‘‘రేపు నే పెళ్లి చేసుకుంటున్నా- నువ్వూ మీ ఆవిడ రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు రావాలి- ఏం?’’ రఘురాం చెప్పిందానికి, చలపతినిశ్చేష్టుడయ్యాడు. క్షణం నోట మాట రాలేదు. నిజమా-లేక పరిహాసమా? అన్న సందిగ్ధంలో వుండగానే, రఘురాం‘‘చలపతీ- ఇది నిజం! రేపు కారు తీసుకవస్తా! మీ ఆవిడను ఓపిక చేసుకు రమ్మను.రిజిస్ట్రార్‌ ఆఫీసులో కార్యక్ర మం అయ్యాక, స్వాగత్‌ హోటల్లో విందు- సరేనా?’’ అని చెప్పి, వచ్చినంత వేగంగా వెళ్లాడు.చలపతి అలా, స్థాణువులాగా వుండిపొయాడు.ఇంతలో, లోపల్నుంచి, చలపతి భార్య సరోజ, కాళ్లు ఈడ్చుకుంటూ వచ్చి, కుర్చీలో కూలబడి ఆయాసంతో ‘‘ఎవరు వచ్చింది? పెళ్లెవరికీ?’’ అనడిగింది.‘‘రఘురాం- రిజిష్ట్రారాఫీసులో రేపు పెళ్లిచేసుకుంటాడట- మనం వెళ్లాలి’’సరోజ క్షణం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తేరుకుంది.‘‘రఘురాంకి పెళ్లా--- అయన మాకంటే---‘‘ఓ సంవత్సరం పెద్ద!’’‘‘మరిప్పుడు పెళ్ళేమిటీ?’’చలపతి దగ్గర సమాధానం లేదు.‘‘కొడుకులకీ సంగతి తెలుసా?’’‘‘ఏమో?’’‘‘ఇన్నేళ్లొచ్చి- ఇప్పుడిదేం పొయ్యే కాలం?’’ సరోజకు ఆయాసం వచ్చి, ఆశ్చర్యపోయి, భర్త నుంచి సమాధానం రాక, ఊరుకుంది.చలపతి బుర్రలో- రఘురాం జీవితంలో ఘట్టాలు- గిరగిరా తిరుగుతున్నాయి.చలపతి-రఘురాం ఇద్దరూ కల్సి చదువుకున్నారు.చలపతి చరిత్రోపన్యాసకుడిగా జీవితంలో స్థిరపడితే, రఘురాం బ్యాంకులో చేరి, క్రమక్రమంగా ఎదిగి, పెద్దాఫీసరుగా పదవీ విరమణ చేశాడు.

ఎప్పుడు- మల్లెపువ్వులాంటి వస్త్రధారణ కళ్లకు రిమ్‌లెస్‌ జోడు, కొన్నాళ్లు స్కూటరు ఆ తర్వాత కారు, విశాలమైన బ్యాంకు కేటాయించిన ఇళ్ళలో నివాసం- ఇదీ రఘురాం జీవన సరళి. డబ్బుకు, సౌఖ్యాలకు పరపతికీ మారుపేరుగా రఘురాం బ్రతికితే-చలపతి- పేరుకు కాలేజీలో లెక్చరర్‌ అయినా, తమ్ముళ్ల చదువులు- చెల్లెలు పెళ్లి, తల్లిదండ్రుల పోషణ- ఆ బాధ్యతే, తర్వాత పిల్లల చదువులు- పెళ్లిళ్లు- ఇలా బాధ్యతల బరువు మోసి, వయస్సు కన్నా వృద్ధాప్యం ఛాయలతో- అసలు, సిసలు-బడి పంతులుకు ప్రతిరూపంగా నిలిచాడు.ఉద్యోగాలు- జీవన విధానం వేరయినా పండుగలకు, పెళ్లిళ్లకు, శుభకార్యాలకు- కలవడం వల్ల రెండు కుటుంబాల మధ్య, అనుబంధం ఆత్మీయతలు గాఢంగానే వుండేవి.‘‘సావిత్రి- పోయి ఎన్నాళ్లయింది’’ సరోజ ప్రశ్నించింది.‘‘రఘురాం రిటైర్‌మెంట్‌కు అటో ఇటో’’‘‘అంటే, నాలుగేళ్లు. ఈ నాలుగేళ్లలో ఈయనకు మళ్లీ పెళ్లి కావాల్సోచ్చిందా?’’చలపతి మాట్లాడలేదు, ఎందుకంటే- అతనికీ సమాధానం తెలియదు గనుక!మర్రోజు, వోపిక లేకపోయినా సరోజతో చలపతి, రిజిష్ర్టార్‌ ఆఫీసుకు వెళ్లాడు. ఇద్దరూ సాక్షి సంతకాలు చేశారు. దంపతులు, దండలు మార్చుకున్నారు.సరోజకు పెళ్లికూతురును చూడగానే ఎక్కడో చూశానే, అన్న జ్ఞాపకపు దొంతరలు కళ్ల ముందు తిరుగాడాయి.హోటల్‌లో విందు జరుగుతున్నప్పుడు చొరవ తీసుకుని, పెళ్లికూతురు దగ్గర కెళ్లి పరిచయం చేసుకుని- ‘‘నువ్వు---శకుంతలవి గదా?’’ అనడిగింది.శకుంతల చిరునవ్వుతోనే, ‘ఔ’నన్నట్లు సమాధానం చెప్పింది.