చలికాలం...దానికితోడు - ఆకాశం ఉరుములతో మెరుపులతో యుద్ధవాతావరణాన్ని తలపింపచేస్తోంది.మరి కాస్సేపట్లో కుంభవృష్టి తప్పదేమో అనిపిస్తోంది.జన సంచారం ఎక్కడా కనిపించటం లేదు.అందరూ ముసుగుతన్ని నిద్రపోతున్న సమయమది.మధ్యమధ్య కోట గుమ్మం నుండి సమయాన్ని సూచిస్తూ ఘంటారవాలు వినబడుతూనే ఉన్నాయి.రాత్రి రెండో జాము నడుస్తోంది.అప్పటివరకు గ్రంథ రచన చేస్తున్న రాయలవారు ఏదో ప్రణయఘట్టం మధ్యలో ఆగిపోయారు.గంటం ముందుకెళ్లటం లేదు.ప్రబంధ కవుల ప్రణయ సన్నివేశాల్ని ఓసారి గుర్తుకు తెచ్చుకొన్నారు.స్వీయానుభూతుల్నీ మననం చేసుకొన్నారు.అయినా లేఖిని మొరాయిస్తూనే ఉంది.ఆరోజు అంతగా కార్యభారం లేకపోవటంతో, ఎలాగైనా ఆ ప్రణయ ఘట్టాన్ని పూర్తిచేయాలనుకొన్న రాయలవారి రచన ఎందుకో అనుకొన్నంతగా పాకాన పడటం లేదు.గంటాన్నీ, తాళపత్రాన్నీ యథాస్థానంలో ఉంచేసి ప్రక్కనే ఉన్న శయ్యా మందిరంలోకి అడుగు పెట్టారు.అంతఃపురంలోని ఆ శయ్యా మందిరంలో కూడా చలిగానే ఉంది.రాయలవారు కావాలనే అక్కడ అప్పుడప్పుడు ఎటువంటి ఉపశమన సదుపాయాల్నీ కల్పించరు.దానిక్కారణం - శృంగారానికి చలి దోహదం చేస్తుందే తప్ప ఎటువంటి అవరోధాల్ని కలిగించదనేది రాజావారి అనుభవం.రాయలవారు సాహితీ సమరాంగణ సార్వభౌములే కాదు - రసిక చక్రవర్తులు కూడ.అప్పటికే అందాలరాణి చిన్నాదేవి ఆ శయ్యా మందిరంలో రాయలవారి మగసిరి కోసం ఎదురు చూస్తోంది.

‘‘దేవిగారి కంటిమీదికి కునుకే రావటం లేదేమో...’’ రాయలవారు చిన్నాదేవి వేపు సరసనేత్రులై చూశారు.‘‘మదన ప్రభువులు దయచూపనిదే...’’ అంటూ ఆమె ఇంకా మాట్లాడుతుండగానే రాయలవారి దక్షిణ హస్తం రాణిగారి చుబుకాన్ని సుతారంగా స్పృశించింది.ఆ తాకిడితో చిన్నాదేవి శరీరం ఒక్కసారిగా జలతరంగిణిలా జివ్వుమంది. కోటివీణలు ఒకేసారి కదన కుతూహల రాగాన్ని వినిపిస్తున్నట్లుగా ఉంది ఆ స్పర్శ. ఆమెకు ఇదేమీ క్రొత్త కాకపోయినా, ఆ స్పర్శ మాత్రం ఎప్పుడూ నూతనంగానే ఉంటుంది.‘‘చలిచలిగా ఉందికదూ...’’ మాటలోనే మదనతాపం రెచ్చగొడుతూ అన్నారు రాయలవారు.‘‘రవిచంద్ర నేత్రుల మీరుండగా...’’ చిన్నాదేవి పతిదేవుని కళ్లల్లోకి సిగ్గుతో చూస్తూ అన్న అసంపూర్ణవాక్యమిది.‘‘ఎంత కవితాత్మకంగా మాట్లాడావు దేవీ... మా కౌగిలి.... చలికాలంలో వేడిగానూ, వేసవిలో శీతలంగానూ ఉంటుందని కదూ నీ కవి భావం. పైగా ఆ రెండూ విష్ణుచక్షువులు. ఈ ప్రభువును అలా విష్ణువుతో పోల్చ టంలో కూడా ఎంతో ఔచిత్యాన్ని పోషించావు....’’ అంటూ రాయలవారు ఆమెకు మరింత చేరువయ్యారు.చిన్నాదేవి ఓరగా చూసింది.ఆ చూపులు తియ్యని తూపులై రాయలవారికి గుచ్చుకొన్నాయి.‘‘దేవిగారు మరచినట్లున్నారే...’’ బుగ్గమీద చిటికేస్తూ కళ్లల్లోకి చూశారు.‘‘మన్నించండి...’’ అంటూ మరచిపోయిన తాంబూలం తాలూకు చిలకల్ని క్రమక్రమంగా చిన్నాదేవి రాజావారి నోటికందించింది.రాయలవారు చిన్నాదేవి నోటికి కూడ రెండు చిలకల్ని అందించారు.‘‘ప్రణయఘట్టం ఎంతవరకు వచ్చిందో సెలవిస్తారా...’’ రాయలవారు వ్రాస్తున్న గ్రంథం గురించి సమయోచితంగా అడిగింది వలరాణి.