‘సౌజన్య వెడ్స్‌ రామకృష్ణ’’ అన్న బోర్డు రంగురంగుల బల్బులతో మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించింది.‘ఆ... ఇదే పెళ్లి మండపం. బస్సులోంచి అందరూ ఎవరి సామాన్లతో వాళ్లు జాగ్రత్తగా దిగండి.’అంటూ పెళ్లికొడుకు తండ్రి చెప్పగానే, తెల్లవారుఝామున నాలుగున్నరకి అందరూ నిద్దర మొహాలతో దిగుతున్నారు.అందరూ దిగగానే మంగళ వాయిద్యాలతో వియ్యంకుడు, వియ్యపు రాలు మగ పెళ్లి వారికి స్వాగతం పలికారు.గుమ్మం దగ్గర పెళ్లికొడుక్కి దిష్టి తీసి హారతిచ్చింది వియ్యపురాలు. అందరినీ సాదరంగా ఆహ్వానించి విడిదిలోకి తీసికెళ్లారు. పెళ్లికొడుక్కి ప్రత్యేకంగా రూము ఏర్పాటు చేశారు. మగ పెళ్లి వారికి విడిదిలో పౌడరు దగ్గర నుంచి బొట్టు, కాటుక, సబ్బులు, కొబ్బరి నూనె, షాంపూ పేకెట్లు, టవల్సు, టూత్‌ పేస్టు, ఆఖరికి బట్టల సబ్బుల దగ్గర నుంచి ఒక పెద్ద స్టీలు పళ్లెం నిండా లెక్కలేనన్ని పిన్నీసులు కూడా పోసి పెట్టారు.‘వదిన గారూ!పిన్నీసులు కూడా చాలా పెట్టారే!’అంటూ వియ్యపురాలు పార్వతమ్మ అన్న మాటలకి, భర్త రఘురామయ్య, ‘మగ పెళ్లి వారికి పిన్నీసులతో సహా మర్యాదలకి ఏ లోటూ రాకుండా ఘనంగా పెళ్లి చేసామని చెప్పుకోడానికేమో!’అంటూ చమత్కార బాణం వేసి, మళ్లీ, ‘అయినా ఎందుకు బావగారూ, ఛాదస్తంగా ఇన్ని పిన్నీసులు పెట్టారు?’అన్నాడు.

ఆయన మాటలకి పెళ్లికూతురు తండ్రి పరంధామయ్య, ‘ఛాదస్తం కాదు బావగారూ. అవసరం! అనుభవంతోనే పెట్టాం. చూస్తూండండి, పెళ్లి టైముకి పిన్నీసులన్నీ ఒక్కటి కూడా మిగలకుండా హాట్‌ కేకుల్లా అయిపోతాయి!’అన్నాడు.‘ఆ... ముందర కాఫీలు, పిల్లలకి పాలు పంపిస్తాం. మీరు స్నానాలూ అవీ కానిచ్చేస్తే టిఫిన్లు రెడీగానే వున్నాయి. టేబుల్సు మీద అన్నీ సిద్ధం చేస్తాం. ఎనిమిది గంటలకి స్నాతకం.’‘అలాగే బావగారూ. మీరుండండి. ఈ లోగా మేము రెడీ అవుతాము.’టిఫిన్లు, కాఫీలు అవగానే స్నాతకం పూర్తయింది.ప్రయాణంలో నిద్రలు లేక మగ పెళ్లి వారిలో చాలామంది నిద్రలోకి జారుకున్నారు. కొంత మంది అంత్యాక్షరి, ఆటల పోటీలు పెట్టుకున్నారు. పెళ్లికొడుకు, అతడి స్నేహితులు పేకాడుకుంటున్నారు.ఈ లోగా భోజనాలకి పిలుపు వచ్చింది. మామూలుగానే మాటి మాటికీ చీరలు మార్చేస్తారు ఆడవాళ్లు. వాళ్ల చీరలన్నీ చూపించుకోడానికా అన్నట్లు, పెళ్లి సమయంలో ఇదే తరుణమని తరుణిలందరూ ఒక్కో సందర్భానికి ఒక్కో చీర మార్చేస్తూ భోజనాల సమయం కదా అని స్నాతకం చీర, తర్వాత మామూలు చీర తీసేసి ఇప్పుడు భోజనాలకి తగినట్టు లైట్‌ శారీస్‌ ధరించి, లైట్‌గానే నగలు కూడా ధరించి, సింపులందంగా తయారయి, భోజనాలకి బయలుదేరారు.తర్వాత సాయంత్రం స్నాక్సు, టీ, కాఫీలు, ఎదురు సన్నాహం, పానకం బిందెలు, శుభలేఖలు చదవడం లాంటి అన్ని తతంగాలూ పూర్తయ్యాక వియ్యంకుళ్లిద్దరూ కబుర్లలో పడ్డారు.