ఇరుగింటి దీపం ఒగ కత చెప్తే, వెంటనే పొరుగింటి దీపం ఇంగొక కతని ఎత్తుకుంటా వుండాది. ఎగవింటి దీపం ఒగ కత చెప్తే, ‘నేనేమన్నా తక్కువ తిన్నానా’ అని దిగవింటి దీపం ఇంగొక కతని ఎత్తుకుంటా వుండాది.ఇట్లాపోటీలు పడి కతలు చెపకుంటా గోపినింటి దీపం మాట మరిసిపొయినాయి.‘నువ్వు’ పూలరతంలో వచ్చిన పార్వతీ పరమేశ్వరులు కత చెప్పినావు గదా! ఇపడు నేను ‘పొద్దున్నే వచ్చిన వాన’ కత చెప్తాను’’ అనింది పొరుగింటి దీపం.‘‘వాన రాకడా, పాణం పోకడా ఎవురు చెప్పగలరు? ఏ పుట్టలో ఏ పాము వుందో? ఏ మోడంలో ఏ చినుకు దాగుందో? ఎవరికి తెలుసు?’’ అనింది ఎగవింటి దీపం.‘‘అంతేగాదు తల్లే! ఏ చినుకుయాడ రాలుతుందో? ఏమౌతుందో గూడా ఎవురూ చెప్పలేరు. సముద్రం మింద రాలిన చినుకు ఉపకణికవుతుంది. ముత్తెపు చిప్పలో రాలిన చినుకు ముత్తెమవుతుంది. సవుడు నేలమింద రాలిన చినుకు ఇంకిపొయ్యి పుడతానే పాణమిడిస్తింది. సత్తవ కలిగిన నేలమింద రాలిన చినుకు పాణం పోసుకుని పచ్చని మోసులేస్తుంది. పచ్చగడ్డిమింద రాలిన చినుకు నీటిముత్తెమై మెరిసి రెప్పపాటులో ఆవిరైపోతుంది. ఏరుమింద రాలిన చినుకు యవ్వనంతో ఉరకలు, పరుగులు పెడుతుంది. బురదగుంతలో రాలిన చినుకు పుడతానే ఊబిలో కూరకపోతుంది’’ అని చెప్పింది దిగవింటి దీపం. పొరుగింటి దీపం కతనెత్తుకునింది..

పొద్దున్నే తలకోన మూలన వాన దిగింది.పలపలా చినుకులు రాలినాయి.నేల తడిసి పువ్వు తోడిగి పలవరించింది.వాన పెదబ్బకండ్లల్లో గూడా కురస్తా వుండాది.వాన ఉయ్యాల్లో ఊగే పసిబిడ్డ కంట్లో గూడా కురస్తా వుండాది.వాన గడ్డిపువ్వు కంట్లో గూడా కురస్తా వుండాది.వాన గడ్డిపువ్వుమింద వాలిన సీతాకోక చిలుక కంట్లో గూడా కురస్తా వుండాది.వాన చింతకొమ్మల మింద గూట్లో వొదిగిన కాకి కండ్లల్లో కూడా కురస్తా వుండాది.వాన రెక్కలకింద వొదిగిన కాకిపిల్లల కండ్లల్లో గూడా కురస్తా వుండాది.వాన చెరువు కంట్లో గూడా కురస్తా వుండాది.వాన వరికంకి కంట్లో గూడా కురస్తా వుండాది.వాన వరికంకిమింద వాలిన గువ్వ కంట్లో గూడ కురస్తా వుండాది.