చీరచెంగును భుజాలపై నుండి లాక్కొని వక్షస్థలంపై నిండుగా కప్పుకుంది. చేతులు రెండూ జోడించి‘‘నమస్తే.... మేడమ్‌...’’ అందిప్రిన్సిపాల్‌ తల ఎత్తి చూసింది.నందివర్ధనం పువ్వులా... గంజిపెట్టిన తెల్లచీరెలో తెల్లటి మహిళ. నిరాడంబరతలో వినూత్నమైనఅందం. విధవలాంటి కట్టూబొట్టూ... కానీ ఆమె విశాలమైన పాలభాగం మధ్యలో ధగదగామెరుస్తూన్న తిలకం. చేతినిండా గాజులు.పరస్పర విరుద్ధమైన అలంకరణ.‘‘ప్లీజ్‌... బిసీటెడ్‌’’.‘‘మేడమ్‌... నా కొడుకుని స్కూల్లోవెయ్యటానికొచ్చాను’’.‘‘ఏ క్లాసులో’’‘‘నర్సరీలో...’’‘‘మూడేళ్ళు నిండాయా?’’‘‘నిండలేదు. ఇంకా మూడు నెలలయితే... కానీ మేడమ్‌... నా కొడుకుని ఇంటి వద్ద పట్టుకొనే అమ్మమ్మగానీ, నాయనమ్మగానీ ఎవరూలేరు. ‘ఆయమ్మ’ - ఉంది. కానీ వాళ్ళవాళ్ళెవరో చనిపొయ్యారనీ ఊరెల్లిపోయింది... దినాలు అయిపొయ్యేవరకూ రాదు. ...అందువలన...’’‘‘మీరు ఏం చేస్తుంటారు?’’‘‘ఎస్‌.బి.హెచ్‌లో క్యాషియర్ని... నాల్గు రోజుల నుండి వీడ్ని బ్యాంక్‌కు వెంట తీసుకుపోతున్నాను నేను.. కానీ బ్యాంక్‌ అంటే... అంతా డబ్బుతో కూడిన వ్యవహారం. లెక్కల్లో తప్పుపోతే కంప్యూటర్‌  తిప్పికొడ్తది.

 మళ్ళీ మళ్ళీ కూడి ఎకౌంట్‌ కరెక్ట్‌ చేసి కంప్యూటర్‌లో ఫీడ్‌ చేసే సరికి, తలప్రాణం తోక కొస్తది. ఒకవైపు వీడు. మరొకవైపు నోట్లకట్టలు... ఎదురుగ్గా ఇంటెలిజన్స్‌ ఆఫీసర్‌లా కంప్యూటర్‌... పని చేసుకోలేక పోతున్నాను’’.‘‘అయితే డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికేట్‌ మార్చి తెచ్చుకోగలరా?’’‘‘ప్రయత్నిస్తా... అప్పటివరకూ స్కూలుకు రానివ్వండి...’’‘‘టెర్మ్‌ఫీజ్‌... పదిహేను వందలు...’’‘‘ఫర్వాలేదు... ఇదిగో ఫీజ్‌’’....‘‘మీరు ఈ ప్రక్క గదిలో కూర్చొని అప్లికేషన్‌ ఫాం నింపి ఇవ్వండి...’’ అప్లికేషన్‌ ఫాం అందిస్తూ... ‘‘డేట్‌ ఆఫ్‌ బర్త్‌’ కాలం విడిచిపెట్టండి’’ అంది ప్రిన్సిపాల్‌.‘‘మంచిది.. మంచిది’’ అంటూ పక్క గదిలోకి నడిచింది. కూర్చోకుండానే నిలబడి అప్లికేషన్‌పై చూపులు నిలిపింది.కాళ్ళలో సన్నని ఒణుకు - కుప్పకూలిపోయింది కుర్చీలో. మళ్ళీ మళ్ళీ చదివింది. అవే అక్షరాలు. అవే వివరాలు. గోడపై చూపు నిలిపింది. సుదీర్ఘమైన నిట్టూర్పుతో మనసును అదుపులోకి తీసుకొని, అప్లికేషన్‌ ఫామ్‌ను పరచి, మడతలన్నీ ‘సాఫ్‌’ చేసి నింపసాగింది.విద్యార్థి పేరు... ‘డాష్‌... డాష్‌... డాష్‌... ‘అమర్‌’ ... నింపింది.ఇంటిపేరు ... డాష్‌... డాష్‌... డాష్‌.... నింపకుండా వదిలివేసింది.తండ్రి పేరు... ఆందోళన కలిగించే కాలమ్‌. ‘మధుసూదనరావ్‌’ అంటూ నింపింది. ఏదోఉద్విగ్నత. ఏదో వ్యాకులత. మెదడులోని నరాలు చిట్లిపొయ్యేలా హైవోల్టోజి. వెంటనే కొట్టిపారేసింది. అక్షరాలు పోల్చుకోకుండా బండబండగా కొట్టిపారేసింది. కసికసిగా అడ్డగీతలు గీసి పెన్‌ గాలిలోకి ఎత్తిపట్టుకుంది.‘‘ఇంకా నింపలేదా!.... అమ్మా’’ ప్రక్క గది నుండి ప్రిన్సిపాల్‌ పిలుపు - హెచ్చరిక. నింపని అప్లికేషన్‌ ఫామ్‌ పట్టుకొని ప్రిన్సిపాల్‌ రూమ్‌లో అడుగు పెట్టింది.మేడమ్‌ తలవంచుకుని సీరియస్‌గా రాసుకొంటోంది. పైన కిర్రుకిర్రుమంటూన్న ఫ్యాన్‌ చప్పుడు. ‘మే...డ... మ్‌’ - మెల్లగా పిలిచింది. భయం భయంగా.