‘‘మరి నాకు సెలవా?’’‘‘అప్పుడేనా? అయినా చూడు. వాతావరణం ఎలా ఉందో! ఈదురుగాలులు, ఉండుండి మీద కురిసే వాన-ఈ రాత్రివేళ వెళ్ళకపోతేనేం! నీవు నాకేమీ పరాయివాడవా! ఈ రాత్రి ఇక్కడే ఉండి, మేఘాలు కాస్త సద్దుమణిగిన తరువాత రేపుదయం వెళ్ళొచ్చుకదా!’’‘‘మీరన్నది నిజమే! ఇక్కడున్న వాన అక్కడుండదు. ఉన్నా ఇంతలా ఉండకపోవచ్చు. నే వెళ్తాను. ముహూర్తం కుదిరిన సంగతి ఇంట్లో అందరికీ చెప్పాలి. దసరా ఎంత దూరమో లేదు. దసరా దాటగానే కదా పెళ్ళి....’’‘‘నిజమే. నిజమే అయితే రాత్రికి రాత్రే పెళ్ళి పనులు మొదలుపెట్టేస్తావా? తొందరపడకు. అన్నీ సానుకూలమవుతాయి. డబ్బూ చేతికందుతుంది...అంతా!...’’ఇలా వర్షం రాత్రి వెళ్ళద్దని శాస్త్రి, విశ్వనాధాన్ని వారిస్తున్న వేళ వీధిలోంచి ఎవరో వచ్చి ‘‘స్వామినాయుడుగారొస్తున్నారు...స్వామినాయుడుగారు...’’ అంటూ వార్త చేరవేశారు. విశ్వనాధం, స్వామినాయుడు పేరు విన్నాడే కానీ చూడలేదెప్పుడు.‘‘స్వామినాయుడా? ఈ రాత్రి వేళా! ఏమంత అవసరం....సరే రమ్మను..’’ అని మాట జెప్పి 

‘‘విస్సూ! స్వామినాయుడెవరో తెలుసా! పెద్ద వ్యాపారవేత్త-వైజాగే...వినే ఉంటావతని పేరు...’’ అని శాస్త్రి ఏదో చెప్పబోతుండగా స్వామినాయుడు వస్తూనే ‘‘గురూ గారూ! నమో నమః’’ అంటూ అతని పాదాల మీద పడ్డాడు. ట్యూబులైటు వెలుగులో అతని మెడలోనున్న బంగారు గొలుసు, రెండు చేతులకున్న ఉంగరాలు తళుక్కుమన్నాయి.లక్ష్మీదేవి సరస్వతీ దేవి మ్రోల వ్రాలి నట్టనిపించింది విశ్వనాధానికి. నిజానికాతనికి ఆశ్చర్యమే కలిగింది.‘‘ఏమిటి నాయుడుగారూ అంత కష్టమొచ్చిందా?’’ అన్నాడు శాస్త్రి కాస్తపరిహాసంగా నవ్వుతూ.‘‘కష్టమని కాదు. అవసరం. ఎంతో అవసరమైందనే కదా! ఈ రాత్రివేళ ఈ వాతావరణంలో వచ్చాను. మా చిన్నమ్మాయి సుజాత పెళ్ళి వచ్చేనెల చేద్దామనుకుంటున్నాను. మీరు మంచి ముహూర్తం పెట్టాలి’’ ప్రాధేయపడుతూ స్వామినాయుడు. అతని మాటలకు ఒకసారి నిశ్చలంగా ఉండి, మనసులోనే ఏదో గుణించుకుని ‘‘ఓ ఆరు నెలల పాటు ఏ కొత్త ప్రయత్నమూ, శుభకార్యమూ తలపెట్టవద్దు. కాలం కాస్త అనుకూలంగా లేదు.’’ అన్నాడాయన.‘‘అయ్యో! మీరలా అంటే ఎలా? పెళ్ళికొడుకు అమెరికాలో సాఫ్టువేర్‌ ఇంజనీరు. వచ్చే నెలే వస్తాడు. ఒక నెలే సెలవు. వచ్చి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాకపోతే మరి రెండు సంవత్సరాల వరకు రావడం అవదతనికి. మీరే దారి చూపాలి.’’