూ చేపలూ, మట్టి స్నానం, తొట్టిస్నానం, విద్యావైద్యం కాదేది బిజినెస్‌ కనర్హం అంటాడు జాకీ. దేనితోనయినా వ్యాపారం చేస్తాడు. విజయవంతంగా నిర్వహిస్తాడు. విపరీతంగా లాభాలూ గడిస్తూంటాడు.వెరైటీ కావాలి జాకీకి. మూసలో పోసినట్లు ఒకే రకం వ్యాపారాలు చెయ్యడు. కొత్త కొత్త వ్యాపారాలు కనిపెడ్తూంటాడు. ఏ ఒక్క వ్యాపారాన్ని ఎక్కువ రోజులు చెయ్యలేడు. 

కొత్త వ్యాపారాలకోసం వెతుక్కునే వారికీ, కొత్తగా వ్యాపారంలోకి దిగే వారికి జాకీ మార్గదర్శి. అతణ్ణి అనుసరించే రకరకాల వ్యాపారాలు విజయవంతంగా చేసిన వారెందరో.డబ్బు గడించవచ్చు అనుకుంటే దేనితో నయినా వ్యాపారం చేస్తాడు, జాకీ. లేటెస్ట్‌గా వైద్యం తోటీ, విద్యతోటీ వ్యాపారాలు చేశాడు. ఆరోగ్యం పేరు మంచి వ్యాపార వస్తువు అని గ్రహించాడు. తను వైద్యుడు కాక పోయినా రకరకాల మొండి జబ్బులకి చైనా జపాను టిబెట్టుల స్పెషల్‌ ట్రీట్మెంట్లు చేయిస్తానంటూ హాస్పిటళ్ళు పెట్టి పెద్ద ఎత్తున వ్యాపారం చేశాడు. వీలయినంతా దండుకున్నాడు. ఆరోగ్య విపణికి లీడర్‌ అయ్యాడుచదువంటే తనకి ప్రీతి అంటూ కోచింగ్‌ సెంటర్లు మొదలెట్టాడు తన ఇన్ట్సిట్యూట్‌ లో చదువుకునే విద్యార్థుల ప్రతిభ కంటే పేపర్లలో ఆకర్షణీయమయిన ప్రకటనలు ఇవ్వడమే ప్రధానం, అనే ఆలోచనకి ఆద్యుడు జాకీయే. స్వయం ప్రతిభతో మంచి మార్కులు సంపాదించుకున్న వారితో బేరం కుదుర్చుకుని వాళ్ల ఫోటోలు తీసుకుని తమ సంస్థలో చదవడం వల్లనే విజయం సాధించారంటూ ఫుల్‌ పేజీ ప్రకటనలు తయారు చేయించి దినపత్రికల్లో ఇచ్చాడు. ఈ వ్యాపార రహస్యాలు తెలియని అమాయక ప్రజలు తండోపతండాలుగా తమ పిల్లల్నీ, లక్షల కొద్దీ డబ్బునీ తెచ్చి జాకీ చేతిలో పెట్టేశారు. జాకీ వ్యాపారం విపరీతంగా పెరిగింది. వ్యాపారస్థులంతా విద్యా వ్యాపారంలోకి దిగిపోయారు.