లత జడేసుకుని మల్లెపూలు పెట్టుకుంటూండగా ఫోన్‌ మోగింది. డిస్‌ప్లే అయిన పేరు చూసింది. అతనే.ఒకింత ఆనందం. మరింత ఆందోళనా ఒక్కసారిగా ముప్పిరిగొన్నాయి. కలతచెందిన స్వరంతో ‘హలో’ అంది.‘‘ఆ... ఏం చేస్తున్నావ్‌?’’ అన్నాడు చాలా క్యాజువల్‌గా.‘‘పూలు పెట్టుకుంటున్నాను’’ అనబోయి అందుకుమరేదో అలజడి రేపే డైలాగ్‌ వినాల్సొస్తుందనిజడ సంగతి మాత్రమే చెప్పింది.‘‘ఎందుకు నన్నింత సతాయిస్తున్నావ్‌?’’ అన్నాడు.అతడి గొంతు అదొకలాంటి మైకం గొని మత్తుగా వుంది.‘‘ఇది మరీ బాగుంది.

నువ్వు విసిగిస్తూ పైగా నా మీద నేరం మోపడమా?’’‘‘నువ్వసలు ఎందుకు పరిచయమయ్యావ్‌?’’లత ఏమీ మాట్లాడలేదు.‘‘ప్లీజ్‌ లతా, నువ్వు నాక్కావాలి’’లతకి చాలా ఇబ్బందిగా వుంది. ఈ మాటలు వినివినీ మైండ్‌లో రికార్డయిపోయాయి. చిన్న చిన్న పదాల తేడాలు తప్పిస్తే అదే భావం.‘‘ప్రపంచంలో ఎన్ని విషయాల్లేవు? ఈ చెత్తక్కొటీ తప్పించి ఇంకేమైనా మాట్లాడరాదూ?’’‘‘లేదు, నాకు తక్కిందంతా నాన్సెన్స్‌. నువ్వు నాక్కావాలి. అందుకు నేనేం చేయాలో చెప్పు.’’‘‘ఇలాంటి మాటలొద్దు. ఇంకేమైనా మాట్లాడ్తే సంతోషిస్తాను.’’‘‘నేను తలుచుకుంటే ఎందరాడపిల్లలైనా వస్తారు. కానీ అదేంటో నాకు నీ మీదే....’’‘‘ఇది చాలా అన్యాయం. నన్నిలా డిస్టర్బ్‌ చేయడం ఏం బాలేదు.’’‘‘నాకూ తెలుస్తోంది. నిన్ను ఇబ్బంది పెట్టొద్దని ఎంత అనుకున్నా నీకు ఫోన్‌ చేయకుండా వుండలేకపోతున్నా. ఇద్దరం టీనేజ్‌లో లేం నిజమే. కానీ ఈ వయసులో కూడా ఇంత బలమైన ప్రేమ వుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది.‘‘గాడిదగుడ్డు. ప్రేమ అదసలు ప్రపంచం లోనే లేదు.’’‘‘నీలో ఇంత నిరాశ ఎందుకొచ్చింది? నాకు నీమీద కలిగిన దాన్ని ప్రేమ అనక ఏమంటారు? అస్తమానం నీతో మాట్లాడాలనిపిస్తుంది. 

నువ్వు నా పక్కన వుంటే బాగుండనిపిస్తుంది.’’‘‘తోక్కలో ప్రేమ. అసలా మాటంటేనే నాకు పరమ చిరాకు. ప్రపంచంలో తల్లీపిల్లల మధ్య తప్ప తక్కిన ఏ రిలేషన్‌లోనూ స్థార్వం తప్ప ఇంకోటి లేదు.’’‘‘నీకెదురైన ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అన్నీ అలానే వుంటాయని ఎందుకు అనలైజ్‌ చేస్తావ్‌? నువ్వు నమ్మినా, నమ్మకపోయినా, నాకు నువ్వంటే నిజంగా ఇష్టం. మాటల్లో చెప్పలేనంత ఇష్టం. పెళ్లయినవాడ్ని. స్త్రీ, పురుషుల మధ్య ఏముంటుందో తెలిసిన వాడ్ని. ఇక అంతకంటే ఏమీ వుండదని తెలుసు. కానీ అదేం చిత్రమో తెలీదు. ఈ వయసులో నీమీద ఇంత వ్యామోహం పుట్టు కొచ్చింది. నా మనసు నిన్ను గట్టిగా కోరుకుంటోంది’’ అన్నాడు.