రింగ్‌టోన్‌ ఫోబియా....ఇలాంటి పేరున్న వ్యాధి మెడికల్‌ డైరక్టరీలో వుందో లేదో తెలీదు. అసలింతకీ యిది వ్యాధి అవునో కాదో తెలీదు. సైకియాట్రిస్టుల వద్దకి ఈ రకం రోగులు వచ్చారో లేదో కూడ తెలీదు. కాని బ్యాంకులో యే టేబిల్‌ మీద ఫోను మోగినా, తన గుండెల్లో బాంబు పేలినంతగా భయపడిపోతోంది మల్లీశ్వరి.గత పది, పదిహేను రోజుల లగాయితు యిదే తంతు. బ్యాంకులో అడుగుపెట్టే ప్రతి ముఖాన్ని ఆడా మగా అన్న తేడా లేకుండా బైనాక్యులర్‌ చూపులతో తవ్వి తవ్వి మరీ పరీక్షించేస్తోంది. డ్యూటీ చేసే ఎనిమిది గంటల్లో హీన పక్షం యాభై సార్లన్నా ముఖానికి చెమట పట్టడం, ఆ చెమటని టర్కీ తువ్వాలుతో వొత్తుకోవటం చేస్తూనే వుంది.టెలిఫోన్‌ మోగితే చాలు, దాంతో పాటు గుండెలూ దడదడలాడుతున్నాయి.అప్పటికీ టీ.వీ. పెట్టకూడదనీ, వుదయాన్నే పత్రికలు చదవ కూడదనీ యెన్నోసార్లు అనుకుంది. అయినా మనసు కుదుటగా వుంటేగా. ఏ రోజు యే కన్నగుండెల్లో బాంబు పేలిందో, యే ఆడపిల్ల జీవితం అర్ధాంతరంగా ముగిసి పోయిందో !అనూహ్యంగానే చేతుల్లోకి రిమోట్‌ వచ్చేస్తుంది. వార్తలొచ్చే ఛానళ్ల మీట వేళ్లు నొక్కేస్తాయి.వూహించినట్టుగానే యెక్కడో వో చోట, యేదో వోవూళ్లో యెవడో వొక రాక్షసుడు, పసి పాప దగ్గర్నుంచి, కన్నె పైట వేసుకొన్న అమ్మాయిల దాకా యెవరో వొకరి ప్రాణాలతో ఆడుకుంటానే వుంటాడు.మొగ్గ ప్రాణాలపై గొడ్డలి వేటు పడుతూనే వుంటుంది.సరిగ్గా అలాంటి సమయాల్లోనే ల్యాండు ఫోను ట్రింగ్‌...ట్రింగు మని మోగుతుంది. అంతే... మల్లీశ్వరి గుండె యెండుటాకులా వణుకుతుంది.

అన్నింటికీ కారణం వొకటే.తన ఆరేళ్ల కూతురు ప్రణవి. కాన్వెంట్లో చదువుతోంది. తను బ్యాంకులో క్యాషియరు. భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. ఇద్దరి జీతం కలిపితే నెలకు అరవైవేల పైమాటే. కాని యిరుగు - పొరుగు గుస గుసల్లో అది నెలకో లక్ష. అందరి కళ్లూ తమ పైనే.ఆ కారణంతోనే భయంతో లోలోన కంపించిపోతోంది మల్లీశ్వరి.అంతక్రితం అలాంటి సంఘటనల్ని వార్తలుగా, వార్తా చిత్రాలుగా చూసినపుడు గుండె జల్లుమనేది. బలైపోయిన ఆడకూతురు తాలూకు తల్లిదండ్రుల మనోవేదన వూహించుకొని కొద్దిగానో, యింకొద్ది యెక్కువగానో ఆవేదనకు లోనయేది. ఇప్పుడలా కాదు. పరిస్ధితి మారింది. గుండె జల్లు మనడం లేదు. వొణుకుతుంది. ముచ్చెమట్లు పడుతున్నాయి. నిన్నా-మొన్నటి దాకా మేమి ద్దరం, మా కొక్కరు - చిన్న కుటుంబం, చింతలేని కుటుంబమని వొకింత గర్వపడేది. కాని యివాళ పరిస్ధితి అందుకు భిన్నం. పెద్దదిక్కులేని కుటుంబం. అందరూ వున్న అనాథ అనిపిస్తోంది.అంట్లు తోముతూ- ‘‘అమ్మా బ్యాంక్‌లో డబ్బంతా మీ చేతుల్లోనే వుంటుందంట గదా? డబ్బు కట్టలు లెక్క పెట్టేది కూడ మీరేనంటగా !’’ అహఁ...నా మాట కాదమ్మా ! కాలనీలో అందరూ అనుకొనేదే’’ అంటూ రాములమ్మ అన్న మరుక్షణం అదాటుగా వులిక్కిపడింది. అదే తొలిసారి. అది మొదలు ఆడపిల్లల కిడ్నాప్‌లు, రేప్‌లు, హత్యలు అన్నీ బాగా తెలిసిన వారు చేసిన దురాగతాలే అన్న కథనాలు చదివి వులికిపాటు యింకా ఎక్కువై పోయింది మల్లీశ్వరికి.