ఉరుములతో మెరుపులతో ఆకాశం ఉగ్రమొచ్చినట్టుండాది.గుడిమెట్ల మింద కుర్చున్న దీపాలు గాలికి రెపరెపలాడతా వుండాయి.‘‘అక్కా... నువ్వు పీలేరులో జరిగిన కత చెప్పినావు గదా! నేను పీలేరు తల్లి కత చెప్తాను’’ అనింది ఎగవింటి దీపం.‘‘పీలేరా...? అది ఊరు పేరు గదా!’’ అనింది దిగవింటి దీపం.‘‘ఊరుపేరు గాదు నదిపేరు. పిలి అంటే నెమిలి. నెమిలి కంట్లో నుంచి ఏరు పుట్టింది. ఏటిగెడ్డనే ఉండాది కాబట్టి ఊరిపేరు పీలేరైంది’’ అని చెప్పింది ఎగవింటి దీపం.‘‘ఈ రాళ్ళసీమలో నదులెక్కడ వుండాయే తల్లీ! ఏరులేగదా వుండేది. నాలుగు చినుకులు పడితే గలగలా ఊపిరిపోసుకుంటాయి. నాలుగు దినాలు ఎండకాస్తే పురిట్లోనే కండ్లుమూస్తాయి’’ అనింది దిగవింటి దీపం.‘‘పీలేరు అట్లాగాదులే! రైతు గొంతెత్తి అమ్మా పీలేరుతల్లీ! పంటలు మలమలా మాడిపోతా వుండాయి... రా తల్లీ! అని పిలిస్తే, ఇద్దో వస్తా వుండాను అని గలగలా పరుగులు పెట్టుకుంటా వచ్చేదంట’’ అనింది ఎగవింటి దీపం.‘‘పిలిస్తే పీలేరు పరిగెత్తుకుంటా వచ్చేదా! భలే ఇచ్చిత్తరంగా వుండాదే నువ్వు చెప్పేది’’ అనింది కండ్లు ఇంత చేసుకోని మిద్దింటి దీపం.‘‘అవునక్కా.. పిలిస్తే చాలు పరిగెత్తుకుంటా వచ్చేదంట. నీటి పింఛాన్ని పురివిప్పి రాళ్ళమింద నృత్యం చేసేదంట. ఇపడు మీకు ఆ పీలేరు తల్లి కతే నేను చెప్పబొయ్యేది’’ అనింది ఎగవింటి దీపం.

ఉత్తీత సంజీవిని పుల్లతో నేలమింద పొడుగ్గా గీత గీసింది.వాన పడినపడు పీలేరు తల్లి ఊపిరిపోసుకుని గలగలా రాళ్ళమింద దరువేస్తా నీటి గొంతెత్తి పాటపాడతా వున్నింది.రైతు పెళ్ళాం పసుపు కుంకాలతో పీలేరు తల్లికి నలుగుపెట్టి కప్పూర హారతి పట్టింది. పట్టుకోకా, రైకా సాంగెం పెట్టింది.రైతు మోకాలు లోతు నీళ్ళల్లోకి దిగినాడు. పరవళ్ళు తొక్కతా పాదాలని తాకిన ఏరుని దోసిట్లోకి తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు. దోసిలి వడ్ల గింజలతో నిండిపోయింది.ఒగరోజుపచ్చని పచ్చిక బీళ్ళల్లో కొర్రుకు (ఇంద్రధనస్సుకి) చినుకుల ఉయ్యాల కట్టుకోని భలే కుశాలగా ఊగతా వున్నింది పీలేరు తల్లి.ఆదావన పగిడి దొర గుర్రమేసుకోని పోతా వున్నేడు. పీలేరు తల్లిని చూసి ఆగినాడు. దొరను చూసి గబుక్కున ఉయ్యాల దిగింది.