మా నాన్న ప్లీడరుగా కొంచెం పేరు సంపాదించాడు. వాళ్ల నాన్న కూడా ప్లీడరే. వాళ్ల నాన్న అంటే మా నాన్నకు తాత. పెద్ద ప్లీడరుట. చాలా డబ్బు సంపాదించాడట. మా నాన్న ఎపడూ చెబుతుంటాడు. కాని మా నాన్న ప్లీడరుగా ఏమీ సంపాదించలేకపోతున్నాడు.వాళ్ల తాత గురించి ఎపడూ అంటే నా చిన్నతనం నుంచి గొప్పలు చెబుతూనే వున్నాడు మా నాన్న. అలా చెప్పి చెప్పి బలవంతంగా నాతో ‘లా’ చదివించాడు. సంపాదన సరిగా ఉండదని తెలిసినా మా నాన్న ఎందుకు నన్ను ఇందులో ఇరికించాలని చూస్తున్నాడో తెలీదు. నాకు అక్కడే ఆ ఊళ్లోనే జీవితాంతం ఉండాలంటే కష్టంగా ఉందని చెప్పినా వినలేదు.బహుశా నేనొక్కడినే సంతానం కాబట్టి వారిని చూసుకుంటూ ఉండాలని నాన్న ఆలోచనా? ఏమో?మా నాన్నకు తాత కట్టించిన ఎనిమిది గదుల డాబా మీద రెండు గదుల రేకుల షెడ్‌ వేసి, ఎవరో ట్యూషన్స్‌ చెప్పేవారికి అద్దెకిచ్చారు.

మా అమ్మ పొలం నుంచి ధాన్యం, కొంత డబ్బు వస్తుంది.ఒకవేళ నేను కూడా అలాగే జీవితం గడపాలని నాన్న ఆలోచన కావచ్చు. మా ఇంటి ముందు గది ఆఫీసు గది. చెక్క టేబుల్‌ వెనుక గోడకు ఆనుకుని చెక్క కుర్చి. మా నాన్న చెమటను పీల్చుకుని ఆ కుర్చి, తల జిడ్డుని పీల్చుకుని ఆ గోడ నల్లగా మారిపోయాయి. అక్కడ కూర్చోవాలంటే నాకు ఆముదం తాగినట్లుంటుంది. కాని ఆ కుర్చీలో నేను తప్ప మరొకరు కూర్చోవటం నాన్నకు ఇష్టం లేదు.నేను ‘లా’ పూర్తి చేయగానే నాన్న నన్ను అందులో బలవంతంగా కూర్చోబెట్టాడు. ఆ కుర్చీలో కూర్చోగానే నాకు వళ్లు దురద పెట్టినట్లనిపించింది.‘‘దురద పెట్టినట్లుందా? ఫరవాలేదు లేవోయ్‌ మొదట్లో అలాగే ఉంటుంది’’ అని నాన్న నవ్వుతుంటే నాకు నచ్చలేదు.వెంటనే లేచాను.కాని, నాన్న నన్ను మళ్లీ ఆ కుర్చీలో కూలదోసి టేబుల్‌ ఇటుపక్కనున్న ఇనుప కుర్చీలో క్లయింట్‌లాగ కూర్చుని నన్ను మెరుస్తున్న కళ్లతో చూడసాగాడు.‘‘చదువు ఎలాగూ అయిపోయింది. కొద్దిగా ప్రాక్టికల్స్‌ అంటే ప్రాక్టీస్‌ నేర్చుకుంటే అచ్చమైన ప్లీడరువి నువ్వే’’ అన్నాడు.