దిగంతాల నుంచి ఆకాశమంతా వ్యాపించిన చీకటి నల్లటి పిశాచంలా కనిపిస్తూ ఉంది. ఆ చీకట్లో నవాబుపేట కానుకొని వున్న వాగులేరు ప్రవహిస్తున్న శబ్దం సన్నగా మధురంగా వినిపిస్తూ ఉంది.గుడిసె ముందర ... తుంగ చాపపైన గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు ఖాదర్‌ బాషా.అతనికి కొంత దూరంలో వున్న పాత నులక మంచంమీద మాసిపోయిన చున్నీని దుప్పటిలా కపకొని, చినిగిన సల్వార్‌ కమీజ్‌లో, కాళ్ళు కడుపులోకి ముడుచుకొని చిగురుటాకులా వణికిపోతూ, నాగులేటి శబ్దం వింటూ పడుకొని వుంది పదహైదేండ్ల సల్మా. రాత్రంతా నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఎంతకూ నిద్ర రావడం లేదు.‘‘రేపు నువ్వు పెందరాళే రా. బూజు దులపాలి. ఇల్లు కడగాలి. చదువు పేరు చెప్పి నిలిచిపోయావనుకో వీపు చీరేస్తాను’’నిన్న పని ముగించే ముందు, మరో పనిమనిషి రాజమ్మ ఎదుట యజమానురాలు అన్న మాటలు ఇంకా చెవుల్లో గీపెడుతూనే ఉన్నాయి.రాత్రి గడచిపోతోందిగానీ, ఆలోచనలు తెగిపోవడం లేదు. చల్లగా శరీరాన్ని తాకుతున్న ఈదురుగాలి. వెన్నులో వణుకు. సల్మా చున్నీని పక్కకు తీసి కళ్ళు తెరిచింది.

అపడే తూర్పు తెల్లబడుతూ ఉంది.ఉలిక్కిపడి లేచి ‘అపడే తెల్లారుతోందే’ అనుకొంటూ గుడిసెవైపు చూసింది.గుడిసె లోపల పడుకొన్న అమ్మ, తమ్ముళ్లు ఇంకా లేచినట్టు లేదు. నాన్న గుర్రుపెడుతూ ఇంకా నిద్రపోతూనే వున్నా డు.‘ఈ మనిషిదేముం ది. అమ్మీజాన్‌, నేను నాలుగిళ్లలో పనిచేసి తీసుకొస్తే తింటాడు, తాగుతాడు. వట్టి బాధ్యతలు లేని మనిషి’ అనుకొని జారిన జుట్టు ముడికి రబ్బరు బ్యాండు పెట్టుకొంటూ హడావిడిగా బయలుదేరింది సల్మా.అప్పటికే రాజమ్మ గేటు ముందర నీళ్లు చల్లి ముగ్గు పెడుతోంది. ‘హమ్మయ్య బ్రతికిపోయాను. అమ్మగారు యింకా లేవలేదు’ అనుకొంటూ గట్టిగా గాలిపీల్చివదులుతూ ఇంటి పెరట్లోకి వెళ్లి, రాత్రి తిని పడేసిన ఎంగిలి అంట్లు తోమడంలో నిమగ్నమైపోయింది.రాత్రి ఇంట్లో తన విషయంగా ఓ చిన్నపాటి రణరంగమే జరిగింది. అందుకే రాత్రి భోజనం కూడా చెయ్యలేదు. నీరసంగా ఉంది. కళ్లు తిరుగుతున్నాయి. శరీరంలో నిస్సత్తువ. శక్తినంతా కూడదీసుకొని పళ్ల బిగువుతో పనిచేసుకుపోతూ వుంది.