రాత్రి పదిన్నరకు కుమార్‌ నుంచి ఫోనొచ్చింది. ‘‘నువ్వు వెంటనే బయల్దేరి విశాఖ వచ్చేయి’’ అన్నాడు. గొంతులో ఉద్విగ్నత వల్లనుకుంటాను మాట స్పష్టంగా విన్పించలేదు. ఎప్పుడూ ప్రశాంతంగా, నింపాదిగా మాట్లాడే కుమార్‌....అంత ఎక్జయిట్‌ కావడం నేనెప్పుడూ ఎరుగను. నాతో పాటు ఆంధ్రా యూనివర్శిటీలో పర్యావరణ శాస్త్రాన్ని చదివి, రీసెర్చి పూర్తయ్యాక అక్కడే లెక్చరర్‌గా స్థిరపడ్డాడు. నేను సైంటిస్ట్‌గా పర్యావరణ పరిరక్షణ కోసం నా వంతు కృషి చేస్తున్నాను.‘‘ఏమిటీ విషయం?’’ అన్నాను.‘‘మెల్లగా అంటావేమిటి....పెద్ద విశేషం.... నా స్టూడెంట్స్‌కి అరకులోయలో బట్టమేక పక్షి కన్పించిందట. వెంటనే బయల్దేరు. నేనీ రోజే బయల్దేరి అరకు వెళ్తున్నా. గెస్ట్‌ హౌస్‌ బుక్‌ చేశాను. దాన్ని మళ్ళా నా కళ్ళతో చూసే వరకు మనశ్శాంతి ఉండదు’’ అన్నాడు.అతని మాటలు విన్నాక నేనూ విపరీతమైన ఉద్విగ్నానికి లోనైనాను.‘‘నిజంగానా...వాళ్ళేమీ పొరపాటు పళ్ళేదు కదా’’‘‘నో ఛాన్స్‌...వాళ్ళు నా విద్యార్థులు’’ అన్నాడు. అతని గొంతులో ధ్వనించిన అచంచలమైన ఆత్మవిశ్వాసం...ఎంఎస్సీ పర్యావరణ శాస్త్రంలో గోల్డ్‌మెడలిస్ట్‌ అతనే మరి.బట్టమేక పక్షి...గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌...పిహెచ్‌డిలో నా రీసెర్చి టాపిక్‌ అదే...ప్రస్తుతం అంతరించిపోతున్న జీవజాతుల్లో బట్టమేక పక్షి కూడా ఒకటి. 

పులికాట్‌, కొల్లేరు, నీలపట్టు సరస్సుల వద్దకు ప్రతియేటా అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో వందల సంఖ్యలో వలస వచ్చే ఈ పక్షి రానురాను కనుమరుగైంది. మనుషులు తమ ఆహారం కోసం వీటిని వేటాడడం, పర్యావరణ కాలుష్యం, కర్బన ఉద్గారాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు...కర్ణుడి చావుకు కారణాల్లా...ఈ పక్షి అదృశ్యం కావడం వెనక ఎన్ని కారణాలో....యాభయ్యవ దశకంలో పర్యావరణ వేత్తలకు కర్నూల్లో కనిపించిన ఈ పక్షి మరలా ముప్పయ్యేళ్ళ విరామం తర్వాత రొల్లపాడు అనే గ్రామంలో మనుషుల కంట పడింది. అంటే కుమార్‌ చెప్పింది నిజమే అయితే రొల్లపాడులో కన్పించాక మరో ముప్పయ్యేళ్ళకు బట్టమేక పక్షిని చూసిన వాళ్ళం మేమే అవుతాం.ప్రయాణానికి సన్నద్ధమవుతున్నప్పుడు ‘‘రిజర్వేషన్‌ లేకుండా ఉన్నపళంగా బయల్దేరితే ఇబ్బంది పడ్తారండి’’ అంది రాణి. మా పెళ్ళయి పన్నెండేళ్ళు. పెళ్ళయిన కొత్తలో ఓ తల్లి పసిపిల్లాడి గురించి ఆరాటపడ్డట్టు నా గురించి ఆరాటపడితే నవ్వొచ్చేది. ఇప్పటికీ అంతే. మారలేదు.‘‘పర్లేదులే. ఉదయం విజయవాడ వెళ్ళే ఇంటర్‌ సిటీ ఉందిగా. ఎక్కేస్తాను. పన్నెండుకల్లా విజయవాడ చేరుకుంటాను. మరో రెండు గంటల్లో వైజాగ్‌ వెళ్ళే ఇంటర్‌ సిటీ ఉంది. నో ప్రాబ్లెం’’‘‘మధ్యాహ్నం భోజనం సంగతేం చేస్తారు? స్టేషన్లో పెట్టే తిండి బావుండదండి. మీకు సరిపడదు. ఆరోగ్యం పాడవుతుంది. క్యారియర్‌ కట్టిస్తాను’’ అంది రాణి.‘‘ఎందుకురా అబ్బాయ్‌...మా తులసి పిన్ని ఉండేది విజయవాడేగా. ఫోన్‌ చేసి చెప్తే చాలు రెక్కలు కట్టుకుని స్టేషన్లో వాలిపోతుంది. కమ్మటి భోజనం తయారు చేసుకుని తెస్తుందిలే. తులసి పిన్ని చేతి వంట మహా రుచిగా ఉంటుందని మన బంధువులందరూ చెప్పుకుంటారు.’’