మనిషి ప్రాణానికి ఏ ప్రమాదం లేనంతకాలం ప్రతి చిన్న సమస్యకూ చావే పరిష్కారం అనుకుంటాడు. తీరా ఆ చావే ఏ వ్యాధిరూపంలోనో తను ఆహ్వానించకుండానే వెతుక్కుంటూ పలకరించడానికి వస్తే మొహం చాటేసి తప్పించుకోవాలని చూస్తాడు. ఆ మాట ఉచ్ఛరించడానికే భయపడతాడు. బతుకు తీపి అలాంటిది. మనిషికి అన్నింటికంటే విలువైనది తన ప్రాణం. ఆ ప్రాణమే లేకపోతే మనుగడేం ఉంది? ఏ క్షణాన పోతుందో తెలియని ప్రాణం కోసం ఎంత ఆరాటం. ఎంతెంత పోరాటం, ఎన్ని ఆశలు, ఎన్నెన్ని ఆలోచనలు. గతం తిరిగిరాదు, రేపు మనది కాదు. ఈ క్షణం మాత్రమే మనది అనే వాస్తవం ఎంతమందికి గుర్తుంటుంది?రామారావు హాస్పిటల్లో వార్డు బయట బెంచీ మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. బెంచీమీద నుంచి లేచి రెండు మూడు సార్లు వరండాలో అటూ ఇటూ తిరిగాడు. నిరాశ, నిస్పృహ అతని మొహంలో తాండవిస్తున్నాయి. తన నిస్సహాయ స్థితికి తనపై తనకే జాలిగా ఉంది. ఇంత కష్టం వస్తుందని ఏనాడూ ఊహించలేదు.‘‘సర్‌! డాక్టర్‌ వినాయక్‌గారు పిలుస్తున్నారు’’ సిస్టర్‌ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. అమె ననుసరించాడు. డాక్టర్‌ గారి రూంలోకి రాగానే నమస్కారం పెట్టాడు. ఆయన కూర్చోమని సంజ్ఞ చేసాడు.‘‘పేషంట్‌ కండిషన్‌ మీకు ఆల్‌రెడీ చెప్పాను. క్రియాటినైన్‌ బాగా పెరిగింది. ఈ రోజు ఐరన్‌ ఎక్కించాం. రెండు మూడు డయాలసిస్‌లకు కూడా ఆమె దేహస్థితి తట్టుకునే పరిస్థితి లేదు. 

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ త్వరలో చెయ్యాలి. ఫార్మాలిటీస్‌ అన్నీ మీకు తెలుసు కదా!’’ అన్నారు డాక్టర్‌ వినాయక్‌.రామారావు తలూపాడు.‘‘ఎవరైనా ఉన్నారా?’’మొదట ఉన్నట్లుగా, ఆ తర్వాత లేనట్లుగా తలూపాడు.‘‘ఇంద్రజ గారు మీ అమ్మాయి ఇస్తుందని చెప్పారే?’’ అన్నారు డాక్టర్‌ గారు.‘‘అవును... అవును... కానీ...’’ అంటూ నసిగాడు రామారావు.‘‘టిష్యూ మాచింగ్‌ గట్రా మేం చూసుకుంటాం. మీరు త్వరగా ఆ ఏర్పాట్లలో ఉండండి. ఓ.కె?’’ అన్నారు ఇక వెళ్ళమనట్లుగా.తలూపి నీరసంగా లేచాడు రామారావు. డాక్టర్‌ గదిలోంచి బయటకు వచ్చాడే గానీ రామారావు ఆలోచన్ల ప్రవాహంలోంచి బయటపడలేదు.కాలేజీ రోజుల్లో ఎంతో ప్రాణప్రదంగా ప్రేమించి, పెద్దల నెదిరించి, పోరాడి, ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్న ఇంద్రజ ఈ రోజు రెండు కిడ్నీలు ఫెయిలయి బ్రతకడం కోసం చేస్తున్న పోరాటానికి రామారావు మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఎంతో అందంగా, హుందాగా, మంచి విగ్రహంతో ఐదు అడుగుల ఆరు అంగుళాల నిండయిన మనిషి ఆహారం లేక శుష్కించి, క్రుంగి, కృశించి, నీరసంగా, నిస్సత్తువగా తయారయ్యింది. ఎప్పుడూ ఎంతో హుషారుగా, అందరి తలలో నాలుకలా, ఎవరికే కష్టం వచ్చినా ఆదుకునే ఇంద్రజ ఇప్పుడు అచేతనంగా, నిస్సహాయంగా, మంచానికి అతుక్కుపోయింది. వినీ విన