‘‘నీకు విరామం దొరకగానే వెంటనే నాతో మాట్లాడు ‘‘కోస్టారికా రాజధాని సాన్‌ హోజేలో పని ముగించుకుని జువాన్‌ సాంటామరియా ఏర్‌పోర్ట్‌కి బయలుదేరబోతున్న భాస్కరం ఈ సందేశం చూసుకుని ఆశ్చర్యపోయాడు.పిన్ని ఇంత అత్యవసర సందేశాలు ఎప్పుడూ ఇవ్వదు.సాయంత్రం ఆరు అవుతోంది. అక్కడ బహుశా తెల్లవారుతుంటుంది.వెంటనే ఫోన్‌ చేసాడు.‘‘నేను ఇవాళే మామిడిపల్లి వచ్చాను భాస్కరం. పోలమ్మ ఇవాళో, రేపో అన్నట్టుంది. వారం రోజులనుండి శ్రీకాకుళం ఆస్పత్రిలో ఉంచారట. మామిడిపల్లిలోనే పోతాను అని గొడవ చేస్తే ఇదిగో నిన్ననే తీసుకు వచ్చారు. ఇవేల్టినుండి మాట కూడా లేదు. నన్ను చూస్తూనే ముఖంలో ఎంతవెలుగు వచ్చిందనుకున్నావు. పిచ్చిది. ఎంత అభిమానమో మనమంటే. నీ గురించి అడుగుదామని తాపత్రయపడుతున్నట్టే అనిపించింది. అందుకే నీకు ఫోన్‌ చేసాను.’’ పోలమ్మతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటోందామె. వాటిలో భాస్కరానికి తెలిసిన విషయాలే కాకుండా కొత్త విశేషం ఒకటుంది.అది ఎలాంటి విశేషం!మెలకువలోనూ, కలలో కూడా మనసును స్పృశిస్తూనే ఉంటుంది. ఒక ఆధిపత్య ధోరణిని ధిక్కరిస్తూనే ఉంటుంది.మనుషుల మధ్య సంబంధాలు ఏ రూపంలో ఉండాలో ఒక పాఠంలా బోధిస్తూనే ఉంటుంది.‘‘పిన్నీ నేను వస్తున్నాను’’ క్షణం కూడా ఆలోచించకుండా అన్నాడు.‘‘భాస్కరం’’ ఆశ్చర్యపోయిందావిడ.‘‘అవును పిన్నీ’’‘‘ఎప్పుడు బయలుదేరతావు. ఇదేమైనా మామూలు ప్రయాణమా.

 ఇంతదూరం ఎప్పటికి చేరతావు?’’‘‘ఇప్పుడే ఏర్పాట్లు చేసుకుంటాను. నేను ఎప్పుడు బయలుదేరేది, ఎప్పుడు అక్కడకు చేరేది మళ్ళీ నీకు ఖరారు చేసి చెప్తాను.‘‘అప్పటిదాకా...’’‘‘ఎలాగోలా మేనేజ్‌ చెయ్యి. నాకు తెలుసు నువ్వు చెయ్యగలవు.’’ అంటూ ఫోన్‌ పెట్టేసాడు.సుమారు ఐదు గంటలు ప్రయాణం న్యూయార్క్‌ చేరడానికి. భార్యకి ఫోన్‌ చేసి వివరంగా చెప్పాడు. లాప్‌టాప్‌ తెరిచి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూసుకున్నాడు. తనకు ముఖ్యమైన సమావేశాలు ఏమీలేవని నిర్ధారించుకున్నాక, మిగిలిన ఒకటి, రెండు పనులు వాయిదా వేయమని తన సహాయకుడికి చెప్పాడు. న్యూయార్క్‌లో భాస్కరం భార్య అతడికి కావలసిన వస్తువులు ఏర్‌పోర్ట్‌లోనే అందజేసింది. అదృష్టవశాత్తు ఎక్కువ సమయం వృథా కాకుండా అతడికి హైదరాబాద్‌ వెళ్ళే విమానంలో టికెట్‌ దొరికింది.్‌్‌్‌పోలమ్మ ఎవరు?సుమారు నలభైఏళ్ళ క్రితం సంగతి. భాస్కరం పుట్టడానికి రెండు సంవత్సరాల ముందు రాజమండ్రిలో ఒక ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న భాస్కరం తండ్రికి శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో బడిపంతులు ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వోద్యోగం కావడంతో చేరిపోయాడు. వెంటనే దగ్గర బంధువుల అమ్మాయి శారదతో వివాహం, ఆ పల్లెలో కాపురం. పోలమ్మ ఆ ఇంట పనికి కుదిరింది. ముప్పై ఏళ్ళ వయసు. బక్కపల్చటి శరీరం. కష్టపడేతత్వం. అంతకుమునుపు పనిచేసిన ఏ ఇళ్ళల్లో దొరకని ప్రేమ, గౌరవం పోలమ్మకి ఆ ఇంట దొరికాయి.