‘రాజావారి కుటుంబం’ దైనిక ధారావాహిక తాలూకు తొమ్మిదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదో ఉదంతం ప్రసారం కాబోతోంది ఈ రోజు.....అందులో నటించిన తారలంతా ఆ ఫలానా ధారావాహికలో తాము పాల్గొన్న అపురూప ఘట్టాలనూ, జన్మసార్థక సన్నివేశాలనూ జుట్టు పైకెగదోసుకుంటూ ముద్దు ముద్దుగా మణిప్రవాళంలో ముచ్చటిస్తారు. ఈ ఉదంతం తప్పక చూడమని గత పదిరోజులుగా నిర్మాతలు చెవిలో ఇల్లు కడుతున్నారు. అందుచేత కాలేజీనుంచి రాగానే అబ్బాయి తినడానికి స్వయంగా పిజ్జా తయారుచేసి పెట్టి, రాత్రి భోజనంలోకి వాడికిష్టమైనవి వండి, అమ్మమ్మ కోసం రాగిజావ కాచి, తన కోసం పుల్కాలు చేసుకుని ఇటీవలే కొని గోడకి అమర్చిన పెద్ద ‘బుల్లితెర’ ముందు కుదురుకున్నది విజయ.అమ్మమ్మ సావిత్రమ్మకు ఎనభై ఏడేళ్లు.. ఆమెను తన దగ్గర పదిరోజులుంచుకుని పంపిద్దామని మొన్న తీసుకొచ్చుకుంది విజయ. విజయ వాళ్లాయన ఏదో సమావేశం కోసం సింగపూర్‌ వెళ్లాడు. కూతురికి వివాహమై అమెరికా వెళ్లింది. కొడుకు ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. నమూనా కుటుంబం.అమ్మమ్మకి బుల్లితెర కార్యక్రమాలు నచ్చవు. గదిలో కూచోడమూ గిట్టదు. ఆకాశంలో ఒక చిన్న ముక్కా, నాలుగు చుక్కలూ, రెండు మొక్కలూ కనపడతాయని సాయంత్రం కాగానే బాల్కనీలోకి చేరుతుంది.

 అలా బాల్కనీలో కూచున్న అమ్మమ్మ హడావుడిగా లోపలికొచ్చి ‘‘బాగా మబ్బేసింది. చినుకులు కూడా మొదలయినై. ఇంకా పిల్లాడు రాలేదే!’’ అంది.రాజాగారి కోడలు కోడలికి కోడలు పాత్రధారిణి సకలాలంకార భూషితంగా అప్పుడే తెరమీదకొచ్చి వీక్షకులకు వినమ్రంగా నమస్కారం చేసింది. ‘ఆ పిల్ల పెట్టుకున్న నెక్లెసు చాలా బాగుంది’ అనుకుంటూన్న విజయ, అమ్మమ్మ మాటలకి ఉలిక్కిపడింది. అవునూ రాత్రి ఎనిమిదవుతున్నా పిల్లాడింకా ఇంటికి రాలేదేంటి? అయ్యో ఇదేంటి ఒక అరగంట ఆలస్యమైనా అమ్మ కంగారుపడుతుందని ఫోన్‌ చేసి చెబుతాడు కదా! ఇదేంటిఫోన్‌ కూడా ఎత్తడం లేదే! ఏమైంది వీడికి?దబ దబ చినుకులు.ఒరేయ్‌ మోటూ, చింటూ, బబ్లూ, బంటీ, మున్నా, రహీం రాజా మా వాడేడిరా? ఫోన్‌ మీద ఫోన్‌.‘‘ఏమో ఆంటీ’’ వాళ్లంతా.‘‘మీరంతా ఇంటికొస్తే వాడెందుకు రాలేదు? కాస్త ఫోన్‌ చేసి కనుక్కోండి. మా బాబులు కదూ?’’‘‘మాకూ పలకడం లేదు ఆంటీ’’వందోసారి కూడా వాడి ఫోన్‌ స్విచ్‌డ్‌ ఆఫ్‌.రోజూ ఏడుగంటలలోపు వచ్చేవాడు పదైనా రాలేదు. ఏం చేయాలిప్పుడు?వాళ్ల నాన్న కూడా దేశంలో లేడే!! ఇప్పుడు ఫోన్‌ చేసి చెబితే కంగారుపడిపోడా?‘‘వస్తాడులే అమ్మా! ఎక్కడో చిక్కడిపోయి ఉంటాడు వాన తగ్గగానే వాడే వస్తాడు’’ అని తన కోసం పెట్టిన జావ తాగేసి సోఫామీద ముడుచుకుని పడుకుంది అమ్మమ్మ.వాడు వెళ్లే చోట్లు, వాడికున్న స్నేహితులు పరిచయస్తులు అన్ని నెంబర్లూ అయిపోయాయి.