మా ఇంటి ఎదురంగ ఆవుసలి బ్రమ్మయ్య ఇల్లు వుండేది. గాయినకు నల్గురు కొడ్కులు. ఇద్దరు బిడ్డలు. గాల్లల్ల సుగుణ నాతోని ఆడుకునేది. గామె నేను ఒకటో తరగతి కెల్లి ఐదో తరగతి దాంక బాగాయత్‌ బల్లె సద్వుకున్నం. ఇద్దరం గల్సి బడికిబోయెటోల్లం. వానకాలంల పిట్టగూల్లు గట్టి పిట్టకింద బెల్లం నాకింత బెల్లం అన్కుంట ఆడుకునేటోల్లం. మోరిల కాయితం పడ్వలు ఇడ్సెటోల్లం. ఆరుద్ర పుర్గులను బట్టి అగ్గిపెట్టెల వుంచి తినేతందుకు గవ్విటికి బంతాకులు బెట్టెటోల్లం.సుగుణ తమ్ముడు కుమార్‌గాడు ఒకసారి జిన్గన్నను బట్టుకోని వొచ్చిండు. గా పుర్గు బంగారం లెక్క మెర్వబట్టింది. సుగుణోల్ల ఇంట్ల తుత్తూర పండ్ల చెట్టు వుండేది. ఎవ్వరు సూడకుంట గామె తుత్తూర పండ్లు దెంపి నాకు ఇచ్చేది. ఒకసారి గామె నాకు నెమ్లీక ఇచ్చింది. ఇంకోపారి సరస్వతి ఆకు ఇచ్చింది. గా దాన్ని వైల దాస్కున్న. సరస్వతి ఆకును వైల బెట్టుకుంటె మంచిగ సదువొస్తదని మా దోస్తలనేటోల్లు.సుగుణ, నేను తీరుతీర్ల ఆటలు ఆడెటోల్లం.

 ఒకసారి పెండ్లి ఆట ఆడినం.నేను మగపెండ్లోల్ల దిక్కు పెద్దమనిసిని. సుగుణ పిల్లోల్ల దిక్కు పెద్దమనిసి. పిల్లగానోల్లు పిల్లను జూసెతందుకు వొచ్చిండ్రు. చాయ్‌ దాగినంక-‘‘మీ పిల్లకు వొంటొస్తదా?’’ అని అడిగిండ్రు.‘‘రాదు నేర్సుకుంటది’ అని పిల్లోల్లు అన్నరు.‘‘మీ పిల్లకు పాటొస్తదా? ఆటొస్తదా?’’‘‘పాటొస్తది. ఆట రాదు గని అందరిని ఆడిపిస్తది’’‘‘కట్నం ఏమిస్తరు?’’‘‘మా పొల్లనే బంగారం. ఇంక వేరె కట్నం ఎందుకు?’’‘‘ఆడిబిడ్డ కట్నం గూడ ఇయ్యరా?’’‘‘ఒక చీర బెడ్తం’’‘‘పెండ్లి దూమ్‌దామ్గ జెయ్యాలె’’‘‘గుల్లె పెండ్లిజేస్తం’’‘‘బరాత్‌ దీస్తరా?’’‘‘పెండ్లికొడ్కుపెండ్లి పిల్లను ఎత్తుకోని ఊరంత దిర్గాలె. గదే బరాత్‌’’‘‘మాకు మీ సంబందం వొద్దు’’‘‘మేము గావాలంటున్నమా?’’‘‘ఇంక గూసున్నరేంది? పాండ్రి’’ఇంకొకపారి గాజులబ్యారం ఆట ఆడెటోల్లం. గా ఆటల నేను గాజులోన్ని.‘‘గాజులమ్మా గాజులు’’ అని నేను ఒల్లితె-‘‘ఏయ్‌ గాజులాయినా గిటురా’’ అని సుగుణ బిలిసింది.నేను గామె తాన్కి బోయి గాజుల మూట కిందికి దించినట్లు యాక్టింగ్‌ జేసెటోన్ని.‘‘నీ తాన ఏయే గాజులు ఉన్నయి?’’ అని సుగుణ అడిగితె-‘‘ఎర్ర గాజులున్నయి. పచ్చ గాజులు ఉన్నయి. పూల గాజులున్నయి. ఆకుపచ్చ గాజులున్నయి’’ అని నేను అంటె-