‘‘యెర్రావారిపాళెం దేవరిండ్లకు పొయ్యి సోదిరంగం జెయ్యించి జబాబు తెల్సుకోవాల. అంతదాంకా నాకు నిమ్మళంగా వుండదు’’ అంది చెంచమ్మ తనను తాను వోదార్చుకుంటున్నట్టుగా.‘‘ఆ పొద్దు మీ అమ్మ సోదిగాని వొళ్ళుపైకొచ్చి యేంజెప్పింది? ఆడది లేకుండా మీనాయిన గెడిసేపు వుండ్లేనని చెప్పిందాలేదా? యిపడు మళ్ళా రంగం జెయ్యించమని నా పాణం తియ్యద్దు. చిన్నాచితకా పశ్నలకంతా ఖర్చుజేసి జబాబులు జెప్పించేంత దుడ్డు నా దగ్గరలేదు.’’ అని విసుక్కున్నాడు బత్తయ్య.పదిబారలు సాగిపోయిన ఆదెయ్య మళ్లీ గుడిసె దగ్గరికి తిరిగొచ్చి ‘‘మళ్లా చెప్తావుండాను... రేపు సాయంత్రానికంతా నా కమ్మలు నా చేతిలో వుండాల్ల కావాల్ల... లేకపోతే గొమ్మునుండను’’ అన్నాడు. 

తడినేలలో గునపాన్ని దిగేసినంత కరకుగా.యేడుపు పొంగుకొస్తున్న గొంతుతో ‘‘అవ్వి నీ కమ్మ కట్లయినాయి నాయినా? మా అమ్మ నాకు యిచ్చినవయ్యి...’’ అంది చెంచమ్మ.‘‘రేపు నా సొత్తు నాకు చేరకుండా పోతే అపడు చెప్తాను ఆ పశ్నకు జబాబు...’’ అంటూ ఆదెయ్య గాండ్రించాడు.‘‘అట్నే తేల్చుకుందాం లే రాపో మామా!’’ అని బత్తయ్య సవాలు విసిరాడు.‘‘నా సంగతి బాగ దెలుసుకదా? నా మాటినకపోతే ఆడియాలం లేపేస్తాను. కన్నబిడ్డని గూడా జూడను బాంచెల్‌’’ పెద్దగా అరుస్తూనే ఆదెయ్య వెళ్ళిపోయాడు.బత్తయ్య గుడిసెలోంచీ బయటి కొచ్చి, గడప పక్కన నాటిన కొయ్య స్టాండు పైనున్న స్టార్టరు మీటను నొక్కాడు. అంత వరకూ కారు బారు చేసిన బోరింగు మిషను గొంతు నొక్కుకుంది.తూర్పున కొండలు లేకపోవడంతో తొందరగా బయటపడిన నీరెండ లేత నీడల్ని పరుస్తోంది. గుడిసె చుట్టూ చిన్నచిన్న రాళ్ళు పాతి యిళ్ళ స్థలాలుగా మార్చిన మైదానంలో పిచ్చి మొక్కలూ, తుమ్మపొదలూ బలిసిపోయి వున్నాయి. వుత్తరాన శేషాద్రి కొండల దగ్గరి నుంచీ శివార్ల వరకూ వ్యాపించిన వీధుల్లో యిండ్లు కిక్కిరిసిపోయి వున్నాయి. అక్కడి నుంచీ దక్షిణపు గుట్టల వరకూ పరుచుకున్న బీళ్ళలో అక్కడక్కడా కడుతున్న యిండ్లు మధ్య తరగతి వాళ్ళ పిల్లల్లా బలహీనంగా కనబడుతున్నాయి. వాటి ముందు కాపలా వాళ్ళ కోసం కట్టిన గుడిసెలు పిచ్చకుంట్ల వాళ్ళ పిల్లల్లా దుమ్ము గొట్టుకుపోయి, వికారంగా కనబడు తున్నాయి.

బోరింగు దగ్గరి నుంచీ, దీర్ఘ చతురస్రాకా రంలో రెండడుగులదాకా పైకి లేచిన పునాది గోడల వరకూ సాగిన రబ్బరు గొట్టాన్ని చుట్టజుట్టి గుడిసెలోకి తీసుకొచ్చాడు బత్తయ్య. కుక్కి మంచంలో వుయ్యాలలా వూగుతున్న నారపోగుల పైన పడుకున్న చెంచమ్మ ‘‘కావాలంటే నా కూత దుడ్డే సెలవు జేసుకుంటా! మానాయిన కాబసివి మందు బెట్టేసింది.దాన్ని కక్కించేదాకా నిద్ర పోను’’ అంది.‘‘పోయిన తడవ సోదిరంగం జెయ్యించిన పడు అయిదునూర్లు సదివించిందాంకా మీ అమ్మ సోదిగాని పైకి దిగిరాలేదు. సాంబ్రాణీ కర్పూరా నికే నూరుదాంకా వదిలించింది. తళిగల్నిండా రాసులు రాసులుగా బియ్యమూ పప్పూ కుమ్మరించినాంక గానీ ఆమెకు దయరాలేదు. మళ్లా అంత సెలవు జేసే పురసత్తు లేదునాకు. కావాల్లంటే అపడు పట్టించిన టేపునే మళ్లాయిను...’’