సెల్‌ఫోను రింగవుతోంది. నెంబరు చూసాను. అది రమణది.‘‘చెప్పు రమణా....’’ అన్నాను ఫోను చెవికి ఆన్చి.‘‘సార్‌.... వయ్యేరు మీద రెండేళ్ళక్రితం కట్టిన డామ్‌... పగుళ్ళిచ్చిందట.మన నియోజకవర్గం లోని వాడపాలెం గ్రామం ఆ డామ్‌కి దిగువన ఉండటంతో ఊళ్ళోకి నీళ్ళొస్తున్నాయి...’’‘‘ఎప్పట్నుంచి...’’‘‘ ఓ గంట క్రితం నుండి. మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్‌లోనా?!...’’‘‘లేదు. రమణా... వాడపాలెంకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఓ స్నేహితుడి గెస్టుహౌస్‌లో ఉన్నాను. ఓ అరగంటలో అక్కడికి వస్తాను. మనవాళ్ళందర్ని తీసుకుని వాడపాలెం వెళ్ళు. అన్నీ మనమే చెయ్యాలి...’’ అన్నాను. ‘మనమే’ అన్న పదాన్ని నొక్కిపలుకుతూ.ఒకవైపు అతనితో మాట్లాడుతూనే ఈ ఇష్యూని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించసాగాను. ఇంకో ఆర్నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. సో... ప్రజలకు దగ్గరవటానికి ఇదో మంచి ఛాన్సు! వదులుకోకూడదు.

‘‘ప్రెస్‌వాళ్ళకి ఫోను చేసావా?!’’ అడిగాను.‘‘లేదు సార్‌....’’‘‘వెంటనే చెయ్యి...‘‘ అని చెప్పి ఫోను కట్‌ చేసాను.‘‘ఏమయింది?!....’’ మధుకర్‌ అడిగాడు నన్ను. అతను నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌లో ఒకడు. చెప్పేను వాడపాలెం సంగతి.‘‘అరే.... ఇప్పుడు నువ్వెళ్ళాలా?! నీకోసం ఈరోజు ఈవెనింగ్‌ బ్రహ్మాండమైన పార్టీ ఎరేంజ్‌ చేసాను. వెళ్ళిపోతే ఎలా?!’’ నిరుత్సాహంగా అన్నాడు మధుకర్‌.‘‘వెళ్లాలి మధు. ఇలాంటి అవకాశాలు తరచూ రావు. వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. పార్టీ ఎప్పుడన్నా ఏర్పాటుచేసుకోవచ్చు. నా నియోజక వర్గంలో నాలుగువేల ఓటరులున్న గ్రామం వాడపాలెం. అక్కడ ఇప్పుడు కాస్త ఓవరేక్షన్‌ చేసామనుకో... పిచ్చి జనం ఎలక్షన్లలో మనకే గుద్దేస్తారు ఓట్లు. ఎలక్షన్లప్పుడు నోట్ల కట్టలు పంచినా రాని గుడ్‌విల్‌ ఇలాంటప్పుడు అక్కడ నిలబడితేచాలు వచ్చితీరుతుంది. అంతేకాకుండా వాళ్ళ మనసుల్లో మనపైన మంచి అభిప్రాయం ఓ ముద్రలా అలా పడి ఉంటుంది...’’ కన్నుకొట్టి నవ్వేను.‘‘నీ బుర్రలో ఉన్నది మెదడుకాదు పాదరసం. అందుకే ముప్పయ్‌ ఏళ్ళకే ఎం.ఎల్‌.ఏ. అయి కూర్చున్నావు...’’ మెచ్చుకోలుగా అన్నాడు మధుకర్‌.కాసేపటి తర్వాత నేనెక్కిన కారు వాడపాలెం వైపు దూసుకుపోతోంది.పదేళ్ళ క్రితం బి.ఏ. డిగ్రీ తప్ప నా చేతిలో చిల్లిగవ్వలేదు. ఉద్యోగాల కంటే రాజకీయాలే లాభదాయకమనిపించి ఓ రాజకీయ నాయకుడికి అనుచరుడిగా మారేను. బి.ఏ.లో చరిత్ర చదివిన నేను ఆ నాయకుడి ఆకస్మిక మరణంతో పరిస్థితిని నాకు అనుకూలంగా మార్చుకుని ఉప ఎన్నికలలో టిక్కెట్‌ దక్కించుకుని ఎం.ఎల్‌.ఏ అయ్యాను.