సాయంత్రం 6 గంటలు.మొజంజాహి మార్కెట్‌ ప్రాంతమంతా ఎంతో రద్దీగా ఉంది.అఫీసొదిలింతర్వాత తిన్నగా కరాచీ బేకరీకెళ్ళి బ్రెడ్‌ ప్యాకెట్‌ కొని సిగ్నల్‌ పాయింట్‌ దగ్గర బస్సుకోసం అరగంట నుంచి నిలుచున్నాను. అప్పటికే నాలో సహనం చచ్చిపోయింది. ఏ బస్సు చూసినా హాంగింగే. డైరెక్ట్‌గా బిహెచ్‌ఈల్‌ వెళ్ళే బస్సు ఎక్కడానికి మళ్ళీ ఆబిడ్స్‌ స్టాపు వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడికే వెళ్ళి 218 బస్సెక్కితే డైరెక్ట్‌గా బిహెచ్‌ఈల్‌ వెళ్లొచ్చు. మెల్లిగా బస్టాపుకేసి నడక ప్రారంభించాను.మా పెళ్ళయి ఈ హైదరాబాద్‌ నేను కాపురానికొచ్చింతర్వాత కొత్తలో ఇంట్లో ఒక్కదానికి ఏమీ తోచేది కాదు. ఆయన ఎంత ససేమిరా అన్నా చివరకు ఎలాగో ఒప్పించి కాస్తా కాలక్షేపంగా ఉంటుందని మొజాంజాహి మార్కెట్లోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఈరోజంటే తామిద్దరు. రేపు పిల్లలు పుట్టాక - వారి చదువులకని, పెళ్ళిళ్లకని, నానాతంటాలు పడేవారిని తనెంతమందిని చూడ్డంలేదు. దీపముండగానే ఇల్లు సర్దుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులయితేనే నాలుగు పైసలు సంపాదించి వెనకేసుకునేది. అది ఆయనకి చెప్పినా చెవికెక్కదు. అనవసరంగా సమయం వృథా చేయడం ససేమిరా నాకు నచ్చదు. ఏ పని లేకపోయినా ఏదోఒక పుస్తకం తిరగేస్తూ వుండవలసిందే.

 బస్సులో కూడా ప్రయాణ బడలిక తెలియనంతగా పుస్తక పఠనంలో లీనవతుంది తను. వారపత్రికలు, మాసపత్రికలు, వార్తాపత్రికలు ఒకటేమిటి దేన్ని చదవకుండా వదలని తత్వం తనది. నా పఠనాశక్తికి మెచ్చుకోలుగా మావారు అంటుంటారు నీ ధాటికి తట్టుకునేది, ఆ స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీయేనని. అలా ఆలోచిస్తూ నడుస్తున్న నాకు ఎందుకో అనుమానం కలిగి వెనక్కి తిరిగి చూశాను. రద్దీగా ఉన్న రోడ్డు కావడం మూలాన క్షణం నేనాగేసరికి నన్ను తాకీతాకనంత దగ్గరలో ‘సారీ’ అని ఠక్కున ఆగిపోయాడు. తలెత్తి చూశాను అతని వంక. ఇందాక సిగ్నల్‌ దగ్గర బస్సుకోసం వెయిట్‌ చేస్తున్నపడు కూడా అలాగే మింగేసేలా చూస్తుంటే కాస్తా సర్దుకుని పక్కకు నిలబడింది తను. మళ్ళీ వడివడిగా నడవసాగాను బస్టాప్‌కేసి. నా ఆలోచనలు మళ్ళీ దారి మళ్ళాయి.మా ఊళ్ళో నేను డిగ్రీ చేస్తున్న రోజుల్లో నన్నందరూ కాలేజీ బ్యూటీ అని ఆటపట్టించడం గుర్తుకొచ్చింది. అందానికి గ్రేడింగివ్వటం నామటుకు నాకు నచ్చని విషయం. మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌, కోటానుకోట్లమందిలో ఎందరో అందగత్తెలు. దైవదత్తమైన అందాన్ని కొలవడానికి ప్రమాణమేది?అందాన్ని మనసులో ఆరాధనా భావంతో చూడడంలో తప లేదేమోగానీ, పైకి పదేపదే మెచ్చుకుంటూ విపరీతమైన ప్రాచుర్యాన్ని కల్పించడం నాకు నచ్చదు. అందుకే ఆనాడు కాలేజీ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్‌ ఇచ్చినా నేను మురిసిపోలేదు. పైగా నొచ్చుకున్నాను కూడా.