కృష్ణవేణి కుడి చేయి మౌస్‌ని కదిలిస్తూ వుంది. డెస్క్‌టాప్‌ మీద గజిబిజిగా వుంది. ఆమె అవేవీ పట్టించుకోవడం లేదు. స్ర్కీన్‌ని చూడ్డం లేదు. మౌస్‌ని అటు ఇటూ నొక్కుతూ గడ్డం కింద చేయి పెట్టుకొని అలా కిందకి నేల చూపులు చూస్తోంది.కృష్ణవేణి అంతరంగంలో అవ్యక్తమైన అలజడి. బాధాకరమైన సంఘటన ఏదో జరిగినట్లు మనసుని తొలుస్తున్న బాధ. పనిలో నిమగ్నం కాలేకపోతోంది. అసలు ఆరోజు ఆఫీసుకి రాబుద్ధి కాలేదు. కానీ తప్పదు. శెలవులు ప్రాబ్లం. అసలు ప్రతిరోజూ ఆఫీసుకు బలవంతంగా రావడమే. పెళ్లికి ముందు, తర్వాత కూడా వున్నంతలో మంచి చీరలు కట్టుకొని నీట్‌గా వుత్సాహంగా ఆఫీసుకు వచ్చేది. మరింత ఉత్సాహంగా అటు ఇటూ అందరితో మాట్లాడుతూ సరదాగా తిరిగేది. కానీ ఇద్దరు పిల్లలు వెంట వెంటనే పుట్టాక వుత్సాహమంతా తుంగలో తొక్కినట్లయింది. పిల్లల ఆలనా పాలనా చూసి, స్కూలుకు పంపి అంట్లుతోముకుని, బట్టలు వుతుక్కుని అన్నీ సర్దుకుని తాళాలు వేసుకొని బయటపడాలంటే ఒక మహాయజ్ఞం చేసినట్లుగా వుంది. అలసటగా అనిపిస్తోంది. తినడానికి టైంలేక చిన్న బాక్స్‌లో భోజనం సర్దుకొని బస్‌ కోసం పరుగెత్తాలంటే ఎంతో భారంగా వుంది. కాళ్లు ముందుకు గబగబా సాగడం లేదు. అందులోనూ పిల్లలకి శెలవులిచ్చినపడు వాళ్లని వదిలిరావాలంటే మరింత కష్టంగా వుంది. 

హాయిగా పిల్లలకి కబుర్లు చెపుతూ, వాళ్ల కమ్మని మాటలు వింటూ, వాళ్లకి కావల్సినవి వండి పెడుతూ ఎంత ఆనందంగా గడపొచ్చు? వెధవ వుద్యోగం..చచ్చేటంత చాకిరీ. ఈ కంప్యూటర్‌ ముందు కూచుని కూచుని కళ్లు, కాళ్లు నొప్పి, నడుం పీకడం ఏం చేస్తాం...ఖర్మ...భగవంతుడు మమ్మల్ని మధ్య తరగతి వూబిలోకి ఇలా బ్రతకమని కుమ్మేశాడు.పిల్లలు ఏం చేస్తున్నారో?పెద్దమ్మాయి శ్రావణికి ఆరు సంవత్సరాలు.చిన్నమ్మాయి శ్రావ్యకి ఐదు సంవత్సరాలు.ఇద్దరికీ ఇద్దరూ...పొద్దున్నే నిద్ర లేవరు. పాలు తాగరు...స్కూలుకు టైం అవుతుందన్న ధ్యాస వుండదు. అల్లరి, ఆటలు ఎక్కువ. శెలవులు వస్తే మరీ ఇబ్బంది. లేవనే లేవరు. తనకేమో ఆఫీసు టైం అవుతూ వుంటుంది. ఆయనగారేమో మగమహారాజులా మసలుతారు. వుదయం ఎనిమిది గంటలకు ఆఫీసుకు బయలుదేరితే తిరిగి ఇల్లు చేరేది రాత్రి ఎనిమిది తర్వాతే. ఇంటి బాధ్యతల్ని అంతగా పట్టించుకోరు. ఇంట్లో వున్న కాసేపూ టీవి చూస్తూ రిలాక్స్‌ అవడానికే ప్రయత్నిస్తారు. ఏం చెయ్యరు? కొంచెం సాయం చేస్తే ఎంత బాగుండును?పిల్లల్ని చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తూంటుంది. సాయంత్రం తను ఇల్లు చేరేవరకూ వాళ్లు అక్కడా ఇక్కడా ఆడుకుంటూ గడపడం, తను వంట చేస్తూ, హోంవర్క్‌ చేయమంటూ వేధించడం, వాళ్లు వాళ్ల నాన్నతో బాటు అన్నం తినీతినక నిద్రలోకి ఒరిగిపోవడం. పిల్లల్తో ఆప్యాయంగా మాట్లాడి, లాలించే సందర్భాలు రోజురోజుకి కరవవుతున్నాయి. పిల్లలకి శెలవులిస్తే వాళ్లు నిద్ర లేచే సమయానికి తను హడావుడిగా ఆఫీసుకు పరుగులు పెట్టడం, టేముల్‌ మీద అన్నం కూరలుపెట్టి తినమని చెప్పి వాళ్లని లోపల బంధిఖానాలో వుంచినట్టు వుంచి బయట తలుపుకు తాళం వేసుకొని బయలుదేరటం.