‘‘సంధ్యా! కాస్త అలసటగా ఉంది. విల్‌ యూ ప్లీజ్‌ గెట్‌ మి ఎ కప్‌ ఆఫ్‌ కాఫీ’’ లాలనగా అడిగాడు భార్యని రవీంద్రనాథ్‌.ఏప్రిల్‌ ఎండలు, అందునా బందోబస్తు డ్యూటీ. వళ్ళంతా చిటపటగా ఉంటే త్వరగా ఇంటికి చేరుకుని తడిసి ముద్దయిన యూనిఫాం తీసి హేంగర్‌కు తగిలించి ఫ్రెష్‌గా స్నానం చేసి వచ్చి కాఫీ తాగుతూ రిలాక్స్‌ అవుదామనుకున్నాడు. భర్త మాట కూడా తనకు విన్పించనట్టు చదువుతున్న పుస్తకంలో లీనమై అలాగే కూర్చుండిపోయింది.‘‘సంధ్యా’’ పిలిచాడు మళ్ళీ కాస్త సేదతీరాక. అలసిన మనసుకి స్నానం చేసి కూర్చుంటే ఎంతో హాయి అనిపించిందతనికి.‘‘ఏం! ఆమాత్రం కాఫీ కలుపుకోలేరా! అయినా మీ పోలీసు వాళ్ళకి వాళ్ళ ఏరియాలో ఏది కావాలన్నా ఆఘమేఘాల మీద సమకూరుస్తారటగా, ఏం! మీకు కాఫీ కూడా తాగడానికి హోటల్‌ దొరకలేదా! అందరికి ఇచ్చేవాళ్ళు మీకు మాత్రమే ఇవ్వరా!’’ చూస్తున్న మ్యాగజైన్‌లో నుంచి తలెత్తకుండానే వ్యంగ్యంగా జవాబిచ్చింది సంధ్య.

తనీవేళ మార్కెట్‌ నుంచి బస్సులో వస్తుంటే ఎంత చులకనగా మాట్లాడారని పోలీసువాళ్ళ గురించి, వాళ్ళ సంపాదన గురించి. బస్సులో తన పక్కనున్నావిడ కామెంట్‌ చేస్తుంటే వంట్లో తేళ్ళు జర్రులు పాకినట్టనిపించింది. చివరకొకావిడ ‘మీవారేం చేస్తుంటారని’ అడిగితే ‘ఫలానా’ అని సిగ్గుతో చెపకోలేకపోయిన సంఘటన గుర్తుకొచ్చింది సంధ్యకాక్షణంలో. నరనరాన మూర్ఖత్వం జీర్ణించుకున్న భార్యను చూసి ఏమనాలో అర్థంకాలేదు రవీంద్రనాధ్‌కి. వనంగా బయటకు నడిచాడు. మనసేం బావుండక పక్కవాటాలోని మిత్రుడు రామారావ్‌ను కలిసి కాస్త ఊరట చెందుదామని వెళ్ళిన రవీంద్రకి నిరాశే ఎదురైంది. అతడు తననో స్నేహితుడిలా కాక ఒక పోలీస్‌గా ట్రీట్‌ చేస్తూ ఆచితూచి మాట్లాడడం రవీంద్రని తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. నిరాశతో వెనుదిరిగాడు.రవీంద్రనాధ్‌ ఊహించింది వేరు. జరుగుతున్నది మరోలా వుంది. తనకిష్టమైన పోలీస్‌ ఉద్యోగంలో చేరాలన్న అతని జీవితాశయం నెరవేరింది కాని, తనకిష్టంలేని సంధ్యని పెళ్ళి చేసుకోమని తల్లి పట్టుబట్టడం, ఆమె మాట కాదనలేని తన బలహీనత - వెరసి సంధ్యతో కాపురం వెలగబెట్టడం. సొంత మేనమామ కూతురైన సంధ్య గురించి, ఆమె పెంకితనం గురించి రవీంద్రనాధ్‌కి ముందే తెలిసినా తల్లికోసం తను కష్టపడ్డా ఆమె మనసును కష్టపెట్టకూడదనే ఈ పెళ్ళికి ఒపకున్నాడు రవీంద్ర.‘‘సంధ్యకు మీ అన్నయ్య సంబంధం చూశాడట. అబ్బాయి ఈ ఊళ్ళోనే లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్నాడట’’ అని దూరపు బంధువొకాయన చెప్పినపడు రాజ్యలకి్క్షకి దుఃఖం పొంగుకొచ్చింది. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. ఆ మరునాడుదయమే పొరుగూర్లో వున్న అన్నయ్య దగ్గరకెళ్ళి కలిసింది.సంధ్యకు స్వయాన మేనత్తయిన రాజ్యలకి్క్ష - ‘‘అన్నయ్యా! నా భర్త చనిపోయినపడు, ఇక నా బ్రతుకు బుగ్గిపాలేనని క్రుంగిపోతున్నపడు - నీవు నూరిపోసిన ధైర్యంతోనే పరిస్థితులకెదురీది నా కొడుకును చదివించుకున్నాను. నా తర్వాత నా కొడుకు అనాథ కాకూడదు, వాడ్ని బాగా చదివించి ‘సంధ్యకు తగిన వరుడు రవీంద్ర’ అని మీ అందరికీ అనిపించినపడు అపడు చెబుదామని నా మనసులోని మాటను ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్నాను. ఆ ఒక్క ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. నా అన్నయ్య నీడన నా కొడుకు చేరాలి. అదే నా ఆశయం అన్నయ్యా! సంధ్య నీకు ఏకైక ముద్దుల కూతురే కాదు - నాకు ప్రాణప్రదమైన మేనకోడలు కూడా. నీ తాహతుకు తగ్గట్టు సంధ్యకు సరిజోడుగా వాడు ఎదిగిననాడే నీకీ విషయం గర్వంగా చెప్పాలనుకున్నాను’’ దుఃఖం పొంగుకొస్తోంది రాజ్యలకి్క్షకి. అన్నయ్య ఎదుట నిలబడి ఆమాత్రం ఆమె ఏనాడైనా మాట్లాడిందంటే అది ఈరోజే.