ఇరవై ఏళ్లయింది.ఈ మట్టిని వదిలి. మనుషులని వదిలి. వాళ్ళ మనసులని వదిలి. వెక్కిళ్ళని బిగపట్టుకు కూర్చున్నట్లుంది నా పరిస్థితి. మా ఊరు నాకు అంటరానిదయింది. ఎందుకో అలా చేసుకున్నాను.నయాగరా జలపాతంలో తడిసినప్పుడు ఇంత చల్లదనం నా శరీరానికి తగిలిందేమో కానీ గుండెకి లేదు. నేను ప్రేమిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ప్రేమని పంచుకోవాలనుకుంటున్నాను.ఇప్పుడు నా మూలాలు నాక్కావాలి. నా స్వరూపం నాక్కావాలి. నా మూలాధార చక్రం మీద నేను తిరగాలి.వేకువ జామున నదిలో పడిపోయిన సూర్యుడిని లేవదీసి ఆకాశం నుదటి మీద అతికించాలి.బిడ్డ వచ్చాడని కళ్లని తడి చేసుకున్నట్లుంది ఊరు. నరసింహస్వామి ఆశ్రమం దాటి వేగంగా కదుల్తోంది పెన్నానది ఒడ్డున మేము ప్రయాణిస్తున్న కారు.‘‘ఇంకా ఎంత దూరం నాన్నా’’ నదికేసి చూస్తూ అంది ‘‘సిండ్రిల్లా’’‘‘సిండ్రీ....డోర్‌ క్లోజ్‌ చేయ్‌...’’ ప్రేమగా అంది నా భార్య.‘‘ఉండనీ మమ్మీ...రెయిన్‌ హాయిగా ఉంది. ఇండియన్‌ రెయిన్‌ కదా ఎలా ఉంటుందో చూద్దాం...’’ సిండ్రిల్లా తన తెల్లటి చేతుల్ని బయటపెట్టి వర్షంతో కరచాలనం చేస్తూ ఉంది.పెన్నానది ఒడ్డున ఉండే శివాలయం ముందు ఆపాను కారుని. అక్కడ ఇంకా వర్షం మొదలవలేదు. చినుకులు మాత్రం మమ్మల్ని అభిషేకించడానికి సిద్ధమవుతున్నాయి. 

గుడి ముందున్న మర్రి చెట్టు ఒడిలోకి చేరగానే ఊడలన్నీ ఊపి నన్ను పలుకరించింది. అందరం గుడిలోకి నడిచాం. మనిషే దేవుడి విషయంలో ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు.‘‘టెంపుల్‌ అద్భుతంగా ఉంది. నువ్వు అప్పుడప్పుడు చెప్తుంటావే ఇదేనా నాన్నా....’’ రాతి గోడల్ని స్పర్శిస్తూ అంది ‘రెయినీ’గుళ్లో నుంచి నేను సరాసరి నది ఒడ్డుకి నడిచాను. ఎన్నో యుగాల నుంచి మనుషులకి జోలపాట పాడిన తల్లి నది. నేను ఒడిలో కూర్చున్నాక మురిసిపోయింది.తన స్పర్శతో మరలా నన్ను సజీవుడిని చేసింది. అవును నేను మనిషిగా చనిపోయి చాలా ఏళ్లే అయింది. చాలా కాలానికి నాలో ఇప్పుడు ప్రశాంతత. ఒడ్డున నడుస్తుంటే ఎవరో గట్టిగా నన్ను పిలుస్తున్నారు. బహుశా నా భార్య కావచ్చు. అవును తల్లి నుంచి బిడ్డని వేరు చేసేది భార్యలే. క్షమించాలి.పెన్నమ్మ తల్లి నా ముఖాన ఇన్ని నీళ్లు చల్లి నన్ను ముద్దులు పెట్టి పంపింది. అందరం కారు దగ్గరకి చేరుకున్నాక, పూజారి గారు వచ్చారు.‘‘మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరూ...’’ అన్నాడు ఆశ్చర్యంగా నా వైపు చూసి.‘‘నేను ఈ ఊరి వాడినే నండి. నా పేరు పామర్తి రమణ. పామర్తి నరసయ్య కొడుకుని....’’ అలా చెప్తున్నప్పుడు ఎందుకో నా మనసు నిండా గాయాలే.