‘‘చీకట్లో కూర్చున్నావేం?’’ అంటూ లైట్‌ స్విచ్‌ వేసి గదిలోకొచ్చిన రేవంత్‌, ప్రవల్లిక మొహం చూడగానే, మళ్లీ ఏమైందోనన్న ఆదుర్దాతో, సోఫాలో ఆమె పక్కనే కూర్చొని తన చేతులు ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరకు తీసుకున్నాడు. కాసేపయ్యాక ప్రవల్లికే మాట్లాడింది.‘‘జెన్నీ అబార్షన్‌ చేయించుకుంటుందట!’’‘‘అయ్యో! నెలక్రితమే కదా పాపం తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయ్యింది..’’ సానుభూతిగా అన్నాడు రేవంత్‌.‘‘బ్రేకప్‌ కోసం కాదు రేవంత్‌, పాపం. నాలుగో నెల వచ్చాక తన కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని బ్రేకప్‌ సాకుతో అంతం చెయ్యాలనుకోవటం పాపం. ఒకవందమంది హంతకులని వదిలేసైనా ఒక అమాయకుడి ప్రాణం పోకుండా కాపాడుకుందాం అన్న సూత్రం పునాదిపై చట్టాలు నిర్మించుకున్న ఈ సమాజమే, ఏ పాపం చెయ్యని ఒక మూగప్రాణి ప్రాణా లు తియ్యడాన్ని చట్టబద్ధం చెయ్యటం మహాపాపం’’ ఆవేశంతో ఊగిపోతోంది ప్రవల్లిక.

ఆ ఆవేశానికి నేపథ్యం తెలిసిన రేవంత్‌, ఏ భావావేశం లేకుండా నిశ్చలంగా వింటూ కూర్చున్నాడు.ఫఫఫప్రవల్లిక, రేవంత్‌లు రెండేళ్లపాటు ప్రేమించుకుని, ఏ సినిమా కష్టాలూ పడకుండానే పెళ్లి చేసుకుని, చేతుల్లో రెండు హెచ్‌వన్లు, కళ్లల్లో బోలెడు ఆశలు పెట్టుకుని అమెరికాలోని చికాగోలో కాలిడి ఏడేళ్లు కావొస్తోంది. ప్రవల్లిక ఒక ఫైర్‌బ్రాండ్‌ పర్సనాలిటీ. ప్రతి అంశంపై నిశ్చితాభిప్రాయంతో పాటు, వాటికి గొంతునిచ్చే చక్కటి వాక్పటిమ ఆమె సొంతం. ‘‘హ్యాపీ గో లక్కీ’’. అరుదుగా ఉండే వినే గుణం రేవంత్‌ నైజం కాబట్టి, ప్రత్యేక ప్రయాస లేకుండా, పరస్పరాకర్షణతో, పెద్దగా స్పర్థలు లేని సంసార చక్రం ఓ నాలుగేళ్లు తిప్పేసారు.పిల్లల గురించి ఇరుపక్షాల పెద్దవాళ్ల నుంచీ వాకబు లెక్కువవటం ఒక కారణమైతే, మాతృత్వంతో స్త్రీత్వపు వృత్తాన్ని పూర్తిచేద్దామన్న తలపు ప్రవల్లికలో కూడా బలంగా ఉండడం వల్ల, నియంత్రణకు స్వస్తి చెప్పి కుటుంబాన్ని వృద్ధి చెయ్యటానికే నిర్ణయించుకున్నారు ఇద్దరూ.మొదటి నాలుగునెలలు పీరియడ్‌ ఒక్క రోజు ఆలస్యమైనా, ఇంట్లోనే గర్భధారణ పరీక్ష చేసుకుని ఆ పరీక్షా పరికరంలో కనపడే రెండు నిలువుచారల కోసం క్షణమొక యుగంలా వేచిచూసి, చివరకు ఒక్క నిలువు చార చూసి నిరాశ చెందటంలో గడిచిపోయాయి.