పలపలా చినుకులు రాలినాయి.మెట్లమింద కుర్చోనుండే దీపాలు వుడ్డగా పైకిలేచి మూలస్తానమ్మ గుళ్ళోకి పొయినాయి.కొన్ని దీపాలు అరుగులమింద కుర్చున్నాయి. కొన్ని నేలమింద కుర్చున్నాయి. కొన్ని గడపలమింద, పడిపోయిన రాతికూసాల మింద కుర్చున్నాయి. వాన ఊపందుకునింది. చిటపటమని చినుకులు చిందులేస్తా వుండాయి. దీపాలు గాలికి తలలూపతా వుంటే వాటి నీడలు గుడి గోడల మింద కదలాడతా వుండాయి.ఆ నీడల్ని చూస్తా,‘‘అక్కా... దేవుడు మనిషిని పుట్టించి, మనిషితోపాటు నీడనెందుకు పుట్టించినట్టో?’’ అని అడిగింది దిగవింటి దీపం.‘‘నీడంటే కర్మసాక్షి గదా! మనిషి పాపం చేసినా, పుణ్యం చేసినా, వొళ్ళొంచి కష్టం చేసినా, సోమరిపోతుగా జీవించినా మనిషి వెనకాలే తిరగతా కాపెట్టుకోనే వుంటుంది. రేపు మనిషి సచ్చిపొయ్యి దేవుని దెగ్గిరికి పోతే, పాపపుణ్యాలని విచారించేటపడు మనిషి అపద్దం చెప్పినా నీడ అపద్దం చెప్పదు. నీడ చెప్పిన సాక్ష్యాల ఆధారంగా వాడుచేసిన కర్మను బట్టి స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు దేవుడు’’ అని చెప్పింది బృందావన దీపం.ఈ బృందావన దీపాన్ని ఇంట్లో తులసికోట వద్ద పెడతారు.‘‘కర్మసాక్షి గురించి ఎంత బాగా చెప్పావే బృందావన! ఆ నోటితోనే ఓ మంచి కత చెప?’’ అని అడిగింది పెద్దింటి దీపం.కత చెప్పమన్నట్టు మిగతా దీపాలు బృందావన దీపం వైపు చూసినాయి.‘‘పొద్దు చాలని మనిషి కత చెప్తాను మీకు’’ అని రెపరెపమని తలాడిస్తా కతనెత్తుకునింది బృందావన దీపం.

చిన్నవ్వ పొద్దు మొలవకముందే లేసి మొగిలిగోడ మింద మొద్దునిద్దర పోతా వుండే కోడిపుంజును లేపింది.అది ఉలిక్కిపడి లేచి రెక్కల్ని రెపరెపలాడించి ‘‘కొక్కరకోకో కొక్కరకోకో’’ అని గొంతు చించుకుంటా పల్లెని లేపింది.చిన్నవ్వ లేస్తానే సుబ్రమన్నెస్వామికి, మూలస్తానమ్మకి దండం పెట్టుకునింది. అరిచేతుల్ని రుద్ది వెచ్చచేసుకోని పైకి లేచింది.కిరసనాయిలు బుడ్డీ వెలిగించింది.ఆపాట్నే ఇంటెనక్కుపొయ్యి మొగం కడుక్కోని, నోట్లో నీళ్ళు పోసుకోని పుక్కిలించింది. బుడ్డీ ఎలతర్లో తీరిగ్గా, ఎంతో ఇష్టంగా వక్కాకు వేసుకునింది.ఆపాట్నే చేటడు సద్దలు రోట్లో పోసి, పిండి ఎగిరిపోకుండా కుదురుపెట్టి రోకలి తీసుకోని, ‘‘దభీ గుభీమని’’ పోటేస్తా దంచతా వుండాది.