‘‘ఈసారయినా ఉగాదికి పట్టుచీరకొనకపోతే ఒప్పుకోను’’ అంటూ మళ్ళా రికార్డు మొదలెట్టింది అవనిజ.‘‘మరి... మరి... నాకూ...’’‘‘మరిలేదూ... గిరిలేదు... హరిమీద గిరిపడ్డా నేనొప్పేదిలేదంతే! పసిడి ఊసు నేను ఎత్తలేదు. ఎందుకంటే నింగినంటిందది. నా కోరికల్లా ఓ మంచి పట్టుచీర మాత్రమే! ఎప్పుడో పెళ్ళిళ్ళలో కట్టుకోడానికనే!’’ తన మక్కువను విప్పి చెప్పింది అవనిజ.ఈ మధ్యకాలంలో ఈవిడగారి పిచ్చి ముదిరి పాకాన పడిందనటానికి ఇదో చక్కని ఉదాహరణ.ప్రతి పెళ్ళికి ఈమె వెళ్ళటం, ఎవరో ఒకరు కట్టుకొచ్చిన పట్టుచీరలను చూసి మనసు పారేసుకోవటం,తను అందరిలో చులకన అయిపోయానని, ఆత్మన్యూనత భావంతోకొట్టుకులాడ్డం, ఇంటికొచ్చీరాగానే, పసిపిల్ల మాదిరిగా, పేచీలు పెట్టడంరివాజుగా మారిపోయింది.వాసుకిదంతా చూస్తుంటే చెడ్డ చిరాకేస్తోంది. కొంటే అయిదు వేలకి తక్కువ కాకుండా ఖరీదయినది కొనాలంట! ఎప్పుడో ఏ పెళ్ళిళ్ళలకో, పండగలకో ఓసారి చుట్టుకోని, విప్పి పారేసేదానికి, అంత ఖరీదుపెట్టి కొనడమా! ఇప్పుడీ అధిక ధరవరల మధ్య బ్రతుకు పోరాటం సాగిస్తూంటే ఈ ఆడాళ్ళకు సంబరాలా! అయినా అర్థం చేసుకోక పీడిస్తూంటారు.‘‘ఇంత అదాటుగా బాంబు వేస్తే నేనేమయిపోను?’’ విలవిల లాడుతూ అన్నాడు వాసు.‘‘ఇది ఈనాడడిగింది కాదు మహాశయా! ఎప్పటికప్పుడు దాట వేస్తున్నారు. నూట యాభయి రూపాయల చీర తెచ్చినా కట్టుకున్న రోజులున్నాయి’’.

ఆమాటలో అవాస్తవం లేదనే చెప్పవచ్చు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఖరీదుపెట్టి చీరలు కొనే స్తోమత ఉండేదికాదు వాసుకి. అలాటప్పుడు సర్దుకుని గడిపేది అవనిజ.అసలే దగ్గర సంబంధం కావటంతో ఆమె కూడా ఏమనుకునేది కాదు. ఇద్దరు పిల్లలతో సరిపెట్టాక, వారి ఆలనా, పాలనతోనే అయిపోయేది అవనిజకు. ఇంతకాలం కోరికలేవీ కోరకున్నా సరే, ఒక్క సారిగా ఖరీదయిన పట్టుచీరె అనగానే డీలాపడిపోయాడు వాసు. ఈసారి కొనకపోతేగానీ వీల్లేదని పట్టుబట్టి మరీ కూర్చుంది. తనను పక్కమీదకు కూడా రానివ్వదేమోనని బెంగపట్టుకున్నది వాసుకి. అదే సందేహంతో ఉన్నా ఒకసారి మచ్చుకి చూడాలని, ఇంటికి వెళ్ళీవెళ్ళగానే భార్యను ముద్దుల్లో ముంచెత్తాడు వాసు. భర్తను వద్దని వారిస్తూ తప్పించుకున్నది అవనిజ. బిగి కౌగిలికి బెట్టుచేసింది. చేతులతో రారమ్మని పిలుస్తూంటే, విదిల్చి కొట్టింది.‘‘ఏమి ప్రియతమా! అలిగితివేమి?’’ అని మురిపెంగా ప్రశ్నించాడు వాసు.‘‘మీకు తెలియనిదేమున్నది. సర్వమూ తెలిసినవారు. నా కోరికను ఈడేర్చుటలో ఈ విలంబనమేమి?’’ అన్నది నాటకీయంగా అవనిజ.‘‘కోరికను తీర్చుటలో ఎట్టి ఆలస్యమునూ లేదు. పైసలు చేతిలోపడ్డ తక్షణమే నీ ఈప్సితము సిద్ధింపచేతును’’ అని అవనిజను ఒక్కసారి ఎత్తుకుని గిరగిరాతిప్పాడు. అదేంటోగానీ, భర్త స్పర్శ తగలగానే మంచులాగ కరిగిపోయింది. అతను ఎడాపెడా ముద్దులు పెడుతూంటే వద్దనలేకపోయింది. ఆ చేష్టలకు లొంగిపోయి, సయ్యాటలాడింది.ఇద్దరూ కొద్దిసమయం రసకేళిలో చిందులాడాక సొక్కి సోలి పోయారు.