ఆశ... భయం...మధ్యలో ఊయలలూగేదే బతుకు!వెలుతురు... చీకటి...మధ్యలో రెపరెపలాడేదే బతుకు!!తల నిండా మల్లెపూలున్నాయి. ఎంతైనా వాటి వాసనలో ఉండే మత్తు వేరు. అది ఒళ్లంతా కమ్మేస్తోంది. మొహానికి రాసుకున్న పౌడరుది ఒక వాసన. గడ్డం కింద, పయ్యెద కొంగుల మీద రాసుకున్న అత్తరుది ఇంకో వాసన. ఓ సాయిబు ఇచ్చిన అత్తరు అది. గుమ్మెత్తిపోతోంది. ఈ మూడు వాసనలు కలగలిసిపోయిన వాసన ఎలా ఉంటుందో... కానీ ఏదో ఒక వాసన వర్కవుట్‌ కాకపోతుందా? అని నా ఆశ.ముందువైపు బాగా గాలి ఆడేట్టు వెడల్పాటి ఓపెనింగుతో బిగుతుగా కుట్టించుకున్న పొట్టిచేతుల రవిక తొడుక్కున్నాను. పల్చటి జార్జెట్‌ చీర. ఒంటిమీద నిలబడ్డానికి ఆపసోపాలు పడుతోంది. ఇదే మాదిరి మరో ఆడది నాక్కనిపిస్తే... అర్జెంటుగా నన్ను మగాడిగా మార్చేయమని దేవుణ్ణి అడుగుతానేమో అని భయం.ఏర్పేడుకు రెండు కిలోమీటర్లు ఎడం... సీతారామపేటకు కొంచెం ఎగుదాల... చెట్లమాటున ఉన్న మైలురాయిపై కూర్చుని ఉన్నా. రాత్రి పన్నెండు ఒంటిగంట వరకు కూడా ఇబ్బందే. అప్పటిదాకా మామూలు మనుషులు, సెకండ్‌ షోలు చూసి ఇళ్లకు పోయే వాళ్లు రోడ్డుమీద తిరుగుతూనే ఉంటారు. చానా డేంజరు. ఇప్పుడు రెండయి ఉండొచ్చు. కొంచెం సేఫ్టీ.చుట్టూతా చీకటే. నా పాదాలే నాక్కనిపించడం లేదు. చీకట్లో దయ్యాలుంటాయని చిన్నప్పటినుంచి అమ్మ, అమ్మమ్మ అందరూ చెప్పి నమ్మించారు. 

దెయ్యాలు చప్పుడు చేయకుండా వచ్చి మనల్ని తినేస్తాయని చెప్పేవాళ్లు. నేను చాలా రాత్రిళ్ల నుంచి ఈ చీకటిలోనే కూర్చుంటూ ఉన్నాను. నన్నెప్పుడూ ఏ దెయ్యమూ తిన్లేదు. రాన్రాను నాకు చీకట్లో దెయ్యాలుంటాయనే భయం పోయింది. కానీ మనుషులు మాత్రం ఉంటారు.ఇంతలో రోడ్డుమీద పల్చగా పరుచుకుంటోంది వెల్తురు. ఆశ మినుక్కుమంది. కానీ అది కారు. నేను లేవబోయేలోగానే చప్పుడు కూడా చేయకుండా వెళ్లిపోయింది. దాన్తోటే వెల్తురు. మళ్లీ చీకటి మిగిలింది. నేను మిగిలాను. టైం గడిచిపోతోంది. కొంచెం గుబులుగా ఉంది. ఒక్కోసారి ఇంతే. తెల్లారిపోతుంది కూడా. కానీ తెల్లారేదాకా ఇక్కడ ఉండలేం. పొద్దు పొడవక ముందే మనుషుల సంచారం మొదలైపోతుంది.మళ్లీ రోడ్డుమీద వెల్తురు. ఈసారి కాస్త పెద్దది. రోడ్డుమీది కెళ్లి చూసాను. చాలా దూరంలో కనిపిస్తున్నాయి లైట్లు. అనుభవం వల్ల అది బస్సు అని తెలుస్తోంది. ఉపయోగం లేదు. మళ్లీ వెనక్కి - పొదల్లోకి తప్పుకుని రాతిమీద కూర్చున్నాను. చీకటి, భయం... మిగిలాయి. రోడ్డుమీద మళ్లీ వెలుతురు రావాలని ఆశ.ఈసారి పెద్ద వెలుతురే వచ్చింది. రోడ్డుమీదికెళ్లి నిలుచున్నాను. హమ్మయ్య. బస్సు కాదు. నేను నిల్చున్న పోజు కొంచెం మారింది. వంగి చెయ్యెత్తి ఆపమన్నట్టు సైగ చేసాను. నా ఒంటిమీద ఉన్నది పసుపు రంగు చీర. రాత్రిళ్లు ఇలాంటి రంగువే బాగా కనిపిస్తాయి. ఆకుపచ్చ, బ్లూలాంటివైతే చీకట్లో కలిసిపోతాయి. ఎరుపైతే దండగ. వంగడంతో పవిట భుజంమీద నుంచి జారినట్టుంది. నేను పెద్దగా గుర్తించలేదు. కానీ డ్రైవరు గుర్తించినట్టున్నాడు. కీచుమంటూ లారీ ఆగింది.