సూరిబాబు యింట్లో అడుగుపెడుతుంటేనే అతని భార్య కమల ఎదురొచ్చి ‘‘శ్రీలు ఫోను చేసింది.’’ అంది.‘‘అలాగా- అంతా బానే వున్నారా- మధ్యాహ్నం అనుకున్నా చాలా రోజులైంది అది చేసి, నేనే రాత్రి వెళ్ళి ఐ.ఎస్‌.డి. కాల్‌ చేద్దామనుకున్నా.’’ అంటూ బూట్లు విపకోవడం మొదలుపెట్టాడు.‘‘వాళ్ళు వస్తున్నారు.’’ అంది కమల.‘‘వెరీగుడ్‌- ఎపడు?’’‘‘అదంతా తీరిగ్గా చెప్తాను గానీ ముందు మీ అమ్మగార్ని మీ తమ్ముడింటికి పంపే ఏర్పాటు చూడండి.’’ అంది కమల.సూరిబాబులో వుత్సాహం ఒక్కసారి చల్లారినట్లయినా, పైకి కనిపించకుండా ‘‘అది చూద్దాం గానీ, ఎపడొస్తామని చెప్పింది-.’’కమల ముఖం కఠినంగా మారిపోయింది.‘‘నేనోమాట అంటుంటే మీరో మాట అంటారే విఁటి’’ అంది.‘‘నేనడిగిన దానికి సమాధానం చెప్పకుండా- వేరేదో చెప్తావేంటీ.’’అతని ఎదురు ప్రశ్న కమలలో చాలా కోపం తెప్పించింది. అతనికి భార్యని ఎదురు ప్రశ్న వేయడం జీవితంలో అరుదైన విషయం. అందుకే ఆమెకి కోపమొచ్చింది.‘‘ఈవిడగార్ని పంపిస్తేగానీ వాళ్ళెలా వస్తారు?’’ అంది. దురుసుగా చేతులు తిపతూ-‘‘ఏం? ఈవిడ ముఖం చూస్తే పాపమనీ నీగ్గానీ వాళ్ళు చెప్పారా, మామ్మ వుంటే రానని శ్రీలు చెప్పిందా?’’ అన్నాడు విసురుగా.

ఆమెగారిక్కడవుంటే చోటెలా సరిపోతుంది? ఇరవై నాలుగ్గంటలూ ఆమె మంచం వేసుకుని పడుకుంటే నాకు పరమ అసహ్యంగా వుంటుంది. ఛీ. ఛీ. కూతురూ, అల్లుడూ అమెరికా నుంచి వస్తున్నారన్న ఆనందం లేదు. సంతోషం లేదు. ఈ దరిద్రం వదిలే వరకూ నాకింతే.’’ అంది కమల మరింత రవరవలాడిపోతూ-సూరిబాబు నెమ్మదిగా భార్య దగ్గరకొచ్చి ‘‘నీకు బుద్ధుందా? అంత గట్టిగా అరుస్తున్నావ్‌. ఆవిడ వింటే ఏమైనా బాగుంటుందా’’ అన్నాడు.‘‘వింటే విననీయండి నాకేమైనా భయమా? ఇపడు నన్నేం చేస్తుంది? పెట్టినంతకాలం నానా హింసలూ పెట్టింది. ఇపడు నామోచితికింద నీళ్ళు తాగి కుక్కలాపడి వుండాల్సిందే.’’ అంటూ కమల రెచ్చిపోయింది.సూరిబాబు గజగజలాడిపోయాడు తనింకొక్కమాట మాట్లాడినా పెద్ద యుద్ధమే అయిపోతుంది. అతను మాట్లాడకుండా బాత్‌రూంలోకెళ్ళిపోయాడు. ఆమెని ఎదిరించే శక్తి లేకపోవడానికి సవాలక్ష కారణాలున్నాయతనికి-!ముఖం తుడుచుకుంటూ బయటకొస్తుంటే ఎదురుగా తల్లి.‘‘ఏమిట్రా అంటుంది మీ ఆవిడ?’’ అంది ముసలావిడ సూరమ్మ.‘‘ఏదోలే- నీ సంగతి కాదు.’’ అన్నాడు.‘‘ఆ.. ఆ.. అంటూ వినిపించక అవస్థపడి ‘‘సరేలే శ్రీలు వస్తోందా?’’ అంది.సూరిబాబుకేం సమాధానం చెప్పాలో తోచలేదు. ఈ మహాతల్లికి ఏది వినిపిస్తుందో- ఏది వినిపించదో తెలీదు. ఆమెకిష్టమైనవి వినిపిస్తాయి. వద్దనుకున్నవి వినిపించనట్లు నటనా కార్యక్రమంలో నడుస్తాయి. ఏది నిజమో- ఏది అబద్ధమో చెప్పడం ఎవ్వరి తరమూ కాదు.కమలకి కోపంతో ఒళ్ళు ఊగిపోయింది. బి.పి ఒక్కసారిగా తన్నేసినట్లు కళ్ళు తిరిగాయి. ఎవరైనా తన మాటకి ఎదురుచెప్తే సహించలేదు. ముఖ్యంగా మొగుడు. అత్త ముఖం చూస్తేనే అసహ్యం. తన కంఠంలో ప్రాణముండగా ఆమెని గుమ్మం తొక్కనివ్వకూడదనుకుంది. అనుకున్నవి అనుకున్నట్లు చేయలేకపోవడమే జీవితాల్లో అత్యంత సహజమైన విషయం. అది కమలకి కూడా మినహాయింపు లేకుండాపోయింది.