‘భాస్కర్‌’ అంటూ మిత్రున్ని గాబరాగా నిద్ర లేపాడు కుమార్‌. కుమార్‌ అరుపునకు ఉలిక్కిపడి లేచిన భాస్కర్‌ నిద్ర మత్తులోనే ‘ఏం? ఏం? ఏమయింది’ అంటూ ఆతృతగా చూశాడు.‘నా షర్ట్‌ కనపడలేదు’ అన్నాడు ఆందోళనగా కుమార్‌‘అరె! తమాషాగా వుందే. ఎక్కడికి పోతుంది? ఎట్లా పోతుంది?అంటూ ఆశ్చర్యంగా యక్షప్రశ్నలు వేశాడు.‘అదే అర్థం కావడంలేదు. కిటికీలకు దూరంగా గోడలకు తగిలించిన షర్టు ఎట్లాపోయిందో నాకూ అంతూ పట్టడడం లేదు.’‘షర్టులో డబ్బులున్నాయా?’‘ఔనుమల్ల. వుత్త షర్టు అయితే పోనీలే అనుకునేవాన్ని’‘అదీ కరెక్టెలే, వుత్త షర్టు కొట్టేసే వాడైతే నా షర్టూ, ప్యాంట్లూ కూడా కొట్టేసే వాడే కదా. అయినా ఇదేదో ఆశ్చర్యంగా వుందే కిటికీలు, తలుపులూ మూసే వున్నాయి. రూమ్‌లో వున్నది ఇద్దరమే. ఎట్లా పోయిందబ్బా. రాత్రి రూమ్‌లోకి ఎవరైనా వచ్చినారా?’‘వాటర్‌ బాటిల్‌ తీసుకొని హోటల్‌ బాయ్‌ వచ్చాడు. అతనికి జేబులోంచి ఇరవై రూపాయలు తీసిచ్చి గోడకే షర్ట్‌ తగిలించాను. ఆపడు నువ్వేమో బాత్‌రూంలో స్నానం చేస్తాంటివి’ అంటూ ఫ్లాష్‌ బ్యాక్‌ చెప్పాడు కుమార్‌.‘అవును అతను వెళ్లిపోయిన తరువాత తలుపుగడి వేయలేదా?’‘ఉహూ...వేయలేదు’ అన్నాడు కుమార్‌ తపచేసినవానిలా‘నీకు నిర్లక్ష్యం ఎక్కువబ్బా. డబ్బంటే లెక్కలేదు. అరె! ఇది లాడ్జి కదా. ఎపడూ ఎవరో ఒకరు హోటల్‌ బాయిస్‌ రూమ్‌లోకి వస్తూంటారు, పోతుంటారు. ఎవరు ఎట్లాంటివాళ్లో మనకు తెలీదు కదా. ఇట్లా ఏదన్నాపోతే అనవసరంగా వాళ్లను అనుమానించవల్సి వస్తుంది.

డబ్బులు కనపడేటట్లు షర్టు జేబులో పెట్టే బదులు కొంత చాటుగా పెట్టిండొచ్చు కదా?’ అంటూ సీరియస్‌గా క్లాస్‌ పీకాడు భాస్కర్‌.‘రాత్రి బాగా అలసిపోవడం వల్ల మంచం మీద పడుకుంటూనే కళ్లు మూతలుపడ్డాయి. గడి వేయలేకపోయాను.’ అన్నాడు కుమార్‌.‘అంతేలే నీ కళ్లు మూతపడగానే గురక మొదలైంటుంది. ఆ గురక విన్న బాయ్‌ పిలిచావేమో అనుకొని వచ్చింటాడు. నీవు నిద్రపోతూంది చూసి పిల్లిలాగా మెల్లగా వచ్చి షర్ట్‌ మాయం చేసింటాడు’ అని అనుమానం వ్యక్తపరిచాడు భాస్కర్‌‘జేబులో డబ్బులే తీసుకుపోతాడు కానీ షర్ట్‌ కూడా తీసుకుపోతాడా? అయినా అతనే తీసుకున్నాడని ఖచ్చితంగా ఎట్లా చెప్పగలం. పనిచేసేవాడు కాబట్టి అతన్ని అనుమానించడం సరైంది కాదు కదా భాస్కర్‌’