లోతుకుపోయిన కళ్ళు శుష్కించిన చెంపలు జొన్న పీచులాంటి జుట్టుని అల్లుకున్న ఎలుక తోకలాంటి జడ, ఎండుకట్టెలాంటి కాళ్ళు చేతులు, బానలాంటి పొట్టతో వున్న ఆ స్ర్తీ పేరు రాజ్యం. ఆమె పూర్తిపేరు రాజ్యలక్ష్మో, రాజేశ్వరో తెలియదు గాని, ఆమె భర్త కృష్ణమూర్తి మాత్రం మాకు రాజ్యంగానే ‘పరిచయం’ చేసాడు. ఇరుగు పొరుగువాళ్ళు కూడా అలాగే పిలిచేవారు.పాచితో గారపట్టిన పళ్ళు, రోజుల తరబడి ఒకే ప్యాంటు, షర్టుతోఆమడదూరంలో వుండగానే చెమట వాసన కొట్టేవాడు కృష్ణమూర్తి.అతను పళ్ళు తోమడు, స్నానం చెయ్యడు అని ఇరుగుపొరుగువాళ్ళు చెప్పుకునేవారు. అది నిజమని నిర్ధారిస్తూ ‘‘ఒంటికి మురికిబలం, పంటికి పాచి బలం! మట్టిలో కలిసిపోయే ఈశరీరానికి మట్టి అంటితేనేం?’’ అనేవాడు కృష్ణమూర్తి.‘‘ఇంకానయం!’’ పుట్టినప్పుడు బట్ట కట్టలేదు. పోయేటప్పుడు అది వెంటరాదు! అని నగ్నంగా తిరక్కుండా ఏ మురికి బట్టలో కట్టుకుంటున్నాడు. అదే సంతోషం’’ అని నేను మావారు నవ్వుకునేవాళ్ళం.కృష్ణమూర్తి మావారు నడిపే రైస్‌మిల్‌లో గుమస్తాగా పనిచేసేవాడు. మాదగ్గర పనిచేసే వర్కర్ల కష్టసుఖాలని విచారిస్తూ వాళ్ళకి ఆపదలలో అవసరాలలో సాయం చెయ్యడం వల్ల వాళ్ళ కుటుంబాలతో కూడా నాకు పరిచయమేర్పడింది. ఆ చిన్న టౌనులో వేరే కాలక్షేపమేమీ లేని నేను ఇంటి పనయ్యాక ఇరుగుపొరుగు స్ర్తీలని పోగేసి కుట్లు, అల్లికలు వగైరా నేర్పుతూండేదాన్ని మావారి పరిభాషలో మహిళామండలిగా వ్యవహరించే ఆ గ్రూప్‌లో రాజ్యం కూడా సభ్యురాలే.

 రాజ్యానికి కూడా నాదగ్గర ఏదైనా నేర్చుకోవాలని వున్నా పాపం, ఆమె ఆరోగ్యం అందుకు సహకరించేది కాదు.,రాజ్యం ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ వుండేది ‘‘రైసు మిల్లునుంచి రాత్రి పదిగంటలకి ఇంటికి చేరిన కృష్ణమూర్తి తెల్లవారి అయిదున్నరకే, నిద్ర లేచి వంటంతా తనే చేసేవాడట. పిల్లలిద్దరికీ స్కూలు దగ్గరే . పొద్దుట అన్నం తిని మళ్ళీ లంచ్‌ అవర్‌ ఇంటికొచ్చేవారట. ఇవన్నీ ఇరుగుపొరుగులు చెప్పేవారు.అనాకారి అయినా, అనారోగ్యంతో బాధపడుతున్నా రాజ్యం పట్ల కృష్ణమూర్తికి ‘ప్రేమ’ రవ్వంతయినా తగ్గలేదు. రాజ్యం కాస్త ఆరోగ్యంగా వున్న రోజు మొగుడి రసికత గురించి నును సిగ్గుతో మాకందరికీ చెప్పేది‘‘ఆయనకి నేనంటే ప్రాణం. నేను పక్కన లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు’’ అని ఒకసారి, ‘‘మా పెళ్ళయిన కొత్తలో...’’ అంటూ మరోసారి చెప్పేది. నునుసిగ్గు ఆమె శుష్కించిన చెంపలపై వికృతంగా వంకర్లు పోయేది. వున్నట్టుండి ఏమయిందోగాని ఒకరోజు రాజ్యానికి అనారోగ్యం ఎక్కువయి కృష్ణమూర్తి ఆమెని పిల్లలని తీసుకుని ఆమె పుట్టింటివాళ్ళ ఊరుకి వెళ్ళాడని మావారు చెప్పారు.వారం రోజుల తర్వాత ఒకరాత్రి పదకొండు గంటలకి వచ్చాడు కృష్ణమూర్తి.