మిట్టమధ్యాహ్నం కావొస్తున్నా, ఎడతెరిపిలేని వర్షం ఒకవైపు, స్వైరవిహారం చేస్తున్న ఈదురుగాలి మరో వైపు, వాతావరణం బీభత్సంగా వున్నా, అటకమీద వున్న కాస్తంత ఖాళీ స్థలంలో ఓపిక వున్నా లేకున్నా ముక్కుకో గడ్డిపోచో, దారపుముక్కో దానికేది కనపడితే దాన్ని కరుచుకొని పిచ్చుక తన గృహనిర్మాణ కార్యక్రమంలో ఎంతో శ్రద్ధను కనబరుస్తోంది. ఆ పిచ్చుక కట్టుకునే ఆ కట్డడంతో శ్రమతో పాటు నమ్మకం కూడా వుండడం విశేషం. బయట వీధి దీప స్తంభాలు, వృక్షాలు అన్నీ మనిషి ఆశల్లా కుప్పకూలిపోతున్నాయి. వాటన్నిటి మధ్య రాఘవ తనకున్న రెండు గదుల్లో కుర్చీలో కాళ్లు రెండూ పైకిపెట్టుకొని ఒకవైపు కళ్లలో కన్నీళ్లు, మరో వైపుకుర్చీ కిందుగా వరదనీరు, ఒకదానికొకటి పోటీ పడుతుండగా దిగులుగా కూర్చున్నాడు. అల్లకల్లోమవుతున్న వాతావరణం రాఘవ మనసుకు తోబుట్టువులా గోచరిస్తోంది.

ఎందరు ఎలా వున్నా, ప్రపంచం ప్రశ్నలా కనపడుతున్నా, ఆకలి మాత్రం తనపని తాను చేసుకుంటూ, పలకరించుకుంటూ పోతుంది. ఆకలి అల్లరిది. ఎందరున్నా, ఎంతగా పనివత్తిడి వున్నా, ఒక్కమారు తలెత్తి తనవైపు చూసేలా చేసుకోవడం దాని ప్రత్యేకత. ప్రస్తుతం రాఘవ పరిస్థితి అలానే వుంది. నీళ్లు ప్రవాహంలా కళ్లెదుట కనపడుతున్నా, తాగడానికి గుక్కెడునీళ్లు లేని దుస్థితి. రాత్రి తెల్లవార్లూ ఏంచెయ్యలో తెలియని మనస్థితి. అంతకంటే నీళ్లలో కొట్టుకుపోతే బావుండేదేమో...నిన్న చనిపోదామని ప్రయత్నిస్తే దారే దొరకని నిరాశ. నేడు చనిపోవడానికి ఎదురుగా ఎన్నో అవకాశాలున్నా బతకాలనే ఆశ, ఒక్కరోజులో ఎంత మార్పు? లేదు ఎలాగైనా నిజాయితీగా బతకాలనే అభిప్రాయం...చేసిన తపలన్నీ గుర్తుకు వస్తుంటే క్షమించమని దేవుని ప్రార్థన అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. చిమ్మచీకటి. నీటి హోరు, కొట్టుకుపోతున్న మనుషుల హాహాకారాలు, నేలకూలుతున్న వింత చపళ్లు.

ఒక్కొక్కటి రాఘవను వాస్తవంలోకి తీసుకొస్తున్నాయి.రాఘవ సీతారామయ్య, జానకమ్మలకు ఒక్కగానొక్క కొడుకు కావడంతో అందరికీ ఎంతో ముద్దు. అడిగిందల్లా ఇవ్వడం తల్లిదండ్రులు చేస్తే....అనుకున్నదంతా సాధించడం రాఘవ తన గొప్పదనంగా భావించాడు. తానుచేస్తుంది తప్పో, ఒప్పో తెలుసుకోలేనంతగా పెరిగిపోయాడు. చదువు కొద్దో గొప్పో అబ్బినా, వారికున్న ఆస్తి, అంతస్థులు చదువు విలువను తెలుసుకోలేనంతగా చేశాయి. కాలక్రమంలో రాఘవకు పెళ్లి అవ్వడం, తల్లిదండ్రులు రాఘవకు కష్టసుఖాల్ని గూర్చి ఏమాత్రం తెలపకుండానే చనిపోవడంతో జీవితం పట్ల ఏమాత్రం అవగాహన లేని రాఘవ వున్నదంతా వ్యసనాలకు ఖర్చుపెట్టడం ద్వారా తనకు నిలువ నీడకూడా లేకుండా చేసుకున్నాడు. ఇపడు జీవితం విలువ తెలుసుకున్నా, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లు కళ్ల ముందు వర్తమానం అగమ్యంగా వుంది. పలకరించే దిక్కులేదు. ఆడంబరాలకు ఖర్చుపెట్టినపడు తనతో వుండి ఆనందాన్ని పంచుకున్న వారందరూ మామూలుగా సహజంగానే తపకుంటున్నారు.

వారం రోజుల నుండి ఉద్యోగం అంటూ తనకున్న సర్టిఫికెట్లు తీసుకొని ప్రయత్నిస్తుంటే తనకు ముందే వున్న పేరు తెలుసుకున్న వారే అక్కడా వుండడంతో నిరాశే మిగులుతోంది. దాంతో ఇక బతకడం వృధా అనుకున్న రాఘవ చనిపోదామని ప్రయత్నించి సులువుగా చనిపోయే మార్గం తెలియక ఆ చావులో కూడా ఆనందాన్ని వెతుక్కున్న రాఘవ అంత సాహసించలేకపోయాడు. ఇపడు ప్రకృతి సృష్టిస్తున్న బీభత్సంలో ఎలాగైనా బతకాలనే ఆశతో పోరాడుతున్నాడు. మెల్లగా నీరంతా మోకాలు లోతుకుచేరుకుంటున్నాయి. అయినా ఏదో ఆశ, మెల్లగా కుర్చీ మీద లేచి నిలబడ్డాడు. ఇన్నాళ్లు దేవుడు అనేవాడు ఒకడు వున్నాడని తెలుసుకునే అవసరం రాకున్నా చేతులెత్తి మొక్కుకున్నాడు. ఎలాగైనా ఈ గండం నుండి బయటపడాలని, చావో బతుకో తేల్చుకునే ప్రయత్నం మొండిగా చేస్తున్నాడు.

ఒక్కసారి ఇంటి బయట చూసాడు. ఆ చూడడంలో కుర్చీ పక్కకు ఒరగడం, నీళ్లలో రాఘవ పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. బలవంతంగా ఈదుకుంటూ బయటపడ్డా. ఆ పోరాటంలో ఏదో ఆధారం దొరికింది. అదేదో తెలియదు. దాన్ని పట్టుకునే వదలకుండా ఇంటి కప పైకి ఎక్కాడు. బతుకుతానని హామీ లేకున్నా బతికే అవకాశం దొరికిందని మాత్రం తెలుస్తోంది. అలా ఎంతసేపు వుండిపోయాడో తెలియదు. తెల్లవారింది. నీటి ప్రవాహం ఆగలేదు. కళ్ల ముందు కొట్టుకు వస్తున్న శరీరాల్ని చూస్తూ భరించలేకపోతున్నాడు.