తెల్లవారుజామున నాలుగున్నర గంటల వేళ దిండు కింద పెట్టుకున్న సెల్‌ఫోన్‌ సడి చేయడంతో గాఢనిద్రలో ఉన్న మేఘమాలకు చటుక్కున మెలకువ వచ్చేసింది. ఇది ఇంత ఖచ్చితంగా మేలుకొలపాలా అనుకొంటూ విసుగ్గా దాని నోరు నొక్కేసింది. ఆమెకు చాలా బద్దకంగా ఉంది. నిద్ర చాలకపోవడం వల్ల కళ్ళు మండుతున్నాయి కూడా. అయినా లేవక తప్పని పరిస్థితి.పని మనిషి భర్త తాగిన మత్తులో కారు కిందపడి గాయపడ్డాడు. అందువల్ల అది మూడు రోజుల నుంచీ పనిలోకి రావడంలేదు. ఇప్పట్లో వచ్చే అవకాశమూ లేదు. ఉన్న గిన్నెలన్నీ వాడేసిందేమో ఇప్పుడు గిన్నెలు తోమితేనే తప్ప వంట వండలేదు. దానికి తోడు స్నానాల గదిలో విడిచేసిన ఉడుపులన్నీ మేటగా పేరుకుపోయి చీదర పుట్టిస్తున్నాయి. ఇక ఇల్లు ఊడవడం సరేసరి. ఈ పనులన్నీ కానిచ్చి వంట ముగించి పది గంటల కల్లా తను పనిచేసే కార్యాలయంలో హాజరవ్వాలంటే లేవక తప్పదు.బద్దకాన్ని జయించే ప్రయత్నంలో అరగంట గడిచిపోయింది. మంచంమీద నుంచి లేస్తూ పక్కకు తిరిగి భర్త శీను వంక చూసింది. పొత్తిళ్ళలో పసికందులా ఎంతో ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపోతున్నాడతడు. పనిమనిషి నెల రోజులపాటు రావటం మానేసినా దాని ప్రభావం ఏ విధంగానూ అతడి మీద పడదు అనుకొంది.తను తోమవలసిన గిన్నెలనూ ఉతకవలసిన వస్త్రాలను చూస్తుంటే ఆడపుట్టుక ఎందుకు పుట్టానా అనిపించింది. నరకాసుర సంహారానికి సమకట్టిన సత్యభామలా కొంగు బిగించి గిన్నె లన్నీ చకచకా తోమేసింది. అదే ఊపులో స్నానాల గదిలోకి వెళ్ళి వలువలన్నీ ఉతికేసి బాల్కనీలో దండానికి ఆరేసింది. చీపురుతో ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసింది.ఆ విధంగా పని మనిషి పాత్ర ముగించింది. ఇక వంట మనిషి పాత్ర ధరించాలి.

 అటుపైన ఆఫీసులో ఉద్యోగిని పాత్ర.నిద్రలేచిన శీను కాఫీకోసం కేక పెట్టాడు. వంటగదిలో కాఫీ గ్లాసూ, ఫ్లాస్కూ అందుబాటులోనే ఉంచుతుంది. కానీ శీనూకి వంట గదిలోకి రావడానికి తగని బద్ధకం. అత్తవారింటికి మూడు నిద్రలకు వచ్చిన కొత్తపెళ్లి కొడుకులా అన్నీ కూర్చున్న చోటే జరిగిపోవాలతడికి.కాఫీ తాగుతూనే అప్పుడే వచ్చిన దినపత్రిక చదవడంలో మునిగిపోయాడతడు. రెండు గంటల వరకూపైకి తేలడు. ఆ సమయంలో పిడుగులుపడ్డా పట్టించుకోడు. కాళ్ళకింద భూమి వ్రయ్యలై పోతున్నా వినిపించుకోడు.మేఘమాల వంటపనిలో పడింది. శీను భోజనప్రియుడు. కంచంలో రెండురకాల కూరలు ఉండాలి. లేకుంటే అగ్గిమీద గుగ్గిలమవుతాడు. వంట ప్రారంభిస్తుండగానే నానీ నిద్రలేచాడు. వాడికిప్పుడు మూడేళ్లు. ఈ మధ్యనే క్రెష్‌లో చేర్పించారు. వాడిని క్రెష్‌లో దింపడమూ తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకు రావడమూ ఆమె పనే.