చేటలో బియ్యం పోసి శుభ్రం చేస్తున్నసావిత్రిని చూస్తుంటే, లావణ్యకి చిరాకు కలిగింది.‘‘ఛీ... ఈవిడకెన్ని సార్లు చెప్పినా జ్ఞానముండదు. ఏ అత్తయినా పని చేయమంటే ఏడుస్తుంది.ఈవిడని తిని కూర్చోమంటే ఏడుస్తుంది.తగుదునమ్మా! అంటూ అన్ని పనుల్లో తలదూరుస్తుంది’’అర్భకంగా, నల్లగా ఉన్న చేతులు బియ్యంలోకదులుతుంటే ఇక భరించలేక పోయింది.‘‘మీకెన్ని సార్లు చెప్పాను. నన్నడకుండా ఏ పనీ... కల్పించుకోవద్దని. కృష్ణా... రామా.. అంటూ ఓ మూల కూర్చోలేరా...!’’ఆ గదమాయింపుకి ఉలిక్కి పడ్డ సావిత్రి మొహంలో బాధ రెపరెపలాడింది.‘‘ఏదో నీకు కొంచెం సాయం చేసినట్లుంటుందనీ...’’అంటూ నీళ్లునమిలింది.‘‘మీ బోడి సాయం నాకేం అవసరం లేదు. కష్టపడి పోతున్నట్లుగా... మీ అబ్బాయి ముందు బిల్డప్‌లివ్వద్దు’’సావిత్రి మొహం వివర్ణమయింది. పెడసరంగా అంటున్న కోడలి మాటలకు మనసు రోధిస్తుంటే, లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది.లావణ్యది పేరుకు తగ్గట్టుగా అందమయిన రూపం.

 పసిమి ఛాయ, చక్కటి అంగ సౌష్టవంతో చూడగానే ఎదుటివారు చక్కటి అందం అని మెచ్చుకుంటారు.పెళ్లికి ముందు ఆమె చాలా కలలు కంది తన అందానికి రాజకుమారుడు కాకపోయినా, బాగా డబ్బున్న వారో, ఏ ఆఫీసరో తనని అమాంతం మోహించి వరిస్తారని ఆశ పడింది.దీపం చుట్టూ తిరిగే శలభాల్లా, మగ పిల్లలు ఆమె చుట్టూ తిరిగారే కానీ, వారిలో ఎవరికీ పెళ్లి ఆలోచన లేదు. దానికి కారణం- ఆమె తండ్రి చిరుద్యోగి. ముగ్గురు ఆడపిల్లలు, భార్యే కాకుండా అతడి తల్లి, తండ్రి కూడా వీరితోనే ఉండడంతో చాలీ చాలని జీతం డబ్బులతో, ఇరుకు గదుల్లో బతుకు బండి లాక్కురావడంతో, దీపకళిక లాంటి అందాన్ని ఇష్ట పడ్డారే కానీ, దీపాన్ని ముద్దెట్టుకోవాలంటే, మూతి కాలుతుందని తెలిసి, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు.లావణ్య ఇంటర్‌తో చదువాపేయడం, లైబ్రరీలోని నవలలు తెచ్చుకుని, రంగుల కలలు కనేది.అయితే- పెళ్లి చూపులకు కూర్చున్న ప్రతీసారీ... పెళ్లికొడుకు అర్హత చూసి, ఆమె ఆశలు వెలవెల బోయేవి.తండ్రి అసహాయ స్థితి లావణ్యకు బాగానే అర్థమయింది. తమ దరిద్రానికి మంచి సంబంధం రాదు. ఒక వేళ వచ్చినా వారు కోరే కట్నమిచ్చుకుని తండ్రి తన పెళ్లి చేయలేడు.

తన వెనకింకా ఇద్దరు ఆడపిల్లలు మరి.అతి త్వరలోనే వాస్తవాన్ని గ్రహించి. తన కోరికలు, ఆశలు కలలకే పరిమితం చేసుకుని తండ్రి తెచ్చే వాడిని చేసుకుందుకు సిద్ధపడింది.అటువంటి సమయంలో- ఆమె ఆశలకు కొత్త ఊపిరి పోస్తూ పెళ్ళిళ్ళ పేరయ్య ఒక సంబంధం తెచ్చాడు. పెళ్లికొడుకు పేరు చక్రవర్తి. బ్యాంకులో ఉద్యోగం, బాదర బందీలు లేవు. అతడికి తోడుగా తల్లి మాత్రం ఉంది. వారికి పిల్ల బాగుంటే చాలు. కట్నం పట్టింపులు లేవు.