అన్ని విషయాలూ డైరీలో రాయకూడదని తెలుసు.ఈ డైరీ ఇంకెవరైనా చదివే ప్రమాదం వుందనీ తెలుసు. అయినా ఎవరితోనైనా పంచుకోగలిగిన సంగతైతే..... డైరీలో రాయకపోదును. గుండె లోతుల్లోంచి దుఃఖం తన్నుకొస్తోంది. ఒళ్ళంతా చీదరగా వుంది. నాపైన నాకే అసహ్యం వేస్తోంది. డైరీ రాస్తుంటే చేతులు సన్నగా వణుకుతున్నాయి. కాళ్ళల్లో సాయంత్రం మొదలైన వణుకు ఇంకా తగ్గలేదు.ఇప్పుడు దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. జీరో వాల్ట్స్ బల్బు వెలుతురులో... నేను ఒక్క దాన్ని హాస్టలు గదిలో మేల్కొని ఇలా... నా లోపలి దుఃఖానికి, వేదనకు అక్షర రూపం ఇస్తున్నాను.ఇనుప మంచంలో పై అరలో నేను, క్రింద వరుసలో ఉమ ఇంకా క్రింద వరుసలో జ్యోత్స్న. మంచంపైనే ఈ సమయంలో కూర్చుని డైరీ రాసుకోవటం అస్సలు కుదరదు కాక కుదరదు. కాబట్టే మంచం పైన పడుకుని గోడవైపుకు తిరిగి, పక్కనే డైరీ పెట్టుకుని రాస్తున్నాను. ప్రశాంతంగా డైరీ రాసుకోలేను. అన్నీ చెప్పలేనట్లే రాయలేనివి ఎన్నో, ఎంత ఆపుకుందామనుకున్నా కన్నీళ్లు ఆగడమే లేదు. గొంతు తడారి పోతూ వుంది. గుండెలో, కళ్ళలో, గొంతులో ఏమిటో వెగటుగా, మంటగా వుంటోంది.పొత్తి కడుపులోంచి ఏదో బాధ మొదలై శరీరమంతటా వ్యాపిస్తోంది.
దేవుడా? ఏమిటీ నాకీ శిక్ష? నేనేం పాపం చేసానయ్యా?అమ్మ, నాన్న, తమ్ముడు ఉన్నట్లుండి గుర్తుకొచ్చేసారు. ఇల్లు గుర్తొచ్చింది. ఊరు గుర్తొచ్చింది.అమ్మమ్మ, నానమ్మ గుర్తుకొచ్చారు.అందరి మొహాలు కళ్ళముందు కదలాడుతూ వుంటే ఇక నా వల్ల కావడం లేదు. కళ్ళ నిండా నీళ్ళు!అదిమి పట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా తన్నుకుని బయటకొచ్చేసింది.అమ్మా.... నాన్నా....ఎందుకు నన్నీ నరకంలో తెచ్చి పడేసారు? నేనే తప్పు చేసానని నాకింత శిక్ష విధించారు?ఎన్నాళ్ళు.... నాకీ నరకయాతన?నాన్నా... ఇక్కడ నాకు ఎన్నిబాధలు, భయాలు, అవమానాలు వున్నాయో నీకు తెలుసా?అమ్మా .... నీతో ఏదైనా మాట్లాడాలి అంటేనే భయమేస్తుందే, నన్నేం మాట్లాడనివ్వవు.‘ఏరా బావున్నావారా’ అని నువ్వడిగి చాలా రోజులవుతోందమ్మా? ఎప్పుడు నువ్వొచ్చినా, ఫోన్‌లో మాట్లాడినా నీ ధ్యాసంతా, నీ అక్కరంతా నా చదువు గురించే, మార్కుల గురించే.నా గురించి ఎప్పుడైనా పది నిమిషాలు తీరిగ్గా, ఓపిగ్గా మనసుతో ఆలోచించకూడదా అమ్మా...ఎట్లా చదువుతున్నావ్?ఎన్ని గంటలకి లేస్తున్నావ్?ఎన్ని గంటలకి నిద్రపోతున్నావ్?ఇంప్రూవ్‌మెంట్ వుందా లేదా?ప్రోగ్రెస్ ఏమిటి. సిలబస్ ఎంతవరకూ అయ్యింది?స్లిప్ టెస్ట్‌లో మార్కులెన్ని.అసైన్‌మెంట్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయి?యూనిట్ టెస్ట్స్ ఎట్లా రాసావ్?స్టడీ హవర్స్ ఎట్లా వున్నాయి? ఓరల్ టెస్ట్‌లో మార్కులెన్ని వస్తున్నాయి?ఏ సబ్జెక్టులో ఎవరు ఫస్ట్? నీకు సబ్జెక్ట్ వారీగా ర్యాంకింగ్ ఎంత?అమ్మా.... ఇట్లాంటి వంద ప్రశ్నలు, వెయ్యి ప్రశ్నలు గుర్తుంచుకుని మరీ ప్రతీసారీ అడుగుతావు కదమ్మా.