‘‘గిరిజా, నెమ్మదిగా మాట్లాడు, ఎందుకంతగా అరుస్తున్నావు?’’ మందలింపుగా అన్నాడు వెంకటరమణ.భర్త వంక తిరస్కారంగా చూస్తూ ‘‘అసలు నాకు అర్థం కాదు, అత్తయ్యగారికి, నాకు మధ్యలో మీరెందుకు మాట్లాడతారు?’’ అంది గిరిజ.‘‘ప్రతి చిన్నవిషయాన్ని భూతద్దంలోంచి చూస్తూ పెద్దగా రాద్దాంతం చేయకు. అది అంత మంచి పద్ధతి కాదు. నీ కోపానికి అవతలి వాళ్ళు ఎంత నొచ్చుకుంటారో అని నీకు ఎప్పటికి అర్థం అవుతుంది చెప్పు’’ అన్నాడతను కోపంగా.‘‘ఏమిటీ, ఇది చిన్న విషయమా, మీ తమ్ముడు మతాంతర పిల్లను పెళ్ళి చేసుకోవడమన్నది చిన్న విషయమా. అదీ కాక తనకి కూతురు పుట్టిందని, ఆ పిల్లను రేపు తీసుకుని మనింటికి వస్తాననడం, దానికి మీ అమ్మగారు సరేననడం ఇవన్నీ మీకు చాలా చిన్న విషయాలుగా కనపడుతున్నాయంటే ఎవ్వర్తన్నా నవ్విపోతుంది.’’ ఆవేశంతో ఊగిపోతూ అంది.‘‘గిరిజా, నా చిన్నకొడుకు మనింటికి వచ్చి, మనకున్న ఆస్తేమీ పట్టుకుపోవడం లేదు. ఆస్తేం రాసిమ్మనడంలేదు. ఏదో, వాడికి నచ్చిన పిల్లను చేసుకున్నాడు. కష్టమో సుఖమో వాడే పడుతున్నాడు. కూతురు పుట్టిందని ఆ పసిగుడ్డును, నా మనవరాలిని నాకు చూపించాలని ఆశపడుతున్నాడు. 

కక్షలు, కార్పణ్యాలు ఎల్లకాలం పెట్టుకొంటే ఎలా? మనిషి అన్నాక పట్టు విడుపు రెండూ ఉండాలి’’ అత్తగారు సుభద్ర మధ్యలో కల్పించుకుంటూ అంది.‘‘నేను మనిషిని కాదండి, అత్తయ్యగారు. దయ్యాన్ని మీరే మహాత్ములు, చాలా దయాగుణం కలవారు సరేనాండీ?’’ రెండు చేతులు జోడించి ఉక్రోషంగా అంది.‘‘విషయాన్ని పెంచకు, ప్లీజ్‌ ఊరుకో’’ అన్నాడు వెంకటరమణ వారింపుగా.‘‘బావుంది చాలా బావుంది మీ వ్యవహారం, మీ అమ్మగారి వ్యవహారం’’ కళ్ళలో నీళ్ళను తుడుచుకుంటూ విసురుగా లేచి, లోపలికి వెళ్ళిపోయింది.తల్లికొడుకు నిర్ఘాంతపోతూ తను వెళ్ళిన వంకే చూస్తుండిపోయారు. వెంకటరమణ, ఈశ్వరప్రసాదు ఇద్దరూ అన్నదమ్ములు.రామరాజుకు, సుభద్రకి ఆడపిల్లలు లేరు. గిరిజ వాళ్ళు కొద్దిగా సుభద్ర వైపు బంధువులు అవుతారు. అందుకే సుభద్ర ముచ్చటపడి మరీ గిరిజని తన కోడలిగా తెచ్చుకొంది.గిరిజ మంచి అమ్మాయే కాని ముక్కు మీద కోపం. మనస్సులో మాట దాచుకునే మనస్థత్వం కాదు. వెంకటరమణకి ఒక కొడుకు, ఒక కూతురు.సంసారం ఆనందంగా సాగుతున్న వేళ, ఓ రోజు ఈశ్వరప్రసాద్‌ తన కొలీగ్‌ రశ్మిని, రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. అంతే, ఇంట్లో పెద్ద తుఫాన్‌ లేచింది. రామరాజు అగ్నిపర్వతంలా పేలాడు.చిన్న కొడుకుని ఇంట్లోకి రానివ్వలేదు. అతని ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. వెంకటరమణ, తమ్ముడి మీదున్న ప్రేమతో, తండ్రికి నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నం చేసాడు. కాని రామరాజు తన పట్టుదలని వదల్లేదు.