ఉదయం తొమ్మిదయింది.సత్యమూర్తి తనగదిలోంచి వరండాలోకొచ్చి సోఫాలో కూర్చొని పేపరు చూస్తున్నాడు.ఆ ప్రక్క రూమ్‌లో కొడుకు రఘు టిఫిన్‌ చేస్తున్నాడు. కోడలు ప్రసన్న వత్తిడి చేస్తూ తినిపిస్తూ వుంది. మాటలు వినిపిస్తున్నాయి.‘‘మా నాన్న తిన్నారా?’’ అని అడుగుతాడని సత్యమూర్తి ఆశపడ్డాడు. కాని అడగలేదు.రఘు బైటకు వచ్చాడు. అతడి వెనుకే కోడలు వచ్చింది లంచ్‌బాక్సుతో.‘‘బాబూ రఘా!’’ పిలిచాడు సత్యమూర్తి.సమాధానంగా ఆగి వెనక్కి చూశాడు రఘు.‘‘నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా.. తూలిపోతు న్నాను. ఓసారి బి.పి. చెక్‌ చేయించాలి. మందులు మార్చుతాడేమో.. నీవు సాయంత్రం కాస్త త్వరగా వస్తావా?’’‘‘యీ రోజు కుదరదు. ఆఫీసులో ఆడిట్‌ జరుగుతోంది. ఆదివారం వెళ్దాంలే’’. అంటూ స్కూటరు దగ్గరకు నడిచాడు రఘు.కొడుకు మాటల్లో ఎక్కడా ‘‘నాన్నా’’ అనే మాట వాడకపోవటంతో సత్యమూర్తి మనసు చివుక్కు మంది.భర్తను ఆఫీసుకు సాగనంపి లోనికి వచ్చిన ప్రసన్న కోపంగా, ‘‘మామయ్యగారూ! వెళ్తున్న వారిని వెనక్కి పిలిచి మరీ మాట్లాడాలా’’ అది అపశకునం కాదా.. పెద్దవారు, మీకు తెలియదా? అసలే ఆడిట్‌ వుందని ఎంతో టెన్షన్‌గా వెళ్తున్నారు.

 అయినా చోద్యం గాకపోతే డెబ్బై ఏళ్ళు వచ్చాక కళ్లు తిరగవా?.. తూలరా? దానికే డాక్టరా..’’ అంటూ అక్కసంతా కక్కేసి వెళ్ళిపోయింది.సత్యమూర్తి అవాక్కయ్యాడు. జీవితంలో మాట పడి ఎరుగడు. ఈటెల్లాంటి ఆమె మాటలు గుండెను తాకాయి. సన్నగా పోటు ప్రారంభమయింది. నెమ్మదిగా లేచి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఎందరికో పాఠాలు చెప్పిన తనకి పాఠం చెప్పింది. తల తీసినట్టయింది.ప్రసన్న ఓ ప్లేటులో రెండు ఇడ్లీలు.. మంచినీళ్లు తెచ్చి టీపాయిపై పెట్టి ‘‘తీసుకోండి. మందు బిళ్లలు వేసుకోవాలి కదా’’ అని వెళ్లిపోయింది.చాలా ఆకలిగా వున్నా తినబుద్ధి కావటంలేదు. కారణం, కోడలు అవి పెట్టిన తీరు. కటకటాల్లో వున్న ఖైదీ ముందుకి అన్నం చిప్పను నెట్టినట్టు అనిపించింది సత్యమూర్తికి. ఈ పరిస్థితిలోనూ ఇంకా బ్రతకాలా? బాధ గుండెను మెలిపెట్టింది. భార్య గుర్తుకు వచ్చింది. అయిదేళ్లుగా ఆమె లేని లోటుని అనుభవిస్తున్నాడు. ఆమె రూపం కళ్ల ముందు నిలిచి.. కళ్లు చెమ్మగిల్లాయి. వృద్ధాప్యంలో దంపతుల్లో ఎవరు ముందు పోయినా, ఆ ఇద్దరిలో మిగిలి వున్న వారి జీవితం దుర్భరం. ప్రాణం వున్నా... కట్టెలా బ్రతకాలి. ఎంతమంది బంధువు లున్నా ఒంటరితనం వేధిస్తుంది. విడిచి బ్రతకలేరు. వృద్ధ దంపతుల్లోని అనుబంధం అనిర్వచనీయం. నిజమైన ప్రేమికులు వాళ్లే.