పూలబాలల నడుమను అరవిరిసిన అరవిందము వోలె పరిమళించు ఆమె పేరుకు తగినట్టే పూలతీగ వంటి తనువు. యవ్వన సౌందర్యంతో అలరారుతున్నది. పగడముల బోలు అధరములు, కలువరేకుల వంటి నేత్రములు చూపరుల మానసములను ఇట్టే ఆకర్షించుచున్నవి. మల్లియలు, జాజులు, మందారములు, రోజా సుమములు, చామంతి పూవులు.. వాటితో కలిసిపోయిన దవనపు. మరువపు పత్రములు... ఆమె కరములలో అందమైన మాలికలుగా రూపొంది. ఆ దేవాలయమందు కొలువైన వేణుగోపాలస్వామి గళమున అలరారుచున్నవి.ఆమె పేరు మంజరి. రాజధాని దాపులనే పుణ్యక్షేత్రంగా పేరొందిన గ్రామమది. అక్కడకేతెంచు భక్తుల సంఖ్య అధికము కావున ఆమె వృత్తి ఏ ఒడిదుడుకులు లేక సాగిపోవుచున్నది. నా అన్నవారు లేని ఆమెకు దూరపు బంధువుల సహాయమే పెన్నిధి కాగా, అదే ఆమెకు ఈ వ్యాపకమునూ నేర్పించినది.తన అంగడి ముందు నిలుచున్న స్ఫురద్రూపిని చూడగానే తీయని కలవరపాటుకు గురి అయినది మంజరి. నవ్వు చున్న నయనములతో ఆమెను పరికించి చూచుచు ‘ఈ సుమ మాలలన్నియు వలయును...’ అని పలికినాడు.‘అవశ్యము... తీసుకొనుడు..’ అన్నింటినీ పెద్ద అరిటాకులో చుట్టబోయినది.‘‘ఇదిగో, ఈ అర్ధమును గ్రహించుము..’ ఆమె చేతుల్లో కాసుల మాట ఉంచినాడు.

‘‘ఆర్యా, వీటికి ఇంత ధనము అవసరం లేదు..’’ వినమ్రంగా సమాఽధానం చెప్పినిది మంజరి.‘‘నీవు నాకు నచ్చితివి కుసుమాంగనా! నీకు తుచ్ఛమగు ధనము మీద ఆశ లేశమైనా లేదు.. సంధ్యా సమయమున నదీ తీరమున నను కలుసుకోగలనా? సూర్యాస్తమయమైన ఘడియ తదుపరి ఆటకు రావలె..’ తగ్గుస్వరంతో చెప్పాడు.తీవ్రమైన అభ్యంతరమును తెలుపబోయిన ఆమెకు అతని కనులలో ఏమి గోచరించినదో ఏమో కానీ, మంత్రముగ్ధలా తలూపినది అంగీకార సూచకంగా.ఫఫఫ‘నా అభ్యర్థన మన్నించి వచ్చినందుకు ధన్యుడను..’’ మంజరికి అభివాదం చేసి నిలుచున్నాడతడు.మంజరి దేహమంతయూ చివురుటాకు వలె వణికినది... పద్దెనిమిది వసంతాల ప్రాయమున వయసు వచ్చిన తరు వాత, ఆమెకింతవరకూ ఏ పురుషునితోనూ పరిచయం కలుగలేదు.‘‘రా. ఇలా ఆసీనపు కమ్ము దేవీ..’ చేయి పట్టుకుని ఇసుక తిన్నెమీద తన ప్రక్కనే కూర్చుండబెట్టాడు. నది మెల్లగా ప్రవహిస్తుంటే, మలయానిలము సేద దీర్చుతున్నట్టుగా వీచసాగింది. చిరు చీకట్లు ముసురుకోనుచుండగా వాటిని చెదరగొడుతున్నట్టుగా తూర్పుదిశ నుంచి నిండు చంద్రుడు ఉదయించుచున్నాడు..