నాలుగు రోడ్ల కూడలి.రేపల్లె వైపు వెళ్లే బస్సు తూర్పునకు అభిముఖంగా నిలబడి ఉంది. దక్షిణం దిక్కునపోయే బాపట్ల బస్సు కూడా అదే సమయంలో వచ్చి ఆగింది. రెండు బస్సులు వచ్చి ఆగడంతో హోటల్లో రద్దీ పెరిగింది.క్యాష్‌ కౌంటరు దగ్గరున్న సదానందం లేచి నిలబడి టేబుల్స్‌ అన్నీ నీటుగా వున్నాయో లేదోనని ఓసారి పరికించి చూశాడు. కష్టమర్స్‌ అడిగినవి సక్రమంగా అందుతున్నాయో లేదోనని సప్లయర్స్‌ను అప్రమత్తం చేస్తూ వున్నాడు తన కేకలతో.హోటల్లో అంతా సవ్యంగా వుందని అనుకున్నాక రోడ్డు వైపు దృష్టి సారించేడు.బస్సుదిగి రోడ్డు దాటుకుంటూ హోటల్‌ వైపు వస్తున్న ఉదయ్‌ని చూడగానే సదానందం గుండె వేగంగా కొట్టుకుంది. మొహంలో ఆనందం చోటు చేసుకుంటే, కాళ్లు చేతులు తడబడ్డాయి. ‘ఉదయ్‌’ అంటూ పెద్దగా కేకవెయ్యబోయి ఆగిపోయాడు గతం గుర్తుకు వచ్చి.మెదక్‌ వదిలిపెట్టి వచ్చి ఐదేళ్ల అవుతుంది. పొన్నూరులోని హోటల్‌ ప్రొపైటర్‌ స్నేహితుడవ్వడంతో అతని దగ్గర కొచ్చేశాడు. హోటల్‌ నిర్వహణ బాధ్యతలన్నీ సదానందానికి వదిలి హోటల్‌ ప్రొపయిటర్‌ ఆ వూరు, ఈవూరు తిరుగుతూ వుంటాడు.ఉదయ్‌ సదానందాన్ని చూడగానే ఆనందం పట్టలేక పరుగులాంటి నడకతో వచ్చి వాటేసుకున్నాడు.‘‘మీరు ఇక్కడున్నారా? మీ కోసం ఎదురుచూడని రోజులేదు.... గాలించని ప్రదేశం లేదు. మమ్మల్ని వదిలి ఐదేళ్లు ఒంటరిగా ఇక్కడ ఎలా ఉండగలిగేరు? మీ కోసం మీ మనవడు కలవరిస్తూ వుంటాడు ఎప్పుడు... తిరిగి మిమ్మల్ని చూస్తే ఎంత సంబరపడిపోతాడో?’’ అన్నాడు ఉదయ్‌. ఉద్రేకపడి పోతూ.కొడుకు భుజాలు ఆప్యాయంగా నిమిరేడు.ఏదో అనుమానం సదానందం మనస్సును ముట్టడించింది.కొడుకు మొహంలోకి పరీక్షగా చూశాడు.

ఆయన చూపుల్ని పసిగట్టాడు ఉదయ్‌.‘‘మీరు వెళ్లిపోయిన దగ్గర్నుంచి మీ కోడలు కూడా బాధపడుతూ వుంది. మీరు ఇల్లు విడిచి వెళ్లిపోవడానికి కారణం తనేనని మధనపడుతూ వుంది’’ అన్నాడు ఉదయ్‌.కొడుకు మాటలు వినగానే స్థిమితపడింది సదానందం మనస్సు.క్యాష్‌ కౌంటరుకు పక్కనున్న టేబుల్‌ దగ్గర కొడుకును కూర్చోబెట్టి తనూ పక్కన కూర్చున్నాడు.ఓ సర్వర్‌ని పిలిచాడు.‘‘ఈ అబ్బాయి ఎవరనుకుంటున్నావ్‌? నా కొడుకే... పేరు ఉదయ్‌... కంట్రాక్టరు... లక్షలు లక్షలు సంపాదించేడు...’’ ఏదో చెప్పబోయాడు సదానందం.‘‘అంత ఆస్తి వున్నవాళ్లు కొడుకును, లక్షల్ని వదిలేసి ఈ హోటల్‌కి కాపలా కాస్తున్నారేంటి?’’ సదానందం తనతో పరాచికాలు ఆడుతున్నాడను కుంటూ అడిగేడు సర్వర్‌.‘‘నా కొడుకేనోయ్‌... ఆరోగ్యం సరిగ్గా లేక డాక్టర్లు గాలి మార్పు కావాలంటే నేను ఇక్కడికొచ్చాను’’.తండ్రి అసలు విషయం చెప్పకుండా తన పరువు కాపాడినందుకు మనస్సులోనే తండ్రికి నమస్కరించేడు ఉదయ్‌.సర్వర్‌ కుర్రాడు ఉదయ్‌వైపు పరిశీలనగా చూశాడు. సదానందం పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించేయి.