‘‘చిన్నా... నీ పిచ్చక్క చనిపోయిందిరా...’’ అమ్మ చేసిన ఫోన్‌ కాల్‌తో మైండ్‌ బ్లాంకయింది.‘‘అయ్యో... నా బిడ్డ నాకికలేదు...’’ అమ్మ ఏడుపు ఇంకా స్పష్టంగా వినిపిస్తోంది. మాటల్లేవ్‌, మాట్లాడ్డానికి ఏమీ లేదు. అలాగే కూలబడ్డాను. ‘చనిపోయిందా?’ గొణిగాను.కీర్తన దగ్గరకొచ్చింది. ‘ఎవరు పోయారు?’‘మా నిర్మలక్క’.‘పిచ్చక్కా..’ అనబోయి నా ముఖం చూసి ఆగిపోయింది.‘ఏమైంది నాన్నా’’ అడిగింది నా కూతురు అన్వేక్ష.‘‘మీ అత్తయ్య చనిపోయిందమ్మా’’‘‘అయ్యో.. నాన్నా’’ ఆమె స్వరం వణికింది.‘‘ఏడాది నుండి మంచంమీదే. ఆ యాతన కంటే పోవడమే మేలు’’ నా భార్య కీర్తన అంది. అప్పుడే వచ్చిన కిరణ్‌ తల్లిమాటలు విని ‘‘కావాల్సిన వాళ్ళు వీలైనంతకాలం భూమి మీద ఉండాలని కోరుకోవాలి’’ అన్నాడు.‘‘మీ మొద్దుమొఖాలకి నేను చెప్పేది అర్థం కాదు’’ ఆంగ్లంలో కోపంగా అని లోపలికి వెళ్ళింది.‘‘మనం బయలుదేరుదాం నాన్నా..’’ అంది అన్వేక్ష.‘‘టికెట్స్‌ బుక్‌ చేయనా డాడ్‌..’’ అన్నాడు కిరణ్‌. నిర్వికారంగా చూశాను.

ఇంతలో అన్నయ్య రామనాథం ఫోన్‌.‘‘అక్క మనకిక లేదురాచిన్నా..’’ దుఃఖం అన్నయ్య మాటల్ని కప్పేసింది.‘‘అమ్మ ఇప్పుడే చెప్పిందన్నయ్యా..’’‘‘ఆఖరిరోజుల్లో పాపం అక్కయ్యకి అమ్మే దిక్కయ్యిందిరా’’ ఆ మాటకి దుఃఖంతో నా గొంతు పెగల్లేదు.‘‘శరీరం బలహీనంగా ఉంది కదా, ఎక్కువ రోజులు ఉంచలేం, రేపే ఖననం అనుకుంటున్నాం, నువ్వు దశదిన ఖర్మకు వచ్చెయ్‌’’ చెప్పాడు అన్నయ్య.అదే చెప్పాను పిల్లలకి.‘‘వాట్‌డాడ్‌, ఎన్నిరోజులైనా ప్రిజర్వ్‌ చేసే కెమి కల్స్‌ ఉన్నాయిగా. అప్పుడే ఖననం ఏంటి?’’ అన్నాడు కిరణ్‌. వంతపాడింది అన్వేక్ష.

‘‘పెద్దనాన్నతో మాట్లాడు నాన్నా’’ అని చప్పున ‘రింగ్‌’ కలిపి ఇచ్చాడు కిరణ్‌.‘‘అక్కయ్యని ‘కెమికల్స్‌’లో ప్రిజర్వ్‌ చేయించు అన్నయ్యా. రెండు రోజుల్లో వచ్చేస్తాం’’ అన్నాను. రామనాథం కాసేపు ఆలోచించి...‘‘వద్దురా చిన్నా. నెలరోజులుగా ఆహారం లేక అక్కయ్యదేహం బాగా శుష్కించి పోయింది. రూపురేఖలు మారిపోయాయి. నీ ఊహల్లోని అక్కయ్య సజీవ రూపం అలాగే ఉండనీ’’ ఫోన్‌ పెట్టేశాడు.‘‘ఏంటీ, బావగారు ప్రిజర్వ్‌ వద్దన్నారా! అదే మంచిదిలెండి. అనవసర ఖర్చు’’ అంది. కోపంగా చూశాను. కిరణ్‌ కూడా అలాగే చూసేసరికి గొణుక్కుంటూ డ్రాయింగ్‌ రూంలోకి వెళ్ళింది కీర్తన. నిస్సత్తువుగా కూలబడ్డాను.