రోహిణీకార్తె! ఈ కాలంలో రోళ్ళు సైతం పగిలి పేలాల్లా ఎగిరిపడతాయనేది సామెత. కుంటలు, చెరువుల్లో చుక్కనీరు లేదు. కాసేపు ఎండలో ఉంటే చాలు జీవంకూడా ఆవిరయ్యేంత శాకం తగులుతోంది.ఆ రోజు ప్రొద్దున్నే హడావుడిగా వెళుతున్న యోగయ్యను రాములవారి గుడికాడ ఆపాడు వెంకటస్వామి.‘‘ఏందోయ్‌ ఆ తొందర. సేనికేనా! బోరేప్తిన్నవంటగా?...’’ మిగతా వివరాలు చెప్పమన్నట్లు ముఖాన్ని ప్రశ్నార్థకంగా పెట్టాడు.‘‘అవును మామా సేలో బోర్లన్నీ ఎండినై. ఎంతసేపు మోటరేసినా సెంబెడు నీళ్ళు కూడా రావడంల్య అందుకే కొత్త బొక్క తప్పలా ఇపడుగాన జల తగిలిందంటే అదురుట్టమే. వానాకాలానికి బోరునిండ నీళ్ళుంటై. ఒంటిరిగాన్నయి పోతిని, అన్నీ నేనే సేసుకోవద్దు. నీకంటే నలుగురు కొడుకులు కూసోబెట్టి సాకుతున్నరు.‘‘కూసోబెట్టి ఏం కర్మరసామి పండబెట్టి నోట్లో ముద్దబెడుతున్నరు’’. నవ్వుతూనే ‘‘ఇంతకీ పాయింట్‌ ఎవుర్తో పెట్టించావు? అదిశానా ముక్కెం కదా’’‘‘మల్లయ్యతోటి’’‘‘వాడు బెట్టినోటిల్లో శానావాటిల్లో నీళ్ళు బడ్డయిలేగాని వాడ్నంతా మాయదారి మల్లిగాడంటరు. 

కాస్త సూసి పెట్టమను ఇప్పటికే నువ్వు బోర్లల్లో శానా దెబ్బతిని ఉన్నవు’’.వెంకటస్వామి మాటలకు యోగయ్యకు తన ఐదెకరాల పొలంలోని ఒట్టిపోయిన తొమ్మిది బోరుబావులు గుర్తొచ్చాయి. వేయించబోయేది పదోది! కాలువలో, చెరువులో ఉండి పుష్కలంగా నీరున్న ప్రాంతంకాదది. బోర్ల నీటినే నమ్ముకుని తమ జీవితాలను గాలిలో దీపంలా భావించే రైతాంగం పండిననాడు తినడం, లేనినాడు ఎండుకోవడం తప్ప ఇతర మార్గాల గురించి ఆలోచించని అమాయక ప్రజల గడ్డ అది.యోగయ్య పొలం నాలుగేళ్ళ క్రిందటి వరకూ రతనాలు పండించిందే. ఇంటినిండా తిండిగింజలతో పండుగ సంబరాలలో మునిగి తేలేలా చేసిందేఈ నాలుగేళ్లనించే అరటి, బొప్పాయిల దెబ్బకు భూమాత చనుబాలు ఎండిపోయాయి. సారమంతాపోయి సమస్యల కాసారం మిగిలింది. లక్షల విలువ చేసే పంటలు పండినా యోగయ్యకు మిగిలింది అంతంతమాత్రమే.ముక్కు మొహం తెలీని మనుషులు కూడా వచ్చి ఆప్యాయంగా పలుకరిస్తుంటే యోగయ్య మురిసిపోయేవాడు. ఢిల్లీ ఎక్కడ? ముంబాయి ఎక్కడ? ఏమైనా తనేసిన పంటలవల్లే కదా వాళ్ళు తనను గుండెలకు హత్తుకుంటోందని పొంగిపోయేవాడు.

తన పంటని గ్రద్దలా తన్నుకు పోయేంతవరకే దళారిప్రేమ కురుస్తుందని గ్రహించేలోపు ఆరణాల సరుకు అర్థగానే రాష్ట్రాల సరిహద్దులు దాటేది. చేతిలో పడ్డ కాసిన్ని డబ్బులు విత్తనాలు, మందుకొట్టడానికే సరి. ఇక మిగిలేదేముంది? కూడబెట్టేదేముంది? తన కార్పోరేట్‌ వ్యవసాయానికి గుర్తుగా ఒట్టిపోయిన బోర్లు మిగిలాయి.ఈ నాలుగేళ్ళనించీ ఇదే తంతు. రెండుకళ్ళూ చెమర్చాయి. తడి కనపడకుండా నలక పడ్డట్టు కళ్ళు నులుముకుంటూ, ‘‘వాడికి గట్టిగానే సెప్పినమామా నిన్నోపాయింటు పెట్టిండు. మళ్ళీ ఈ రోజు కూడా సరిగ్గా సూడమన్న. నిన్న సూపిన కాడనే వాడి సేతుల్లోని పుల్లజారిందా, మనకు అదుట్టం ఉన్నట్టే. కచ్చితంగా ఆడనీళ్ళుంటై’’ కండువాతో చెమట తుడుచుకుంటూ చెప్పాడు యోగయ్య.