వింటిని వదిలిన బాణంలా పరుగెత్తుతోంది కీర్తి. పళ్లు బిగపట్టి... ప్రాణ శక్తినంతా పిక్కల్లో నింపేసి... గాలితో పోటీ పడ్తూ... పోటీ... తను గెలవాలి... తన జీవిత లక్ష్యం అదే.. ఎదురుగా అవరోధాలు... హర్డిల్స్‌... వూపిరి తిత్తులనిండా గాలి పీల్చి లాఘవంగా జంప్‌ చేసింది. మళ్ళా పరుగు... స్టేడియం నిండా మనుషులు...తను పరుగెత్తుతూనే ఉంది.... వూపిరందడంలేదు. ప్రాణం పోయేలా ఉంది. ఐనా సరే పరుగాపకూడదు. చుట్టూతా మనుషులు మాయం... నిర్మానుష్యంగా ఉంది... అడవిలా... వెంటపడి తరుముతున్నాడు వివేక్‌... పేరెలా పెట్టారో చూడు... అవివేక్‌ అని పెట్టాల్సింది... వీడి నీచత్వాన్ని వర్ణించడానికి ఆ పేరు కూడా సరిపోదు... దొరికితే కొరికేస్తాడు... వాడి పళ్ళనిండా విషం... పిచ్చికుక్క...మరలా హర్డిల్స్‌... జంప్‌ చేసి తప్పించుకుంది. వాడు అరుస్తున్నాడు. ఆగకపోతే చంపేస్తాడట. కానీ ఆ గొంతు వివేక్‌ది కాదు... ఈశ్వర్‌ది. ఎవరెవరివో గొంతులు.. కలిసిపోయి... కలగాపులగమై... తోడేళ్ళ గుంపు... ఏ కండకాకండ చీల్చి రక్తం తాగాలనే ఆరాటంతో... దొరక్కూడదు... పరుగెత్తాలి... పతకం అందుకోవాలి... అదిగో పదడుగుల్లో ఫినిషింగ్‌ లైన్‌... పతకం తనదే... వాళ్ళకు దొరికితే పతనం తనదే... పతనమా పతకమా... పతనంతో పతకమా... పతకంతో పతనమా...కాలు మడతపడింది... మడతపడింది కాలా జీవితమా? పడిపోయింది... చుట్టూతా కుక్కలు... పీక్కుతింటూ... ప్లీజ్‌.... పిక్కలు వదిలేయండి... పతకం గెల్చుకోవాలంటే నా కాళ్ళే ఆధారం... దండం పెడ్తాను... నా పిక్కలు... నా కాళ్లు.... నా పతకం... కీర్తి ఏడుస్తోంది... పెద్దగా ఏడుస్తోంది... హృదయం ద్రవించేలా ఏడుస్తోంది.కుక్కలకు హృదయం ఉండదు... తోడేళ్ళకూ ఉండదు.. రక్తపు విందు వాటికి... తన ప్రాణం పోతోంది. పతకం సాధించకుండానే తను చచ్చిపోతోంది. 

చావకూడదు... తను బతకాలి. ఒక్కసారిగా బలంగా విదిలించింది.చప్పున మెలకువొచ్చింది. కీర్తి భయం భయంగా చుట్టూ చూసింది. కుక్కలు లేవు. తన వొంటిమీద రక్తపు గాయాలు లేవు. గుండెలో దాచుకున్న గాయాలు బైటికి కన్పడవు. తను యింట్లో ఉంది. తనింట్లో... తన మంచం మీద... వళ్ళంతా చెమటతో తడిచిపోయింది... స్నానం చేసినట్లు.స్నానం చేసి తొందరగా తయారు కావాలి. రమ వస్తానంది. గోడ గడియారం వైపు చూసింది. రంగు వెలిసిపోయి, పెచ్చులూడిపోయిన గోడమీద ముసిల్దయిపోయి తన చావు ముహూర్తానికి నిమిషాలు లెక్కిస్తున్న గడియారం... సమయం ఆరూ యాభై తొమ్మిది... ఏడు కావడానికింకా నిమిషమే ఉంది.కీర్తి గడియారం వైపు భయంగా చూసింది. యింకొన్ని క్షణాల్లో ఏడవుతుంది. చెవుల్ని గట్టిగా మూసుకుని చూపు కిందికి దించింది. పేల బోతుంది డైనమైట్‌ అన్నంతగా భయంతో వణికిపోయింది. గడియారం ఏడుసార్లు బలహీనంగా మూలిగింది. ఏడాది క్రితం ఈ గడియారం ఏడు గంటలు కొట్టి ఆగగానే అమ్మ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఏడ్పులు.. కన్నీళ్ళ వరద యిల్లంతా...