ఎ ర్రటి మట్టిని లేపుతూ ‘రయ్‌’మంటూ దూసుకొచ్చిన రోడ్‌ రవాణా సంస్థ బస్సు ‘మిట్టమీద కండ్రిక రచ్చబండవద్ద కీచుమంటూ అరుస్తూ ఆగింది.గుప్‌మంటూ ఎర్రదుమ్ము బస్సును కమ్మేసింది.దుమ్ము వూదుకొంటూ ప్యాసింజెర్లు దిగారు.బస్సు వెళ్లిపోయాక, రేగిన దుమ్ము తగ్గింది. దిగినవారు తలో దిక్కుకు వెళ్లిపోయారు. వారిలో ఒకతను నింపాదిగా రచ్చబండవైపు నడిచాడు. తన దృష్టిని అక్కడ కూర్చున్న వారివంక మరల్చాడు.ఇద్దరు పెద్దాళ్లు పులీ, మేకా ఆడుకొంటున్నారు.ఓ పెద్దాయన చుట్ట పీలుస్తూ... ఎక్కడో ఆలోచిస్తున్నాడు.యింకో ముసలాయన తలక్రింద పైపంచ చుట్టబెట్టుకొని కునుకు తీస్తున్నాడు.అతను వారిని చూశాడే తప్ప... వారెవరూ పట్టించుకోలేదు. వారి లోకం వారిదే...అతను వాచీ వంక చూసుకొన్నాడు. పదకొండు దాటింది. చంకకు తగిలించు కొన్న చేతిసంచిని తెరిచి, అందులోంచి విబూధి తీసి ముఖాన రాసుకొన్నాడు. కండువాను తీసి తలపాగాలా బిగిం చాడు. తిరిగి సంచిని చంకకు తగి లించి... రచ్చబండకు దిగువగా వున్న మట్టిబాటన నడకసాగించాడు.ఫర్లాంగుదూరంలో పల్లె కన్పిస్తుంది. అక్క డక్కడా విసిరేసినట్లున్న యిళ్లు. డాబాలు... యెక్కువ సంఖ్యలో పూరిళ్లు... అభివృద్ధి చెందిన దాఖలాలు తక్కువ...తనకి కావల్సిందీ... అదే...! నాగరికత మరీ తెలియనిపల్లె. నాజూకుతనం యెరగని నారీమ ణులు.తను ముందుకు నడుస్తూ... చుట్టుప్రక్కల యిళ్లూ, లోగిళ్లూ గమనిస్తూ.... ‘‘ప్రశ్న చెపుతా నమ్మ... ప్రశ్న....!!’’ అనసాగాడు.

పల్లె మధ్యవరకూ వెళ్లాడు. వేపచెట్టు క్రింద ఐదారుమంది ఆడాళ్లు కూర్చొని కబుర్లాడు కొంటున్నారు. సాధారణంగా ఆ సమయంలో పల్లె లోని మగజనమంతా పనులకు వెళతారు. పని చేయనివారు... చంటాళ్లు, ముసలోళ్లు మాత్రమే వుంటారు.‘‘ప్రశ్న చెపుతానమ్మ.... ప్రశ్న....!!’’ అన్నాడు. వారంతా తలెత్తి తన వంక ఓ మారుచూసి, మళ్లీ కబుర్లకి దిగారు.వారిలో యెలాంటి స్పందన రాలేదు. యింకా ముందుకు సాగి, వీధి చివరివరకు వెళ్లి వెనక్కి తిరిగాడు. వేపచెట్టు దగ్గరకు వచ్చి మరోసారి అన్నాడు.స్పందన రాలేదు.వారి లోకంలో వారున్నారు.రెండడుగులు ముందుకువేసి ఓ ఇంటి ముందు ఆగాడు.సుమారైన లోగిలి.... కాస్త వున్నంత వారిగానే కన్పిస్తూంది.వాకిట్లో నిల్చొని యింటివైపు తేరిపార చూశాడు.అపడు... తను అనుకున్నట్టే జరిగింది...! వేపచెట్టు క్రింద కబుర్లాడుకొంటున్న వాళ్లలో చలనం వచ్చింది. వారిలోంచి ఒకామె చకచక తనవైపు వస్తూ ‘‘యేందయ్యా...! పెద్దాయనా... మా యింటిలోకి చూస్తున్నావ్‌?’’ అంది.అతను ఉలకలేదు... పలకలేదు. మౌనంగా కళ్లు మూసుకొని తనలో తనే యేదో గొణు క్కుంటున్నాడు.ఆమెలో టెన్షన్‌ పెరిగిపోతోంది. అతని వంక, తన యింటి వంక మార్చి మార్చి చూస్తోంది. యింతలో మిగతావాళ్లు అక్కడకు చేరారు.అతను రెండు నిమిషాల తర్వాత మెల్లిగా కళ్లు తెరిచాడు.వారందరూ ఆతృతగా ‘‘యేంటి పెద్దా యనా...?’’ అన్నారు.