నరేష్‌ చేతులు రెండూ వెనక్కి విరిచి, ఇంటి ముదు వున్న స్తంభానికి కట్టి పడేసారు. వాడు ‘‘వామ్మొ...వాయ్యొ...నాయనో’’ అంటూ పెద్దగా పెడబొబ్బలు పెడుతూ ఏడుస్తున్నాడు. నరేష్‌కి పదకొండేళ్ళు. ఐదోతరగతి చదువుతున్నాడు. వాడ్ని గుంజకి కట్టేసిన వాళ్ళ నాన్న ఈత మెల్లెలు రెండు తెచ్చి, వాడ్ని అప్పటికే నాలుగు బాదాడు. వాళ్ళమ్మ ఆండాళ్ళమ్మ గడపమీద కూర్చుని ఏడుస్తూ ‘‘ఇంక చాలే ్లఆపు’’ అని భర్తని విసుక్కుంటూ, బతిమాలుకుంటూ కోపంగా అరుస్తోంది. ‘‘నువ్వు నోర్ముయ్‌.. అసలునీ వల్లే వాడు ఇంత పని చేసింది’’ అని సత్యం, భార్యని కోప్పడ్డాడు.ఆమెని మాట్లాడనివ్వడంలేదు. నరేష్‌ ఇంట్లో వందరూపాయలుదొంగతనం చేసి, ఒక్క రోజులోనే మొత్తం ఖర్చుపెట్టేశాడు.సత్యానికి ఆ విషయం తల తీసేసినట్లుగా వుంది. ఆయన క్ర మశిక్షణ అంటే ప్రాణమిస్తాడు. పిల్లలు చిన్నతనంనించే క్రమశిక్షణతో, మంచి లక్షణాలతో, మంచి పేరు పొందుతూ, ఫలానా వాళ్ళ పిల్లలు అని అందరూ గొప్పగా చెప్పుకోవాలని సత్యం కోరిక.ఇరుగు పొరుగు జనం చాలా మంది చేరారు. చేరిన వాళ్ళు తలోరకంగా మాట్లడుతున్నారు.వాళ్ళందర్నీ చూసిన సత్యానికి చాలా ఉత్సాహంగా వుంది. పూనకం వచ్చింది. తను క్రమశిక్షణ అంటే ఎంతగా పడిచస్తాడో వాళ్ళందరికీ తెలిపే అవకాశం దొరికిందని సంతోషపడిపోతున్నాడు.

‘‘చిన్నప్పట్నించీ ఎంత బాగా పెంచాను. ఇప్పటి వరకూ ఎంత పద్ధతిగా వున్నావు. నీ అంతట నీకు పుట్టిన బుద్ధి కాదురా ఇది. నీ సావాసగాళ్ళు ఎవరో తీసకరమ్మన్నారు, నువ్వు తీసావు. చెప్పు, నిన్ను దొంగతనం చేయమని చెప్పింది ఎవరూ? నిన్ను ఈ పనికి పురగొల్పింది ఎవరూ?’’ కాళ్ళకి పెట్టి ఒక దెబ్బవేసి, అడిగాడు సత్యం.‘‘నన్ను ఎవరూ తీసకరమ్మన్లేదు. నేను తీసుకున్నా’’ ఏడుస్తూ, వెక్కిళ్ళు పెడుతూ అన్నాడు నరేష్‌.‘‘అరె... మళ్ళీ అదే మాట! అసలు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? నీకేం కొరవ అయితే ఈ పని చేసావు? నీకేం తక్కువ చేసాను? నీకు ఇంట్లో తింటానికి ఎప్పుడూ ఏవో వుంటాయే! నీ కోసం చేయించి పెడుతున్నా కదా ఇంట్లో!’’ మళ్ళీ దెబ్బ వేశాడు.వచ్చిన జనానికి సరదాగా వుంది. పనుల్లేని రోజులు. మంచి కాలక్షేపం.‘‘ఇంక చాల్లే వూరుకోవయ్యా! చస్తాడు. ఇంక ఎప్పుడూ తీయడ్లే!’’ వాకిట్లో కూర్చున్న భార్య అంది.‘‘తీయడ్లే అని నువ్వు చెబితే ఎట్టే? ఇప్పుడెందుకు తీసాడు? ఇప్పుడు తీసిన వాడు రేపు తీయడని గేరంట్‌ ఏంది?’’ లాపాయంట్‌ లాగి, మరో రెండు పీకాడు.‘‘అయితే ఎంత సేపు కొడతావు అట్ట! బిడ్డ చచ్చేదీ, బతికేదీ తెలియకుండా తంతే ఏమని? ఇంక తీయనని చెపతన్నాడుగా?’’