రామ్‌ మోహన్‌ తన హాస్టల్‌ గదిలో నుంచి కిందికి చూసాడు. కింద అంతా కోలాహలంగా వుంది. కాలేజీకి సెలవులు! అందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో వున్నారు. కాలేజీ బస్సు రైల్వే స్టేషన్‌ వరకు తీసుకువెడుతుంది. ఆ తర్వాత ఎవరి దారి వారిదే!‘గుడ్‌ బై టూ కాలేజ్‌...గుడ్‌ బై టూ బ్లడీ రాటన్‌ కేంటీన్‌!’.... అనుకుంటూ అందరూ వెళ్ళిపోతున్నారు. తను ఎక్కడకు వెళ్ళాలి? ఇక్కడున్నా ఇంట్లో వున్నా ఒకటే. ఎక్కడైనా ఒంటరి బతుకే ఎవరున్నారు?...రామ్‌ మోహన్‌ బయటకు వచ్చాడు. చలిగాలి ఒక్కసారి చుట్టు ముట్టింది. సముద్ర మట్టానికి రెండు వేల మూడు వందల మీటర్ల ఎత్తున ఈ ‘నీలాంచల్‌ మలై’ పర్వతాల దుర్భర శీతల హస్త స్పర్శ తప్ప, మల్లె తోటలోని పూల మృదు స్పర్శ ఏదీ? ఎముకలు కొరికే చలి తప్ప, చిరు వెచ్చటి రవి కిరణ మయూఖ తంత్రులు ఏవీ? ఇక్కడ మధుర రస రసాల సాలములు లేవు. గుబాళించే మల్లె తోటలు లేవు... గంగాజల సదృశ్యమైన కొబ్బరి బొండాలు ఇచ్చే తోటలు లేవు. తీర ప్రాంతాలలో పండే పనస రుచి కొండలలో పండే పనస పండ్లలో, ఎక్కడిది? అడవి మామిడికి తీర ప్రాంతపు మామిడి రుచి ఏది?....బయట రాకేశ్‌ కనపడ్డాడు...‘హాయ్‌ రామ్‌! ఇంటికి వెళ్ళడం లేదా?’ అడిగాడు...‘లేదు...ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించలేదు’ పేలవంగా సమాధానం చెప్పాడు.

 ‘ఐ బెట్‌..ఎక్జాట్లీ, సేం టు సేం !...నేను కూడా..హాస్టల్‌ కూడా మూత పడుతుంది. నోవేర్‌ టు గో!’ అన్నాడు రాకేశ్‌...‘అదేం? మీ ఇంటికి వెళ్ళొచ్చుగా!’ రామ్‌ మోహన్‌ అడిగాడు. రాకేశ్‌ భారంగా నిట్టూర్చి చెప్పాడు. ‘వెళ్ళొచ్చు. ఎందుకు?’ ఆ లంకంత కొంపలో నేను తప్ప ఎవరూ కనపడరు. అక్కడా వంటరి బతుకే! అమ్మా నాన్నా పెద్ద డాక్టర్లు...పైగా రాజకీయాలు...నేనెక్కడ కనపడతాను వాళ్ళకి. నా ఇరవై ఏళ్ళ జీవితంలో నేను వాళ్ళతో ఉన్న రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. వాళ్ళకి ఎప్పుడూ డబ్బు సంపాదనా, రాజకీయపుటెత్తులూ! అంతా నా కోసమేనట! ‘బెస్టు ఎడ్యుకేషన్‌’ అంటూ నా జీవితం అంతా ఇలా హాస్టళ్ళ లోనే గడిచి పోయేట్టు చేశారు. నాకు, అక్కా చెల్లీ, అన్నా ఎవరూ లేరు! అక్కడకు వెళ్ళి ఎవరిని చూడాలి? మేం గొప్ప వాళ్ళం కాబట్టి మాకు చుట్టాలు లేరు’ నవ్వుతూ చెప్పాడు. జీవం లేని నవ్వు. ఈ కొండలపైన దట్టమైన అడవి మధ్యన ఈ కాలేజీ ఎందుకు పెట్టారో, ఈ లెక్చరర్లు, ఉద్యోగులు, మర మనుషుల్లా ఎందుకు ఉంటారో నాకు అర్థం కాదు. ఇదేం క్రమ శిక్షణ! ఈ రోజు...సెలవు కాబట్టి...మనం మాట్లాడుకుంటున్నాం.

కానీ...మిగిలిన రోజుల్లో అయితే...‘గో! గో!... గో! టు యువర్‌ రూమ్స్‌...’ అని ఈ పాటికి తోలేసే వారే కదా!...మరి నువ్వు?’ ఐ బెట్‌...నీకు అమ్మా , నాన్నా, నాయనమ్మా, మామయ్యలూ, పిన్నమ్మలూ వుండే వుంటారు’...రామ్‌ మోహన్‌ మొహం కంద గడ్డలా అయ్యింది. ‘ఉన్నారు. బట్‌..ఐ హేట్‌ దెం!’ రాకేశ్‌ చురుగ్గా చూశాడు. అమ్మనీ, నాన్ననీ, బంధువులనీ ద్వేషిస్తున్నాడంటే, ఈ వయసులో...అది ఖచ్చితంగా ప్రేమ వ్యవహారమే అయి వుంటుంది. కొద్ది సేపటికి రామ్‌ మోహన్‌ ముఖంలో మళ్ళీ సాధారణ పరిస్థితి నెలకొంది...’ నాకు అర్థమైంది. ఆమె పేరు..?’ కింద ఏదో గొడవ మొదలైంది. బస్సు చాలడం లేదు. విద్యార్థుల కంటే బస్సు సీట్లు తక్కువ. ఇంకో ట్రిప్‌ వెయ్యమంటే కేర్‌ టేకర్‌ ఒప్పుకోవడం లేదు. రామ్‌ మోహన్‌ అప్పుడు చెప్పాడు. కలలో మాట్లాడినట్టు, ‘రాజ్యలక్ష్మి...’ రాకేశ్‌ మెట్ల వైపు వెడుతూ అన్నాడు. ‘రామ్‌! ఈ ‘నీలాంచల్‌ మలై’ పర్వతాల మీద మనం చేసేదేమీ లేదు. ముందు మనం మా ఇంటికి వెళదాం తర్వాత మీ ఇంటికి. నీకేం అభ్యంతరం లేదు కదా! మా ఇంట్లో పెద్దగా ఆకర్షించేవి ఏవీ లేవు...డల్‌ ఫేర్‌! నువ్వు ఒప్పుకుంటే పబ్‌కి..మనం ఏం చేసినా అడ్డుకునే వాడే లేడు. బోరు కొడితే నైట్‌ క్లబ్‌..నైట్‌ అవుట్‌...యు లైక్‌ ఇట్‌ ఐ బెట్‌!...’ రామ్‌ మోహన్‌ ఇంటి సంగతి మరిచిపోయి నవ్వుతూ అన్నాడు. అది సరే నీకు ఎనీ గర్ల్‌ ఫ్రెండ్‌!’ రాకేశ్‌ నిరాసక్తంగా చెప్పాడు. ‘లేదు. పెళ్ళి అయిన తర్వాత అనివార్యంగా వచ్చే ఈతిబాధలను ముందే ఆహ్వానించడం ఎందుకు? ఐ బెట్‌ యు అగ్రీ!...ఈ టీన్‌ ఏజ్‌లో అబ్బాయిలను ఆకర్షించేవి రెండే రెండు. ఒకటి స్పీడ్‌...అది ఫాస్ట్‌ బైక్స్‌, కార్ల వల్ల తీరుతుంది.

రెండు ఎవరికీ అంతు చిక్కని బ్రహ్మ పదార్థం ‘ప్రేమ’. ఈ రెండూ యువత కి ప్రమాదకారులే!’ రామ్‌ మోహన్‌ రాకేశ్‌ తో పాటే కిందికి దిగాడు. రాకేశ్‌ అప్పుడప్పుడు ‘ఐ బెట్‌’ అనడం గమనించాడు రామ్‌ మోహన్‌. బయట గాలి స్వచ్చంగా వుంది. ‘కన్నెముని’ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఆవరణ. విశాల ప్రాంగణం. భారతదేశంలో పేరు పొందిన ఇంజనీరింగ్‌ కాలేజీ. ఊటీ సిటీకి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో వుంది. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న ‘మాస్చుసేట్ట్స్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ స్థాయికి తీసుకురావాలని ‘కన్నెముని’ యాజమాన్యం ఆలోచన. హాస్టల్స్‌, సిబ్బంది నివాస గృహాలూ పెద్ద గ్రంధాలయం, ప్రశాంతమైన వాతావరణం...చదువు తప్ప ఏ ఇతర ఆకర్షణలు లేవు. ఇక్కడికి వచ్చిన కొత్తలో, మౌంటెన్‌ ట్రైన్‌, పచ్చటి పచ్చిక మైదానాలు, ఉరకలు వేసే సెలయేళ్ళు, జలపాతాలూ, టీ తోటలు, మనుషులే కనపడని నున్నటి, నల్లటి తారు రోడ్లూ అంతా వింతగా విచిత్రంగా వుండేవి. చాలా ఉత్సాహంగానూ వుండేది. క్రమంగా కొత్త మోజులు తగ్గి, ఇప్పుడు ఆ ప్రదేశం పెద్దగా ఆకర్షించడం లేదు. ఆరు బయట జైలుకీ దీనికీ తేడా ఏమిటి? డబ్బులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి. మార్పులు లేని వారపు ‘భోజన సూచిక’ (మెనూ) ముందే తయారవుతుంది. ఏ కూర చేసినా ఒకటే రుచి. మధ్యలో, విటమిన్ల లెక్కలు, ఆకు కూరల్లో, కాయ గూరల్లో ఎంజైమ్‌ల బేరీజులు, కొలెస్ర్టాల్‌ లెక్కలూ, కలిసి...వెరసి, రుచిలేని కూరలు, చప్పని చపాతీలు, అన్నం.