రాజగోపాల్‌ ఎయిర్‌పోర్టు నుంచి కొడుకు జయరాంని తీసుకొచ్చి ఇంటి ముందు కారు ఆపేసరికి, భార్య సుగుణ, తల్లి దమయంతమ్మ, ఎదురుచూస్తూ గుమ్మంలోనే కూర్చున్నారు. జయంరాం కారు దిగి ఒక్క అంగలో మెట్లెక్కి తల్లికాళ్ళకు నమస్కరించి పక్కకి తిరిగి ఆశ్చర్య పోయాడు.‘‘అమ్మా! నేను కారు దిగేప్పుడు బామ్మ ఇక్కడే ఉందిగా? అర్జంటుగా అంతర్ధానమైందేమిటబ్బా!’’ అన్నాడు నవ్వుతూ.

‘‘ఏమోరా! నీ బామ్మ నీ మీద అలిగిందేమో! డెబ్భై అయిదేళ్ళ పసిపిల్ల కద! సముదాయించి కొంచం గారాబం చేసి తీసుకురా’’ అని పక్కగది వైపు చూపించి, నవ్వుతూ వంటగది వైపు వెళ్లింది. ఇంతలో రాజగోపాల్‌, పని మనిషిచేత కారు డిక్కీలోని జయరాం పెట్టెలూ, బ్యాగులూ తెప్పించి హాల్లో పెట్టించాడు.గదిలో కెళ్ళిన జయరాం, కళ్ళు మూసుకుని గోడనానుకుని కూర్చున్న బామ్మ, జడుసుకునేట్టుగా బిగ్గరగా ‘బామ్మా’ అని అరిచాడు. ఆవిడ నిజం గానే ఉలికిపడి కళ్ళు తెరిచింది. జయరాం బామ్మ పక్కనే కూర్చుని, ఆవిడ తలని తన రొమ్ముకు హత్తుకుని ‘‘ఎందుకే బామ్మా? నీ జయమీద అలిగావా? వాడేం తప్పు చేశాడో చెప్పు! ఇప్పుడే శిక్ష వేద్దాం!’’ అన్నాడు చిరునవ్వుతో. బామ్మ కూడా జయరాం బుగ్గలను నిమిరి, ముద్దు పెట్టుకుని, ‘‘నిజంగానే అలిగానురా. తొందరేమొచ్చింది. చెప్తా లే పదా’’ అని జయరాం నడుము పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి రాజగోపాల్‌ పక్కన సోఫాలో కూర్చోబెట్టి తనూ కూర్చుంది.

ఇంతలో సుగుణమ్మ కాఫీ గ్లాసులతో వచ్చి ముగ్గురికీ ఇచ్చింది. ‘‘కాఫీ తాగి, తర్వాత స్నానం చేసి రారా జయా. బాత్‌ రూంలో నీళ్ళు పెట్టా. కాసేపు మీ బామ్మకి అమెరికా కబుర్లు చెప్తూ కూర్చో. ఈలోపు వంట పూర్తి చేసి పిలుస్తా’’ అన్నది.ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక నలుగురూ హాల్లో కూర్చున్నారు. మాటల మధ్యలో కొడుకునడిగింది సుగుణమ్మ.‘‘క్రితం సారి వచ్చినప్పుడు ఏదో వంక చెప్పి దాటేశావు. ఇప్పుడు రెండు నెలలుంటానంటున్నావు గద. పెళ్ళి చేసుకుని వెళ్ళరా. బామ్మ కూడా నీ పెళ్ళి ఎప్పుడు చూస్తానో, అసలు చూస్తానో , లేనో అని రోజుకోసారైనా అనుకుంటుంది’’.