విశాఖ పట్నం ఆంధ్రా యూనివర్సిటీలో చేరిన కొత్తల్లో, విశ్వం తన తండ్రి తాతబ్బాయికి ఒక వుత్తరం రాశాడు.ఆ వుత్తరంలోని కొన్ని ముఖ్యాంశాలు: ‘నాన్నగారూ, ఇప్పుడిప్పుడే నేను ఇక్కడ యూనివర్శిటీ వాతావరణానికి అలవాటు పడుతున్నాను. కొంతమంది మంచి స్నేహితులు దొరికారు. బాగా కష్టపడి చదువుతున్నాను. నా ధ్యేయం నేను ఎప్పుడూ మరిచిపోను. నా చదువు గురించి అందుకు అవసరమయిన డబ్బు గురించి, మీరు ఎన్నెన్ని కష్ట నష్టాలు పడుతున్నారో, అర్థాకలితోనే వుంటూ ఏ రకంగా రెక్కల్ని ముక్కలు చేసుకుంటున్నారో, ఎన్ని అవమానాల్ని భరిస్తూ వున్నారో నాకు బాగా తెలుసును.మీ ఋణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా, ఏమి చేసినా, తీర్చుకోలేనన్న గ్రహింపు నాకుంది. మిమ్మల్ని అమ్మనీ చూడాలని నాకు ఎంతో ఇదిగా వుంది. కానీ, చదువు ముఖ్యమని మీరు అన్న మాటలు నాకు గుర్తున్నాయి. అందుకే సెలవులకి నేను మన వూరు రావటం లేదు. అమ్మ, మీరు, మన వూరు ఎల్లప్పుడూ నా మనస్సులో మెదులుతూ వుంటారు. గుండె ఆర్థ్రమై, నా కన్నులలో నీరు చిప్పిల్లుతూ వుంటుంది.

 మన వూరే నా దేవాలయం. మీరే నా దేవుళ్ళు. నాన్న గారు! గుండెను దిటవు పరచుకుని ధైర్యంగా ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నాను.ఆ తర్వాత కొన్నేళ్ళకి విశ్వం తన తండ్రికి రాసిన కొన్ని వుత్తారాల్లోని ఒక వుత్తరంలోని కొన్ని ప్రధానమయిన అంశాలు: ‘నాన్నగారు. కాలం ఎంత వేగంగా పరుగులు తీస్తుంది! ఈ జీవితాల్లో ఎన్నెన్ని మార్పుల్ని తీసుకుని వస్తుంది!! పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, యూనివర్శిటీకే ఫస్టుగా పూర్తి చెయ్యటం, వెంటనే ఒక పెద్ద కంపెనీలో ఆఫీసరుగా హైదరాబాదులో సెటిలవటం నా జీవితంలో అనుకోని మార్పు అయితే, మీ ప్రయత్నం ఫలించి పద్మతో నా వివాహం జరగటం నా అదృష్టంగా భావిస్తాను. మా కాపురం అందంగా కొత్త కొత్తగా వుంది. పద్మ చాలా మంచి అమ్మాయి. నేనంటే ప్రాణం! నాకూ తనంటే అంతే. నాది బాధ్యత గల పెద్ద వుద్యోగం. మంచి జీతం. ఇల్లూ, కారూ, నౌకర్లూ కంపెనీ వారే ఇచ్చారు. పని ఎక్కువగానే వుంటుంది. నాకు అదేమంత కష్టమనిపించదు. అమ్మా మీరూ ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు మా దగ్గర వుండమంటే, ఆ వూరు వదిలి రానంటారు మీరు! అమ్మకి ఈ మధ్యన ఆరోగ్యం అంత బాగుండటం లేదని, నన్ను చూడాలని అంటున్నదనీ- రాశారు. నాకూ రావాలని వుంది, కాని పని వత్తిడి వలన రాలేకపోతున్నాను. అమ్మని మంచి డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళి చూపించండి. ఆరోగ్యం గురించి మీరిద్దరూ మరింత శ్రద్ధ తీసుకొనవలసిన అవసరం వుంది. మనీ ఏమయినా కావాలా? పంపించమంటే పంపుతాను.’