‘‘అమ్మమ్మా... నేను మా ఊరెళ్ళిపోతాను’’‘‘చూసారా చూసారా... పదిహేనేళ్ళు నా దగ్గర పెరిగి... ఇది దాని ఊరుకాదట, ‘మా ఊరెళ్ళిపోతాను అంటుంది’ మనం ఎంత చేసినా అమ్మనాన్న సాటిరాము కదా?’’‘‘అమ్మమ్మ ఎందుకలా అంటావు... మీరు నన్ను ఎంత ప్రేమగా పెంచారో నాకు తెలుసు ఇక అమ్మనాన్నల ప్రేమ ఏ పాటిదో కూడా నీకు తెలుసు’’.‘‘తెలిసీ ఎందుకమ్మ మమ్మల్ని వదిలి వెళ్లాలనుకుంటున్నావు’’ హృద్య ఆ క్షణమే తమని వదిలి వెళ్ళిపోతున్నదన్నంతగా తల్లడిల్లిందామే.‘‘మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు... కాని నేనుండవలసిన స్థానం ఇది కాదుగా అమ్మమ్మ. నా గమ్యం నేను చేరుకోవాలిగా’’ ఎన్ని రాత్రుల ఆలోచనాసారమో హృద్య గొంతులో పలికింది.‘‘పిచ్చిపిల్లా మీ అమ్మ నీకోసం వెంపర్లాడుతుంటుంది గాని, మీ నాన్న చిరాకు కోపం నీకు తెలియంది కాదుగా... మరింక ఎందుకమ్మ అక్కడికి వెళ్ళడం... ఓ రెండేళ్ళయితే మేమే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేస్తాం.’’‘‘అవునమ్మ... రెండేళ్ళు కాకుండా నాలుగేళ్ళలో ఎలాగూ నా పెళ్ళిచేసి పంపుతారు. కనీసం ఈ కొద్దికాలం ప్రేమ పొందకపోతే పోనీ కనీసం మా నాన్న ద్వేషం పొందైనా అక్కడ కొంతకాలం ఉండాలని ఉంది. పైగా నాన్నకి ఆరోగ్యం బాగుండక అమ్మ ఒక్కతే చేసుకోలేక అవస్థ పడుతున్నది. అమ్మకోసమైన నన్ను ఆపకండి. తాతయ్య మీరైనా చెప్పండి’’.

‘‘హృద్య చెప్పింది నిజమే దానికిమాత్రం అందరి పిల్లల్లా అమ్మ, నాన్నల దగ్గర ఉండాలని ఉండదా! ఆ త్రాష్టుడి మూర్ఖత్వం మూలానా దానికి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పోయింది. అది వెల్లాలనుకుంటుంది వెళ్ళనీ భారతి దాన్ని బాధ పెట్టకు.’’తనని వదిలి ఉండలేక తల్లిదండ్రుల దగ్గరకు పంపకుండా ఉండలేక వాదన పెట్టుకుంటున్న వారి ప్రేమకు కదిలిపోయింది హృద్య.‘‘మీరు బాధపడకండి అమ్మమ్మ. అక్కడ నా అవసరం ఉన్నది నాన్నగారికొక్కరికే కాదు, అమ్మ గురించి కూడా ఆలోచించు’’. భారతి బదులు పలకలేకుండా పోయింది. హృద్య మాటల్లో విజ్ఞత ఆమెను కట్టిపడేసింది. మౌనంగా వీడ్కోలు పలికింది.్‌్‌్‌తల్లిదండ్రుల ముద్దుమురిపాల నడుమ, ఎదుగుతున్న క్రమంలో బాల్యం అందరికీ మధురానుభూతి. జీవితంలో ఎప్పుడు బాల్యం గురించి తలుచుకున్న మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కాని హృద్య పరిస్థితి ఇందుకు విరుద్ధం, బాల్యమంతా సంఘర్షణలతోనే గడిపింది. రైలు వేగంగా సాగిపోతుంటే ఆమె మనస్సులో పరిపరి విధాల ఆలోచనలు కలతపెడ్తున్నాయి.అమ్మలాలనతో తండ్రి గారాలతో సంతోషంగా తన వారి మధ్య గడపలేకపోయిన తొలి రోజుల్లో హృద్యకి అమ్మ మీద చెప్పలేనంత బెంగగా ఉండేది. అమ్మ కావాలని పదే పదే ఏడ్చేది... అలిగేది యాగి చేసేది.‘‘ఉర్కోమ్మా... ఏడవకు అక్కడికివెళ్తే బ్రతకలేవు. అమ్మను నేను అప్పుడప్పుడు పిలిపిస్తాలే... అమ్మ వస్తుంది లేమ్మా ఏడవకు...’’ అంటూ ఓదారుస్తూ... కధలు చెప్పి కబుర్లుచెప్పి ఎంతజాగ్రత్తగా ఎంత గారాబంగా పెంచింది అమ్మమ్మ, రోజులు గడుస్తున్నాయి కాని అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండడం, అమ్మ చుట్టపు చూపులా వచ్చి వెళ్ళడం అలవాటైనా... గుండెలో ఏదో అసంతృప్తి... ఏ మాత్రం అదనుదొరికినా... అమ్మకొంగు పట్టుకు వెళ్ళిపోవాలని ఆశ. అమ్మవడిలో ఆడుకోవాలని, ఆమెతో మురిపాలు పంచుకోవాలని, నాన్నతో కబుర్లు చెప్పాలని ఆయన చేయి పట్టుకు నడవాలని చెల్లితో తమ్ముళ్ళతో సంతోషంగా గడపాలన్న కోరిక కోరికలాగా మిగిలిపోయింది.