పాతకాలంనాటి గోడగడియారం ఠంగున తొమ్మిది గంటలు కొట్టింది. ముందురోజు స్కూల్లో చెప్పిన పాఠాలతో కుస్తీ పడుతున్న అబ్బులు ఉలిక్కిపడి గడియారంవైపు చూసి వెంటనే పుస్తకాలన్నీ పక్కన పడేసి ఒక్క గెంతుతో గుడిసె బయటికి వచ్చాడు. బయటికి రావడమే తరువాయి వీధి చివరికి పరుగు లంకించుకున్నాడు.వీధి చివరన సుమారుగా ఐదు వందల చదరపు గజాల స్థలంలో ఒక అధునాతనమైన బంగళా! అందులోనుంచి అదే సమయానికి ఇద్దరు పిల్లలు బయటికి వచ్చారు. వాళ్ళ భుజాలకు స్కూలు బ్యాగ్గులు వేలాడుతున్నాయి.పాల నురగలాంటి తెల్లని చొక్కా, నేవీబ్లూ రంగు నిక్కరులో అబ్బాయి, చొక్కా తెల్లదే ఐనా నేవీబ్లూ రంగు గౌనులో అమ్మాయి ఉన్నారు.అబ్బులు కన్నార్పకుండా వాళ్ళనే చూస్తూ నిలబడి ఉన్నాడు. వాడి కళ్ళల్లో ఏదో మెరుపు, మనసులో ఏదో ఉత్సాహం, ఆనందం.కాస్సేపటికి చిన్న మారుతీ జెన్‌ కారు ఆ ఇంటి బయటికి వచ్చింది. వాళ్ళ అమమ్మ కాబోలు డ్రైవింగ్‌ సీటులో కూర్చుని ఉంది.కారు బయటికి రాగానే ఇద్దరు పిల్లలూ ఎక్కి కూర్చున్నారు. రాజహంసలా నిదానంగా సుతిమెత్తగా రోడ్డుమీద పరుగుతీసిందా కారు.కారు గనుమరుగయ్యేదాకా అక్కడే నిలబడి చూస్తూ ఉండి ఆ తరువాత పెద్దగా నిట్టూర్చి మెల్లగా తన గుడిసె వైపు అడుగులు వేశాడు అబ్బులు. రోజూ ఉదయం తొమ్మిది గంటలకు ఆ పిల్లలు బడికి వెళ్ళడాన్ని గమనించడం అబ్బులు దినచర్యలో ఇక భాగం. ఇప్పుడు కాదు, గత ఏడాదిగా, వాళ్ళు అక్కడికి వచ్చినది మొదలు.అప్పటికే బడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడు తన దుస్తులవైపు ఒకసారి చూసుకున్నాడు.

 కాకీ రంగు లాగు, ఎర్రగళ్ళ చొక్కా. తన దుస్తులంటే తనకే అసహ్యం వేసింది. కానీ ఏం చేయ్యలేదు. అదే వేసుకుని వెళ్ళాలి. అది వేసుకోకుండా మామూలు దుస్తులేవైనా కూడా వేసుకోవచ్చు. యూనిఫాం గురించి వాడి స్కూల్లో పట్టింపు లేదు.ఐతే వాళ్ళను చూసినప్పటి నుంచీ తను కూడా ఆ పిల్లల్లాగా బడికి వెళ్ళాలన్నది వాడి చిన్నారి మనసులోని ఆశ. కానీ పరిస్థితులు అనుకూలించవు. కాబట్టి తన చిరకాల వాంఛను అలా వాళ్ళు స్కూలుకు వెళ్తుండగా చూసి తీర్చుకుంటాడు రోజూ.పట్టువదలని విక్రమార్కుడిలా కనీసం వారంలో రెండురోజులైనా తల్లిని వేధిస్తాడు తనను కూడా వాళ్ళ బడిలో చేర్పించమని.‘‘అంత స్థోమతే మనకుంటే మనమీ గుడి సెలో ఎందుకుంటాం కన్నా?’’ అంటూ వాళ్ళమ్మ వాణ్ణి అనునయించేది.‘‘నువ్వెప్పుడూ ఇంతేలే. నాకు నచ్చజెప్పే బదులు నాన్న దగ్గర ఇంకాస్త ఎక్కువగా సంపాదించమని చెప్పొచ్చుగా’’ అన్నాడు బుంగ మూతితో.వాడి ప్రశ్నకు జవాబు చెప్పలేక విరక్తితో నవ్వింది తల్లి. అంతలోనే వాడి చిన్నారి బుర్రలో వచ్చిన ఆలోచనకు ఆశ్చర్యపోయింది. ఆపై కాస్త తృప్తి పడింది, ఆ వయసుకే సంపాదనంటే ఏమిటో, దాని ప్రాముఖ్యం ఏమిటో కొంతైనా అర్థం చేసుకున్నందుకు.